రుచిని ఉటంకించండి | Sompeta Utanki Sweet Speciality | Sakshi
Sakshi News home page

రుచిని ఉటంకించండి

Nov 16 2019 3:04 AM | Updated on Nov 16 2019 3:04 AM

Sompeta Utanki Sweet Speciality - Sakshi

ఒక్కో ప్రాంతానికి ఒక్కో పిండి వంటకం గుర్తింపు తీసుకువస్తుంది. ఉటంకి అటువంటిదే. సోంపేట వాస్తవ్యులైన కింతలి కుటుంబరావు దంపతులు తయారుచేసే ఉటంకులతో ఆ ఊరి పేరు ప్రపంచ పటంలో చేరింది. అత్తవారి దగ్గర నుంచి వారసత్వంగా నేర్చుకున్న ఆ వంటకాన్నే జీవనోపాధిగా చేసుకుంటున్నారు ఆ కుటుంబ సభ్యులు. ఉటంకులతో దేశవిదేశాలవారి మనసులను తీపి చేస్తున్నారు. సుమారు 50 సంవత్సరాలుగా కింతలి కుటుంబం వారు మాత్రమే చేస్తున్న ఉటంకుల విజయయాత్ర ఈ

వారం ఫుడ్‌ ప్రింట్స్‌...
ఆ ఇంట్లోకి ప్రవేశిస్తుండగానే పీటల మీద కూర్చున్న భార్యభర్తలు, వారికి ఎదురుగా మరుగుతున్న నూనెతో నిండిన నాలుగు బాణళ్లూ కనిపి స్తాయి. పక్కనే ఉన్న పిండి గిన్నెలో ఐదువేళ్లను ముంచి తీగెలుగా సాగుతున్న పిండి చేతితో జంతికల మాదిరిగా తిప్పుతూ నూనెలో వేయడం చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతంలోని సోంపేట పట్టణంలో వంశపారంపర్యంగా నేర్చుకున్న వంటకం ఆ కుటుంబానికి జీవనోపాధిగా మాత్రమే కాదు, వారి ఇంటి పేరుగా మారింది. ఉటంకి వంటకం తయారీ మొట్టమొదటగా ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లా గుమ్మ లక్ష్మీపురం గ్రామంలో ప్రారంభమైంది.

రెండు తరాల క్రితం కింతలి కుటుంబీకులు తమ ఆడ పిల్లలకు పండగ పూట మర్యాద చేయడం కోసం, కింతలి శ్రీనివాసరావు తల్లి ధనలక్ష్మి నేర్చుకున్నారు. జీవనోపాధి కోసం శ్రీనివాసరావు ఇరవై సంవత్సరాల క్రితం సోంపేటకు వచ్చి, అక్కడ వైశ్యరాజు వెంకన్న సహాయంతో తాము నేర్చుకున్న వంటకాన్ని వ్యాపారంగా మార్చుకున్నారు. భార్య లక్ష్మితో కలిసి ఉటంకి స్వీటు తయారు చేసి అమ్మడం ప్రారంభించారు. అదే వారి కుటుంబాన్ని నిలబెట్టింది. వారి ఇంటిపేరును ఉటంకిగా మార్చేసింది.

రోజుకి 800 ఉటంకుల తయారీ
సుమారు 20 సంవత్సరాల క్రితం వారు తమకు వారసత్వంగా మారిన వంటకాన్ని వ్యాపారంగా ప్రారంభించినప్పుడు రోజుకు 100 ఉటంకులు తయారు చేసేవారు. అప్పట్లో ఒక ఉటంకిని రూ.1.50 పైసలకు అమ్మేవారు. ఇప్పుడు రోజుకి 800 ఉటంకులు తయారుచేస్తూ వ్యాపారాన్ని వృద్ధి చేస్తున్నారు. ప్రస్తుతం ఒక ఉటంకి ధర 12 రూపాయలు.
– కందుల శివశంకర్‌, సాక్షి, శ్రీకాకుళం
ఫొటోలు: పిరియా ధర్మేంద్ర, సోంపేట

నాణ్యత పాటిస్తాం...      
మిక్సీలో బియ్యం, పాలు, పంచదార వేసి గ్రైండ్‌ చేస్తే, తీగెలాంటి పదార్థం తయారవుతుంది. ఆ పిండినే ఉటంకిల తయారీకి వాడతాం. ఒక రోజు వాడిన నూనెను  రెండో రోజు ఉపయోగించం. ఉటంకి స్వీట్‌ తయారు చేయడం చాల కష్టం. చాలామంది మా దగ్గరకు వచ్చి నేర్చుకున్నారు, కానీ చేయలేకపోతున్నామని చెబుతున్నారు. నేర్చుకోవాలనే పట్టుదల ఉంటే సాధించగలుగుతారు. వంశపారంపర్య వంటకం కావడంతో మేము సులువుగా నేర్చుకున్నాం. పూర్తిగా ఆరోగ్యమైన వంటకం కావడంతో వీటిని అందరూ తినచ్చు. ఇవి సుమారు ఆరు నెలల పాటు నిల్వ ఉంటాయి. చుట్టుపక్కల ప్రాంతాల వారు మా దగ్గర కొని, వాళ్ల గ్రామాలలో అమ్ముతుంటారు.  
– కింతలి శ్రీనివాసరావు, సోంపేట

మాకు జీవనోపాధి
వంశ పారపర్యంగా నేర్చుకున్న వంటకం మా ఇంటి పేరుగా మారింది. మా దగ్గర ఉటంకి తయారీ నేర్చుకోవడానికి చాలామంది వచ్చారు. తయారుచేయడానికి ఓపిక ముఖ్యం. మేం నేర్చుకోవడానికి నెలరోజుల సమయం పట్టింది.
– కింతలి లక్ష్మి, సోంపేట

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement