
నా వయసు 33 ఏళ్లు. ఒక మంచి కార్పొరేట్ సంస్థలో ఉద్యోగిని. నా నిద్రపై నాకు ఎలాంటి నియంత్రణా ఉండటం లేదు. మీటింగ్స్‌లో పాల్గొంటున్నప్పుడూ, తింటున్నప్పుడు కూడా నాకు తెలియకుండానే నిద్రలోకి జారిపోతున్నాను. దీని వల్ల నాకు చాలా ఇబ్బందులు వస్తున్నాయి. నా సమస్యకు పరిష్కారం చూపండి.
– డి. రవికుమార్, హైదరాబాద్
మీరు చెబుతున్న దాన్ని బట్టి మీరు నార్కొలెప్సీ అనే నిద్ర సంబంధమైన రుగ్మతతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. నార్కొలెప్సీ అనే సమస్యలో నిద్ర, మెలకువ రావడం... ఈ రెండూ ప్రభావితమవుతాయి. ఇలాంటి సమస్య ఉన్నవారు పగటివేళ కూడా నిద్రలోకి జారిపోతుంటారు. ఏ పని చేస్తున్నా ఆ సమయంలో తమకు తెలియకుండానే నిద్రలోకి వెళ్లిపోతుంటారు. సాధారణంగా నిద్రలో దశలు కొన్ని సైకిల్స్‌లో నడుస్తుంటాయి. అంటే ప్రారంభ దశ తర్వాత గాఢ నిద్ర దశ, ఆ తర్వాత కనుపాపలు వేగంగా కలిదే దశ... ఇలాగ. కనుపాపలు వేగంగా కలిదే దశను ర్యాపిడ్ ఐ మూవ్‌మెంట్ (ఆర్‌ఈఎమ్) నిద్ర దశగా పేర్కొంటారు. నార్కొలెప్సీతో బాధపడేవారిలో నిద్రలోకి జారుకున్న వెంటనే ఆర్‌ఈఎమ్ నిద్ర దశ వేగంగా వచ్చేస్తుంది. ఈ ఆర్‌ఈఎమ్ దశలోనే మనకు కలలు వస్తుంటాయి. ఈ దశలో కనుపాపలు, ఊపిరితిత్తులను పనిచేయించే డయాఫ్రమ్ తప్ప మిగతా అన్ని కండరాలూ పూర్తిగా అచేతన స్థితిలో ఉంటాయి.
నార్కొలెప్సీ సాధారణంగా 15 నుంచి 25 ఏళ్ల వయసరులో మొదలవుతుంది. అయితే అది ఏ వయసువారిలోనైనా కనిపించే అవకాశం ఉంది. నార్కొలెప్సీ ఎందుకు వస్తుందనే అంశం ఇంకా తెలియదు. అయితే ఇది జన్యువులతో ముడిపడి ఉన్నందున చాలామందిలో నార్కొలెప్సీతో బాధపడేవారి పిల్లల్లో ది కనిపించడాన్ని పరిశోధకులు గమనించారు. ఇక మరికొందరు శాస్త్రవేత్తలు పేర్కొన్నదాని ప్రకారం మెదడులోని హైపోక్రెటిన్ అనే రసాయన లోపం వల్ల ఈ సమస్య రావచ్చు. ఈ సమస్య ఉన్నవారిలో ఆర్‌ఈఎమ్ దశకు సంబంధించిన సైకిల్‌ను కొనసాగించే మెదడులోపాలు ఉన్నట్లుగా శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ లోపాల వల్లనే మెలకువగా ఉండగానే అకస్మాత్తుగా నిద్రలోకి జారుకునే లక్షణాలు కనిపిస్తాయని వారి పరిశోధనల్లో తేలింది. అయితే నాడీవ్యవస్థకు చెందిన ఒకటి కంటే ఎక్కువ అంశాలు నార్కొలెప్సీని కలగజేస్తాయని అధ్యయనవేత్తలు పేర్కొంటున్నారు. నార్కొలెప్సీ వచ్చినప్పుడు మనం చేతనావస్థలో ఉపయోగించే కండరాలు అకస్మాత్తుగా అచేతనం అయిపోతాయి. మాటకూడా ముద్దముద్దగా వస్తుంది. బాధితులు కొన్ని రకాల భ్రాంతులకూ గురికావచ్చు. దీనికి పూర్తిగా చికిత్స లేకపోయినా కొన్ని యాంటీడిప్రసెంట్స్, యాంఫిటమైన్ మందులతో దీనికి చికిత్స చేయవచ్చు.
ఈ వయసులోనేరాత్రంతా నిద్రఉండటం లేదు
మా అబ్బాయి వయసు 13 ఏళ్లు. ఏడో తరగతి చదువుతున్నాడు. మేం ఎంతగా నిద్రపుచ్చడానికి ప్రయత్నించినా రాత్రివేళ త్వరగా పడుకోవడం లేదు. ఒక్కోసారి ఒంటిగంట, రెండు గంటల వరకు మొబైల్‌లో గేమ్స్ ఆడుతూ ఉంటున్నాడు. లైట్లు ఆర్పేసినా వాడు నిద్రపోవడం లేదు. అదేమిటంటే నిద్రపట్టడం లేదని అంటున్నాడు. ఇలా నిద్రపోకపోవడం వల్ల వాడికి ఏదైనా నష్టమా? దయచేసి చెప్పండి.
– ఆర్. నవీన, గుంటూరు
చిన్నపిల్లలకు నిద్ర చాలా అవసరం. పిల్లలు నిద్రలేమితో బాధపడుతుంటే అది భవిష్యత్తులో వారి ఆరోగ్యంపై తీవ్రమైన దుష్ప్రభావం చూపే అవకాశాలుంటాయి. ఈ వయసులో నిద్ర వల్ల వాళ్ల జ్ఞాపకశక్తి మరింత ఇనుమడిస్తుంది. నిద్రలో మన మెదడులో కొన్ని తరంగాలు లయబద్ధంగా కదులుతూ ఉంటాయి. వాటినే ‘షార్ట్ వేవ్ రిపుల్స్’ అంటారు. మనం ఏదైనా విషయాన్ని గుర్తుపెట్టుకున్నప్పుడు అది మరింతగా గుర్తుండిపోవడానికి కారణం ఈ తరంగాలే. 2009లో అమెరికన్, ఫ్రెంచ్ శాస్త్రజ్ఞులు నిర్వహించిన ఒక పరిశోధన ప్రకారం మన జ్ఞాపకాలు మన మెదడులోని హిప్పోక్యాంపస్ నుంచి మరో ప్రాంతం అయిన నియోకార్టెక్స్‌కు బదిలీ అయి... అక్కడ దీర్ఘకాలపు జ్ఞాపకాలుగా నిల్వ ఉంటాయి. మన మాటలో చెప్పాలంటే మన సిస్టమ్ (కంప్యూటర్)లో నిల్వ ఉంచుకోడానికి స్థలం సరిపోదని, ఏదైనా హార్డ్ డిస్క్‌లోకి డాటాను ట్రాన్స్‌ఫర్ చేసుకుంటాం కదా. అలాగన్నమాట. ఇక్కడ షార్ట్ టర్మ్ మెమరీగా ఉన్న జ్ఞాపకాలు... అక్కడ లాంగ్ టర్మ్ మెమరీస్‌గా మారి శాశ్వతంగా ఉంటాయి. అందుకు కారణమైన ‘షార్ప్ వేవ్ రిపుల్స్’ అన్నీ గాఢనిద్రలోనే సాధ్యమవుతాయి. అందుకే పిల్లలు చదివింది జ్ఞాపకం ఉండాలంటే వాళ్లకు కంటినిండా నిద్ర ఉండాలి. ఒకవేళ పిల్లల్లో తగినంత నిద్రలేకపోతే వారు భవిష్యత్తులో మానసిక సమస్యలకు లోనయ్యే ప్రమాదం ఉంది.
డిప్రెషన్, యాంగై్జటీ వంటి సమస్యలు వారిని చుట్టుముట్టే అవకాశం ఉంది. అందుకే నిద్రకు ముందు టీవీలో ఉద్వేగపరమైన సన్నివేశాలున్న సినిమాలు చూడనివ్వకండి. అలాగే మొబైల్స్, ల్యాప్‌టాప్‌ల వంటివి బ్లూ–లైట్‌ను వెదజల్లుతాయి. ఈ బ్లూ–లైట్ మెదడును ఉత్తేజితం చేసి, నిద్రపట్టకుండా చేస్తుంది. అందుకే నిద్రపుచ్చడానికి కనీసం మూడు గంటల ముందు నుంచి పిల్లలను ఈ ఉపకరణాలకు దూరంగా ఉంచండి. ఇక కాఫీ, కూల్‌డ్రింక్స్ వంటి కెఫిన్ ఉండే డ్రింక్స్ తాగనివ్వకపోవడం వల్ల మంచి నిద్రపడుతుంది. నిద్ర పట్టేలా చేసేందుకు రాత్రి మీ బాబుకు గోరువెచ్చని పాలు తాగించడం మంచిది. ఇందులో నిద్రను ప్రేరేపించే ట్రిప్టోఫాన్ అనే అమైనో యాసిడ్ ఉన్నందున అది నిద్రకు పురిగొల్పుతుంది. ఇవన్నీ చేశాక కూడా పిల్లలు నిద్రకు ఉపక్రమించడం లేదంటే ఒకసారి స్లీప్ స్పెషలిస్ట్‌ను కలవండి.
నిద్రలో కాళ్లుఎందుకలాకదులుతున్నాయి?
మా అమ్మగారి వయసు వయసు 49 ఏళ్లు. ఆమె కొన్నేళ్లుగా డయాబెటిస్‌తో బాధపడుతోంది. ఈ మధ్యకాలంలో నిద్రలో ఆమె తన కాళ్లను చాలా వేగంగా కదిలిస్తూ ఉండటాన్ని మేం గమనించాం. ఎందుకలా జరుగుతోంది? దయచేసి వివరంగా చెప్పండి.
– ఎమ్. సుగుణాకర్‌రావు, చీరాల
నిద్రలో ఇలా కుదుపుతున్నట్లుగా కాళ్లు వేగంగా కదిలించడాన్ని ‘పీరియాడిక్ లింబ్ మూవ్‌మెంట్ డిజార్డర్ (పీఎల్‌ఎమ్‌డీ) అంటారు. మనం నిద్రపోతున్న సమయంలో మన ఊపిరితిత్తులు, డయాఫ్రమ్ కదలిక తప్ప ఒంట్లో మరే కదలికా సాధారణంగా కనిపించదు. కానీ పీఎల్‌ఎమ్‌డీ నిద్రలో కదలికలు ఉండేలా చేస్తుంది. ఇక్కడ ‘పీరియాడిక్’ అనే పదం కదలికలు ఎంత ఫ్రీక్వెన్సీతో వస్తున్నాయనేందుకు ఉపయోగిస్తారు. ఇవి క్రమబద్ధంగా ప్రతి 20 – 40 సెకండ్ల పాటు వస్తుంటాయి. పీఎల్‌ఎమ్‌డీ అనేది నిద్రకు సంబంధించిన వ్యాధి. దీనితో బాధపడేవారు రాత్రివేళ నిద్ర తక్కువ కావడం వల్ల పగలు మగతగా ఉంటారు. పీఎల్‌ఎమ్‌డీ అనేది ఏ వయసు వారిలోనైనా రావచ్చు. అయితే సాధారణంగా మధ్యవయస్కుల్లో ఇది ఎక్కువ. పీఎల్‌ఎమ్‌డీలో ప్రైమరీ, సెకండరీ అని రెండు రకాలున్నాయి. సెకండరీ పీఎల్‌ఎమ్‌డీ అనేది అంతర్గతంగా ఇతర వ్యాధులు ఉన్నవారిలో కనిపిస్తుంది. లేదా కొందరిలో దీనికి కారణం కూడా తెలియదు. మెదడు నుంచి కాళ్లు, చేతులకు వెళ్లే నరాల్లో సమస్యల వల్ల ఇది వస్తుందని తెలుసుకానీ, ఆ సమస్యలేమిటో ఇంకా పరిశోధనల్లో వెల్లడికాలేదు.
సెకండరీ పీఎల్‌ఎమ్‌డీకి చాలా కారణాలు ఉన్నాయి. అవి... ‘డయాబెటిస్, ఐరన్ లోపం, వెన్నెముకలో కణుతులు, వెన్నెముక దెబ్బతినడం, స్లీప్ ఆప్నియా (గురక సమస్య), నార్కోలెప్సీ (క్రమమైన వేళల్లో నిద్రపట్టడం, నిద్రలేవడం జరగకపోవడం) ’ యురేమియా (రక్తంలో యురియా, నైట్రోజన్ సంబంధిత వ్యర్థపదార్థాల పాళ్లు పెరగడం), రక్తహీనత మొదలైనవి. పీఎల్‌ఎమ్‌డీతో బాధపడే చాలామందిలో కాళ్ల కదలికలు లేకుండా నిద్రపట్టకపోవడం, దాంతో పగటినిద్ర ఎక్కువగా ఉంటాయి. కొందరిలో ఒక కాలు, లేదా మరికొందరిలో రెండుకాళ్లూ కదులుతూ ఉండవచ్చు. దీని నిర్ధారణకు ప్రత్యేకంగా పరీక్షలేవీ లేకపోయినా, రక్తహీనత వంటి వాటి ద్వారా కారణాన్ని కొంతవరకు ఊహించవచ్చు. ఈ సమస్య ఉన్నవారికి బెంజోడయజిపైన్స్, క్లోనోజెపామ్, డోమమినెర్జిక్ ఏజెంట్స్, యాంటీకన్వల్జెంట్ ఏజెంట్స్, గాబా ఆగోనిస్స్ వంటి మందులతో చికిత్స చేయవచ్చు.
- డాక్టర్ రమణ ప్రసాద్
కన్సల్టెంట్ స్లీప్ స్పెషలిస్ట్ అండ్ పల్మునాలజిస్ట్, కిమ్స్ హాస్పిటల్స్, సికింద్రాబాద్