మెదడు పనితీరును  మెరుగుపరిచే నిద్ర | Sleep improving brain function | Sakshi
Sakshi News home page

మెదడు పనితీరును  మెరుగుపరిచే నిద్ర

Apr 20 2019 3:32 AM | Updated on Apr 20 2019 3:32 AM

Sleep improving brain function - Sakshi

ఎంతటి మేధావులయినా తమ మేధోతత్వాన్ని ఇనుమడింప చేసుకోవాలంటే కంటినిండా నిద్రపోవాలని, లేదంటే క్రమంగా వారి తెలివితేటలు మసకబారడమే కాకుండా, ఆయుష్షు కూడా క్షీణిస్తుందని చెబుతున్నారు అమెరికాలోని మసాచుసెట్స్‌ యూనివర్శిటీకి చెందిన పరిశోధకులు. కొన్ని పరిశోధనల ప్రకారం ఆయుర్దాయానికి, మనిషి సగటున రోజుకు ఎన్ని గంటలు నిద్రిస్తున్నాడనే దానికి సంబంధం ఉందని, కంటినిండా నిద్రపోయేవారు మిగిలిన వారితో పోలిస్తే ఎక్కువ కాలం జీవిస్తారని ప్రొఫెసర్‌ జేమ్స్‌ రోలండ్‌ చెబుతున్నారు. మనిషి ఎంత పట్టుదలతో ఉన్నా, మహా అయితే 48 గంటలు మాత్రమే నిద్ర పోకుండా ఉండగలడని, ఆ తర్వాత కూడా నిద్ర ఆపుకోవాలని చూసినా, అది ఫలించదని,  నిద్ర ముంచుకు రావడమే కాకుండా అప్పటికే శరీరంలో మితిమీరిన రీతిలో అవలక్షణాలు తొంగి చూస్తాయంటున్నారు పరిశోధకులు.

అసలు అలా కావాలని నిద్రను నిలుపుకొంటే పూర్తిగా చావును కొనితెచ్చుకున్నట్టే అవుతుందనీ, ప్రఖ్యాత ప్రజావైద్యుడు ద్వారకానాథ్‌ కొట్నిస్‌ రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో చైనా– జపాన్‌ మధ్య జరుగుతున్న యుద్ధంలో గాయపడిన సైనికులకు ఏకబిగిన నిద్రను లెక్క చేయకుండా దాదాపు మూడురోజులపాటు శస్త్ర చికిత్స చేయడం వల్ల అతని శరీరంలో ఎన్నో విపత్కర పరిణామాలు తలెత్తాయనీ, దాంతో 32 సంవత్సరాల వయస్సులోనే మూర్ఛవ్యాధి సోకడం వల్ల మరణించాడని గుర్తు చేస్తున్నారు. అలాగే కెనడాకు చెందిన ప్రఖ్యాత ప్రజావైద్యుడు, ప్రపంచంలోనే వైద్యవృత్తిలో ధర్మాత్ముడిగా, ఆ వృత్తికి అత్యంత హుందాతనాన్ని, యశస్సును తీసుకొచ్చిన నార్మన్‌ బెతూన్‌.

49 ఏళ్లకే చనిపోయాడనీ, అందుకు కారణం కేవలం నిద్ర సరిగాపోకుండా విపరీతమైన సేవా కార్యక్రమాల్లోను, కొత్త శస్త్ర చికిత్స పరికరాల రూపకల్పనలోను తలమునకలు కావడమేననీ, ఈ విషయాలు ఎంత పాతవైనప్పటికీ, నిద్రపోకుండా ప్రయోగాలు, పరిశోధనలు చేసే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా గుర్తు పెట్టుకోవలసి తీరాలంటున్నారాయన.దీనిని బట్టి చూస్తుంటే పోటీ పరీక్షలకు కార్పొరేట్‌ కళాశాలల్లో రేయింబవళ్లు విద్యార్థుల్ని బట్టీలు పట్టించి చదివిస్తే ర్యాంకులు వస్తాయి గానీ మేధో పరిణితి, విచక్షణ, సామాజిక చైతన్యం, సృజనాత్మకత, నూతనత్వం, ఉత్తేజం, ఉత్సాహం, తాజాదనం నేటి విద్యార్థుల్లో రాకపోవడానికి, లేకపోవడానికి గల కారణాలలో నిద్ర సరిగా లేకపోవడం కూడా ఒకటని అర్థం చేసుకోవచ్చు. మనం ఏదైనా సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నా,  నిద్ర పోవాలి. ఏదో ఒక గమ్యం మీద కలలు కనాలన్నా, ఆ కలల్ని సాకారం చేసుకోవాలన్నా నిద్ర తప్పనిసరి అన్నమాట.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement