
మొక్కే ఆమె ప్రిస్క్రిప్షన్
మొక్కా అమ్మా ఒక్కటే. రెండూ మనిషిని కాపాడుతాయి అంటారు పిట్ల చూడామణి.
మొక్కా అమ్మా ఒక్కటే. రెండూ మనిషిని కాపాడుతాయి అంటారు పిట్ల చూడామణి. అమ్మ జన్మనిస్తుంది... మొక్క సంజీవనిగా మారి పునర్జన్మ ఇస్తుంది అంటారామె. భీమిలి మండలం దివీస్ లేబరేటరీలో మూడెకరాలలో పెంచుతున్న ఔషధవనంలో తోటమాలిగా పనిచేస్తున్న చూడామణికి తాత కొమ్మూరి సన్యాసి ద్వారా బాల్యం నుంచే మొక్కలు గురించి తెలుసు. మొక్క, చెట్టు, పాదు... వీటన్నింటిలోనూ ఔషధగుణాలు ఉంటాయని తల్లిపాలు, పట్టుడుపాలకు ఎంత తేడా ఉందో పసరు మందులు, ఇంగ్లీషు మందులకు అంత తేడా ఉందని ఏడో తరగతి చదువుతున్నప్పుడే ఆమె తెలుసుకోగలిగింది. ప్రకృతి ప్రసాదించిన మొక్కలలో ఏ చెట్టు ఆకు ఏ వైద్యానికి పనికొస్తుందో, ఏ చెట్టు వేరుతో ఏ దీర్ఘకాలిక వ్యాధి నయమవుతుందో ఆమెకిప్పుడు బాగా తెలుసు.
బాల్యం నుంచే వనమూలికలపై ఆసక్తి..
చూడామణి తండ్రి వాసం శివరామయ్య కానిస్టేబుల్. ఆయన భీమిలిలో పని చేస్తున్నప్పుడు ఇక్కడి సెయింట్ ఆన్స్‌లో ఐదవ తరగతి వరకు, విశాఖ బిహెచ్‌పివిలో పని చేస్తున్నప్పుడు అక్కడ ఏడో తరగతి వరకు చదువుకుంది చూడామణి. ఆమె తాత సన్యాసి విశాఖ ఏజెన్సీలోని దేవరాపల్లి, చింతపల్లి, నర్సీపట్నం ప్రాంతాలలోని కొండకోనల్లో తిరిగి వనమూలికలు, ఆకులు, చెట్ల వేర్లు సేకరించేవారు. విశాఖలోని అల్లుడు శివరామయ్య ఇంటికి వచ్చినప్పుడల్లా చిక్కాలతో రకరకాల మూలికలు, చూర్ణాలు, లేహ్యాలు, పసర్లు ... ఒకటేమిటి ఆరోగ్యానికి ఆవసరమయ్యే కొర్రలు, అడ్డపిక్కలు, ఈడపళ్లు. ఇప్పపువ్వు తెచ్చేవాడు. వ్యాధికి పనికి వచ్చే మిశ్రమాలు తెలియందే ఒకదానికొకటి కలపకూడదని హెచ్చరించేవాడు. తాత ప్రకృతి వైద్యంపై చూడామణికి ఆసక్తి కలిగింది. అడిగి కొంత గమనించి, కొంత తాత నుంచీ... మూలికల గురించి తెలుసుకోవడం ప్రారంభించింది. పదో తరగతి వరకు చదువుకున్న ఆమె ఆ తరువాత వ్యవసాయ, ఉద్యానవన సబ్జెక్టులలో డిప్లమో చేసింది. ఉద్యోగం చేయాలన్న తలంపుతో కొన్నాళ్లు ఆనందపురంలో బయోడీజిల్ మొక్కలు పెంపకంలోనూ, రంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో 300 ఎకరాలలో చేపట్టిన ఉద్యానవన పంటల ప్రాజెక్టులోను సూపర్‌వైజరుగా పనిచేసింది. ప్రస్తుతం దివీస్ లేబరేటరీలో 160 రకాల ఔషధ మొక్కలను సేకరించి వీటితో విత్తనాలు వృద్ధి చేయించే పనిలో మునిగిపోయింది ఈమె.
అరుదైన మొక్కలు..
రామఫలం, విభీషణఫలం, రుద్రాక్ష, లావెండర్, శ్రీగంధం, బిర్యానీ ఆకు(దాల్చినచెక్కు), యాలుకలు, రెక్క సంపెంగ, లెమన్‌గ్రాస్, కర్పూర తులసి, లవంగ తులసి, మోదుగ, అటుకు మామిడి, సుగంధి, పిప్పర్‌మెంట్ వాకుడు పళ్లు, బొగడ, పాపిట ఆకు, వాటర్ యాపిల్ వంటి అరుదైన మొక్కలు ప్రస్తుతం చూడామణి సంరక్షణలో ఉన్నాయి. వ్యాధులను నయం చేసే నల్లేరు, ఇసుకరాసి, దుంప పసుపు, శంఖుపుష్పి, సర్పగంధి, కొండవేప, వావిళ్లు, బలరావి, అత్తిపత్తి, శతావరి, ఇన్సులిన్, వెంపలి, వాగ్దేవి, అతిబల, పత్రబీజం, సరస్వతి ఆకు, అవిసె, గాడిద గరప, అడ్డసరం, నేలవేము, భూతంగేడు, సముద్రపాల వంటి మొక్కలు కూడా ఉన్నాయి.
ఫలితాలు అద్భుతం..
రోగాలకు బాగా తెలిసిన ఆకులు, వేర్లు, గింజలను విడిగాను, కలిపి వాడటం ద్వారాను ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా వ్యాధులను నయం చేయవచ్చని నిరూపించింది చూడామణి. మధురవాడలో ఒక వ్యక్తి కిడ్నీలో 8 ఎంఎం రాయిని కొండపిండి రకానికి చెందిన పుష్పాలను వాడటం ద్వారా 25 రోజులలో మటుమాయం చేసింది. పదకొండు ఏళ్ల బాలునికి మూడుసార్లు శస్త్రచికిత్స చేసినా రాని నడకను చూడామణి అయిదు మాసాలలో వనమూలికల ద్వారా తీసుకురాగలిగింది. వయసుతో పనిలేకుండా పసిపిల్లలు, వృద్ధులు, మహిళలలో పొడచూపే దీర్ఘకాలిక రోగాలు, సంతానం కోసం లక్షలు ఖర్చుచేసినా రాని ఫలితాలను వేర్లద్వారా సాధించవచ్చని నిరూపించింది.
ఉచిత వైద్యసేవలు చేయాలన్నా...
లక్షలు పోసి ఇంగ్లీషు వైద్యం చేయించుకున్నా కొన్ని వ్యాధులు లొంగవు. లొంగినా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. మూలికలతో వ్యాధులు నయం చేయగలిగే సత్తా ఉన్నా వైద్యం చేయడానికి చూడామణి వద్ద సర్టిఫికెట్ లేదు. ‘అందుకే బయట వైద్యం చేయలేకపోతున్నాను’ అందామె. ‘దివీస్ లేబరేటరీ యాజమాన్యం ప్రోత్సాహంతో భావితరాలకు ఆయుష్సును పెంచే మొక్కలను వృద్ధి చేసేపనిలో భాగంగా విత్తనాలు తయారు చేస్తున్నాను. నాకు ఉండటానికే ఇల్లు లేదు. స్వంతంగా మూలికలవనాన్ని వృద్ధి చేసుకోవాలంటే కనీసం పావు ఎకరం స్థలం కావాలి. పెట్టుబడి కావాలి. నా భర్త బుల్లిబాబు కూడా ప్రస్తుతం ఖాళీగా ఉంటున్నారు. ప్రస్తుతం నలుగురు కూలీల ద్వారా వనాన్ని సంరక్షిస్తున్నాను. యాజమాన్యం సూచిస్తే ఎవరికీ ఎటువంటి హానిలేని మూలికా వైద్యాన్ని చేయవచ్చు’ అందామె.
భారతదేశం మూలికలకు పుట్టినిల్లు. సంప్రదాయ వైద్యానికి పట్టుకొమ్మ. చూడామణి ఒక్కతే కాదు ఇలాంటి ఎందరో సరైన ప్రోత్సాహం కోసం ప్రజలను చేరే మార్గం కోసం ఎదురు చూస్తున్నారు. కార్పొరెట్ వైద్యం ఖరీదైన వైద్యం. ప్రజలకు అందుబాటులోకి రావడంలో జరిగే ప్రయత్నాలలో తప్పు లేకపోవచ్చు. కాని అతి తక్కువ ఖర్చుతో మొండి వ్యాధులను నయం చేయగలిగే మూలికా వైద్యం అందుబాటులో లేకపోవడం మాత్రం తప్పే. చూడామణి వనం జగమంత విస్తరించాలని కోరుకుందాం.
- గేదెల శ్రీనివాసరెడ్డి,
తగరపువలస (విశాఖపట్నం)