అల్సర్‌ అనగానే కంగారు పడనక్కర్లేదు


గ్యాస్ట్రో ఎంటరాలజీ కౌన్సెలింగ్‌



నా భార్య వయసు 45 ఏళ్లు. డయాబెటిస్‌తో బాధపడుతోంది. భక్తిభావం ఎక్కువ. ఎప్పుడూ పూజలూ–పురస్కారాలు అంటూ ఉపవాస దీక్షలు చేస్తూ ఉంటుంది. ఆరోగ్య సమస్యలను కొనితెచ్చుకుంటోంది. ఉదయం నాలుగింటికే నిద్రలేచి, చన్నీళ్లతో స్నానం చేసి పూజలు మొదలుపెడుతుంది. ఉదయం 8 – 9 వరకు పచ్చి మంచినీళ్లు కూడా ముట్టకుండా పూజ కొనసాగిస్తుంటుంది. ఇటీవల ఆమె తరచూ అనారోగ్యానికి గురవుతోంది. కడుపులో ఉబ్బరం, మంట, ఆయాసం అంటుంటే డాక్టర్‌ దగ్గరికి తీసుకెళ్లాను. ఆయన పరీక్షించి అల్సర్‌ వచ్చిందని, ఆహారపు అలవాట్లు మార్చుకోకపోతే తీవ్ర అనారోగ్యం పాలవుతుందని హెచ్చరించారు. ఆమెకు ఉన్న షుగర్‌ సమస్యతో పాటు కొత్తగా అల్సర్‌ రావడంతో ఇంకేవైనా కొత్త జబ్బులు వస్తాయేమోనని భయంగా ఉంది. దయచేసి నా భార్య ఆరోగ్యం విషయంలో ఏ డాక్టర్‌ని సంప్రదించాలి? ఆమెను కాపాడుకునే మార్గాలేమైనా ఉంటే తెలపగలరు. – శ్రీనివాస్, బాపట్ల



మీరు చెప్పిన కడుపులో ఉబ్బరం, మంట, ఆయాసం అన్నవి ఉదరకోశ వ్యాధులలో కనిపించే సాధారణ లక్షణాలు. కేవలం ఈ లక్షణాల మీదనే ఆధారపడి ఏ వ్యాధినీ కచ్చితంగా నిర్ధారణ చేయడం సాధ్యం కాదు. ఎందువల్లనంటే... సాధారణమైన ఇన్ఫెక్షన్స్‌ నుంచి క్యాన్సర్‌ వంటి తీవ్రమైన వ్యాధుల వరకు చాలామంది రోగులలో ఈ విధమైన లక్షణాలతో డాక్టర్‌ను సంప్రదిస్తారు. కొంతమంది రోగులలో నిర్దిష్ట లక్షణాలతో ఉన్నప్పుడు డాక్టర్లు అల్సర్‌ (పేగుపూత) అని అనుమానించినప్పటికీ, నిర్దిష్టంగా వ్యాధిని నిర్ధారణ చేయడం కోసం ఎండోస్కోపీ తప్పనిసరి.



కడుపులో పూత అనేది రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి పెప్టిక్‌ అల్సర్‌ వ్యాధి. ఇది సాధారణంగా చిన్నపేగు మొదట్లో లేదా జీర్ణకోశంలో సంభవించవచ్చు. ఈ సమస్య రావడానికి  బ్యాక్టీరియా (హెలికో బ్యాక్టర్‌ పైలోరీ), ఎక్కువ మోతాదులో ఆమ్లం (యాసిడ్‌) స్రవించడం, నొప్పి నివారణ మందులు ఎక్కువ పరిమితితో వాడటం వంటివి ప్రధాన కారణాలు. ఎండోస్కోపీ ద్వారా చాలా సులువుగా సమస్యను గుర్తించవచ్చు. మూలకారణాన్ని గుర్తించి చికిత్స చేస్తే ‘పెప్టిక్‌ అల్సర్‌’ పూర్తిగా నయమవుతుంది. ఇది క్యాన్సర్‌కు దారితీయదు. అయితే పెప్టిక్‌ అల్సర్‌ను నిర్లక్ష్యం చేస్తే తీవ్ర రక్తస్రావం జరిగి లేదా పేగుకు రంధ్రం పడి అది ప్రాణాపాయ స్థితికి దారితీయవచ్చు.

ఇక రెండో రకమైన అల్సర్లు క్యాన్సర్‌ వల్ల కలగవచ్చు. ఇవి సాధారణంగా జీర్ణకోశంలో వస్తాయి. ఎండోస్కోపీ, బయాప్సీ ద్వారా వీటిని నిర్ధారణ చేయవచ్చు.



వ్యాధి నిర్ధారణ తర్వాత వ్యాధి దశను బట్టి దీనికి తగిన వైద్య చికిత్సను నిర్ధారణ చేస్తారు. కాబట్టి మీరు అల్సర్‌ అనగానే కంగారు పడాల్సిన అవసరం లేదు. సరైన ఆహారపు అలవాట్లు, సమయానికి భోజనం చేయడం, వ్యాయామం, సరైన సమయంలో సంబంధిత వైద్యుడిని సంప్రదించడం వల్ల ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడమే గాక ప్రమాదకరమైన పరిస్థితులను నివారించుకోవచ్చు.



డాక్టర్‌ వై. రామిరెడ్డి

సీనియర్‌ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్,

యశోద హాస్పిటల్స్, సికింద్రాబాద్‌

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top