కంటే కలలే కనాలి

Mungerilal K Haseen Sapne broadcasted 13 episodes in 1990 - Sakshi

మధ్యతరగతి జీవితానికి జీతం సరిపోదు.అయితే అరకొరా... ఇల్లాలి కొరకొరా.వనరులు పెంచుకోవాలంటే స్టార్స్‌ కనిపిస్తాయి.ఇక పెంచుకోదగ్గది... అలా పెంచుకునే వీలైనది ఒక్కటే ఒకటి... ఆశ.చుట్టూ కష్టాలు కనపడుతుంటే ఏం ఆశించగలం?అందుకే ఒక కునుకు తీయండి. ఒక కల కనండి.

1990ల కాలం అంటే అప్పటికి ఇందిరా గాంధీ చనిపోయింది. రాజీవ్‌గాంధీ ఓడిపోయాడు. వి.పి.సింగ్, అతని తర్వాత చంద్రశేఖర్‌... వీరి పాలనలో దేశం ఉంది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ గురించి వెనుకబడిన వర్గాల అభ్యున్నతి గురించి చర్చలు జరుగుతున్నాయి. కాని అవకాశాలు ఎక్కడా లేవు. సంపద లేదు. సామాన్యుడు సూపర్‌స్టార్‌ అవడానికి వీలయ్యే పరిస్థితులు లేవు. సగటు మగాడి జీవితం జానా బెత్తెడుగా ఉంది. ఏదో ఒక పని చేయడం, భార్యాపిల్లలను పోషించుకోవడం, రాత్రిళ్లు ముడుచుకుని పడుకోవడం... పెద్ద పెద్ద కలలు కనేందుకు కూడా ఎవరూ సాహసం చేయని పరిస్థితి (దేశంలో 2000 సంవత్సరం తర్వాత ఆర్థిక సరళీకరణల ఫలితంగా ధనం అందుబాటులోకి రావడం, సాఫ్ట్‌వేర్‌ రంగం ఊపందుకోవడం, ఆ తర్వాతి కాలంలో అబ్దుల్‌ కలామ్‌ లాంటి వాళ్లు వచ్చి కలలు కనండి అని పిలుపు ఇవ్వడం మనకు తెలుసు.

కాని 1990ల నాటికి కలలు కనడం కూడా ఖరీదైన వ్యవహారమే).ఇటువంటి సమయంలో దూరదర్శన్‌లో వచ్చిన ‘ముంగేరిలాల్‌ కే హసీన్‌ సప్నే’ సీరియల్‌ జనం తమ కష్టాలను కాసేపు నవ్వుకుని మర్చిపోయే వీలు కల్పించినట్టే చాలామంది సామాన్యులను మీకు కష్టాలు చుట్టుముడితే కళ్లు మూసుకొని కలల్లోకి వెళ్లండి... అక్కడైనా వాటిని తీర్చుకుని సేద తీరండి అని చెప్పింది.ఈ సీరియల్‌ ‘ముంగేరిలాల్‌’గా చేసిన రఘువీర్‌ యాదవ్‌ ట్రిపుల్‌ ఎం.ఏ చేశాడు. కాని ఉద్యోగం రాదు. అతడికి పిల్లనిచ్చిన మావ ఢిల్లీలో రికమండేషన్‌ చేసి ఏదో ప్రయివేటు కంపెనీలో అకౌంట్స్‌ డిపార్ట్‌మెంట్‌లో ఉంచుతాడు. ఇంట్లో భార్య, మామగారూ... ఆఫీసులో సాటి క్లర్కు, ఎప్పుడూ మేకప్‌ సరి చేసుకుంటూ పని ఎగ్గొట్టే లేడీ టైపిస్టూ, అవసరం లేకపోయినా చిందులు తొక్కే బాసు... వీరి మధ్య ముంగేరిలాల్‌ జీవితం మొదలవుతుంది.ముంగేరిలాల్‌ (అంటే ఇది మనవైపు సుబ్బయ్య వంటి ఒక కామన్‌ నేమ్‌) దుర్బలుడు. బలహీనంగా ఉంటాడు. భౌతికంగా కూడా అతడు హీరోగా జనం కళ్లకు ఆనడు.

కాని అతడికి అదృష్టవశాత్తు ఒక జబ్బు ఉంది. నిలబడి కాని, పడుకుని కాని, ఆఫీసులో కాని, ఇంట్లో కాని అప్పటికప్పుడు కలల్లోకి వెళ్లిపోతాడు. ఆ క్షణంలో అతడి కుడి కన్ను, కుడి భుజం అదురుతాయి. ఆ తర్వాత కలలో క్షణాల్లో ప్రవేశిస్తాడు. ఆ కలల్లో తన నిజ జీవిత పాత్రలే మరో విధంగా తారసపడుతుంటాయి. ఆ పాత్రల మీద అతడు ఆధిపత్యం చెలాయిస్తుంటాడు.ఉదాహరణకు ఒక ఎపిసోడ్‌లో అతడి భార్య అతడితో సాయంత్రం ఊరిలోని కళాక్షేత్రంలో లతా మంగేశ్కర్‌ కచేరీ ఉందని దానికి వెళ్లే భాగ్యం తమకు లేదని వాపోతుంది. వెంటనే ముంగేరిలాల్‌ కలలోకి వెళ్లిపోతాడు. ఆ కలలో ముంగేరిలాల్‌ తన అసిస్టెంట్‌తో (నిజ జీవితంలో ఆఫీసులో టైపిస్ట్‌) కూచుని ఉంటాడు. హాల్‌ కిటకిటలాడుతుంటుంది. కాని లతా మంగేష్కర్‌కు ఏదో అవాంతరం వచ్చి కచేరీకి రాదు. నిర్వహాకుడు అంటే నిజ జీవితంలో ముంగేరిలాల్‌కు బాస్‌గా ఉన్న వ్యక్తి చాలా హైరానా పడుతుంటాడు. లతా రాకపోతే ప్రేక్షకులు పందిరి పీకి ఇల్లు కడతారని హడలిపోతాడు. ఇంతలో ఎవరో ఆ నిర్వాహకుడికి ఒక వార్త చెబుతారు.

ప్రేక్షకుల్లో ముంగేరిలాల్‌ అనే మహా గానపండితుడు ఉన్నాడని ఆయన లతా మంగేష్కర్‌ కంటే గొప్పవాడని ఆయనను గనక బతిమిలాడుకుంటే ఆయన పాడితే గట్టెక్కేస్తామని చెబుతారు. అంతే. నిర్వాహకుడు వెళ్లి ముంగేరిలాల్‌ కాళ్ల మీద పడతాడు. ముంగేరిలాల్‌కు ఇది మొహమాటంగా ఉంటుంది. అరె.. నాకేదో నాలుగు ముక్కలు వస్తే ఏంటి మీరిలా ఇబ్బంది పెడతారు అన్నట్టుగా చూస్తాడు. కాని చివరకు స్టేజీ ఎక్కి అసిస్టెంట్‌తో కలిసి అద్భుతంగా పాటలు పాడి చప్పట్ల మోత మోగిస్తాడు. అలా ఇంట్లో ఉండే ముంగేరిలాల్‌ ఆ ఫంక్షన్‌ చుట్టి వస్తాడు.ముంగేరిలాల్‌ ఎపిసోడ్స్‌ అన్నీ ఇలాగే సాగుతాయి. ఒక ఎపిసోడ్‌లో నేరస్తులను పట్టుకుని పోలీసుగా, ఇంకో ఎపిసోడ్‌లో సరిహద్దులో శతృవుతో పోరాడే సిపాయిగా, ఇంకో ఎపిసోడ్‌లో కష్టమైన ఆపరేషన్‌ను అవలీలగా చేసి పారేసే డాక్టర్‌గా, మరో ఎపిసోడ్‌లో ఐశ్వర్యవంతుడిగా కనిపిస్తుంటాడు. ఏ కలలో ఏ అవతారం ఎత్తినా అతడు చేసేది మాత్రం మంచి. పొందేది కూడా మంచి. మంచి కోరుకుంటూ కలలు కనడం కూడా మానసిక ఆరోగ్యానికి మంచిదే అని ఈ సీరియల్‌ చెబుతుంది.

నిజ జీవితంలో నిస్పృహ కొంచెమైనా తీర్చుకోండి అని పిలుపు ఇస్తుంది.‘ముంగేరిలాల్‌ కే హసీన్‌ సప్‌నే’ 1990లో 13 ఎపిసోడ్‌లు ప్రసారం అయ్యింది. పెద్ద హిట్‌ అయ్యింది. ఇంట్లో పిల్లలూ పెద్దలూ హాయిగా ఆ సీరియల్‌ను చూశారు. ఆ పరంపర మన జానపదంలో కూడా ఉండటం వల్ల సులభంగా కనెక్ట్‌ అయ్యారు. పంచతంత్రంలో ఒక కుమ్మరి తాను మధ్యాహ్నం కునుకు తీస్తూ వందల కుండలు తయారు చేసి ఐశ్వర్యవంతుడు అయినట్టుగా భావించి కాలు తాటించి ఉన్న ఒక్క కుండనూ పగల గొట్టుకుంటాడు. అయితే అది పగటి కలలు చేటు అని చెప్పే కథ. ఇక్కడ మాత్రం పగటి కలలు పాజిటివ్‌ ఎనర్జీకి ఉపయోగపడతాయి అని చెప్పే కథ.రఘువీర్‌ యాదవ్‌ హీరోగా చేసిన తొలి సీరియల్‌ ఇది. ఈ సీరియల్‌తో అతడు దేశానికంతా పరిచయం అయ్యాడు. దీనికి ముందు ‘సలామ్‌ బాంబే’ సినిమాలో అతడు నటించినా జన సామాన్యానికి చేరువైంది ముంగేరిలాల్‌ తోనే.ఇక ఈ ఎపిసోడ్స్‌కు దర్శకత్వం వహించింది నేటి ప్రసిద్ధ బాలీవుడ్‌ దర్శకుడు ప్రకాష్‌ ఝా అని తెలిస్తే ఆశ్చర్యంగా ఉంటుంది.

‘గంగాజల్‌’, ‘రాజనీతి’, ‘అపహరణ్‌’ వంటి భారీ రాజకీయ చిత్రాలు తీసే ప్రకాష్‌ ఝా తన కెరీర్‌ ప్రారంభంలో ఒక మధ్యతరగతి జీవనాన్ని సున్నిత హాస్యంతో తీయడం మంచి జ్ఞాపకం అనుకోవాలి. మన దగ్గర పూరీ జగన్నాథ్‌ కూడా తొలి రోజుల్లో సరదా సీరియల్స్‌ దూరదర్శన్‌ కోసం తీశాడని ఈ సందర్భంగా గుర్తు చేసుకోవచ్చు.1990లలో మధ్యతరగతి సంతోషాలను, చిన్నపాటి సంఘర్షణలను, ఒకరిలో మరొకరి పట్ల ఉండే ఆత్మీయతను ఆర్తిని సీరియల్స్‌గా తీసేవారు. ఇవాళ టీవీలో మధ్యతరగతి అనేది ఒకటి కనిపించకుండా పోయింది. అందరూ ఖరీదైన చీరలు నగలు పెట్టుకుని, మగవారైతే జుబ్బాలు దిగవిడుచుకుని కుట్రలు చేయడం ఎలా అని అనుక్షణం ఆలోచిస్తూ ఉంటారు.

వంట గదిలో మొగుడూ పెళ్లాల చిర్రుబుర్రులు, పిల్లల స్కూళ్ల ఎంపిక దగ్గర చర్చోపచర్చలు, అయినవారి పెళ్లి కానుక విషయంలో ఒకరితో మరొకరు పడే పేచీలు, ఇంట్లో పెద్దవారు ఉంటే వారితో పిల్లలు పడే గారాలు, ఆఫీసులో కలీగ్స్‌తో చిన్నపాటి స్నేహాలూ స్పర్థలూ ఇవి లేకుండా పోయాయి.జాతీయ చానళ్లలో లేవు.ప్రాంతీయ చానళ్లలో కూడా లేవు.అందుకే అందమైన మధ్యతరగతి జీవితం ఒక కలలా మిగిలింది.మనం కూడా పగలో, రాత్రో ఒక కల గని ముంగేరిలాల్‌ వలే ఆ జీవితాన్ని దర్శించి ఆనందిద్దాం. ఊరట చెందుదాం.

►ముంగేరిలాల్‌ ఎపిసోడ్స్‌ అన్నీ ఇలాగే సాగుతాయి. ఒక ఎపిసోడ్‌లో నేరస్తులను పట్టుకుని పోలీసుగా, ఇంకో ఎపిసోడ్‌లో సరిహద్దులో శతృవుతో పోరాడే సిపాయిగా, ఇంకో ఎపిసోడ్‌లో కష్టమైన ఆపరేషన్‌ను అవలీలగా చేసి పారేసే డాక్టర్‌గా, మరో ఎపిసోడ్‌లో ఐశ్వర్యవంతుడిగా కనిపిస్తుంటాడు. ఏ కలలో ఏ అవతారం ఎత్తినా అతడు చేసేది మాత్రం మంచి. 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top