ఒక చేత్తో రాస్తూ...ఒక చేత్తో ఇస్తూ... | Giving a hand for a hand-writing ... ... | Sakshi
Sakshi News home page

ఒక చేత్తో రాస్తూ...ఒక చేత్తో ఇస్తూ...

Jan 23 2014 11:00 PM | Updated on Oct 17 2018 4:36 PM

1842లో తొలిసారి చార్ల్స్ అమెరికా వెళ్లారు. ప్రెసిడెంట్ జాన్ టైలర్‌ని కలిశారు. న్యూయార్క్‌లోనే కొద్దిరోజులు ఉండిపోయి, బానిస వ్యవస్థ నిషేధంపై ప్రసంగాలు ఇచ్చారు.

సంక్షిప్తంగా-చార్ల్స్ డికెన్స్
 
1842లో తొలిసారి చార్ల్స్  అమెరికా వెళ్లారు. ప్రెసిడెంట్ జాన్ టైలర్‌ని కలిశారు. న్యూయార్క్‌లోనే కొద్దిరోజులు ఉండిపోయి, బానిస వ్యవస్థ నిషేధంపై ప్రసంగాలు ఇచ్చారు. ఇంగ్లండ్ తిరిగొచ్చాక మళ్లీ పుస్తకాలు రాయడం, వాటిని నాటకాలుగా వేయించడంతోనే చార్ల్స్ నడివయసు గడిచింది.
 
 లోకంలో ఇద్దరే ఇద్దరు విరక్తిగా నవ్వగలరు.
 ఒకరు వేదాంతి. ఇంకొకరు - జీవితాన్ని ‘తీర్చలేని అప్పుగా’ ఈడుస్తున్న అభాగ్యుడు.
 ఈ ఇద్దరూ కలిస్తే చార్ల్స్ డికెన్స్!
     
 జీవితం... చార్ల్స్ చొక్కా పట్టుకుని దబాయించడానికి కొన్నాళ్ల ముందు వరకు అతడిని లోకం పెద్దగా ఇబ్బంది పెట్టలేదు.
 అప్పటికి చార్ల్స్‌కి పదిహేనేళ్లు.  
 ‘‘నువ్వెక్కడికైనా పనికి వెళ్లాలి చార్ల్స్’’ అంది తల్లి ఓ రోజు!
 చార్ల్స్ మీద కుటుంబ భారం పడింది. హంగర్‌ఫోర్డ్ మార్కెట్ టౌన్‌లో థేమ్స్ నది ఒడ్డున ఉన్న ‘వారెన్స్ బ్లాకింగ్ వేర్‌హౌస్’లో పనికి కుదురుకున్నాడు చార్ల్స్. బూట్ పాలిష్‌లు తయారు చేసే కర్మాగారం అది. పాలిష్‌ను నింపిన సీసాలకు లేబుళ్లను అతికించడం చార్ల్స్ ఉద్యోగం. రోజుకు పది గంటల పని.  
 
కొన్నాళ్లతర్వాత...
 కామ్డెన్‌లోని వెల్లింగ్టన్ హౌస్ అకాడమీలో చేరాడు చార్ల్స్. చదివితే చదివావు కానీ పని మానేయడానికి వీల్లేదంది తల్లి! చార్ల్స్ బాధపడ్డాడు. పనికి వెళ్లమన్నందుకు కాదు. తల్లి అలా అన్నందుకు. ‘‘నేనెప్పటికీ మరిచిపోలేను... అమ్మ అలా అనడాన్ని’’ తన ఆత్మకథ కాని ఆత్మకథ ‘డేవిడ్ కాపర్‌ఫీల్డ్’లో ఛాయామాత్రంగా రాసుకున్నాడు చార్ల్స్.
     
 కుదుటపడింది అనుకునేంతలోనే కుంటుపడింది చార్ల్స్ చదువు! ‘లా’ ఆఫీస్‌లో జూనియర్ గుమస్తాగా చేరాడు. ఏడాది గడిచాక మానేశాడు. షార్ట్‌హ్యాండ్ నేర్చుకుని ఫ్రీలాన్స్ రిపోర్టర్‌గా ‘డాక్టర్స్ కామన్స్’ తరఫున పని చేశాడు. డాక్టర్స్ కామన్స్ అంటే... లా ప్రాక్టీస్ చేస్తున్న యువ న్యాయవాదుల సంఘం. సగటు మనిషి జీవితాన్ని చట్టం-ధర్మం-న్యాయం అనేవి ఎలా నరకప్రాయం చేస్తాయో నాలుగేళ్ల పాటు వరుసగా చక్కటి వార్తాకథనాలు రాశాడు చార్ల్స్. ముఖ్యంగా ‘న్యాయం’ కింద పడి పేదవాడు ఎలా నలిగిపోతాడో వ్యాఖ్యానించాడు.
 
లండన్ షేక్ అయింది! ముఖ్యంగా న్యాయస్థానాలు, న్యాయమూర్తులు!! చార్ల్స్ వెదుక్కుంటూ సామాన్యులు లండన్‌లోని డాక్టర్స్ కామన్స్ కార్యాలయానికి చేరుకునేవారు.
 
1836లో చార్ల్స్ తొలి నవల  ‘ది విప్‌విక్ పేపర్స్’ని సీరియల్‌గా వచ్చింది. న్యాయవ్యవస్థలోని అన్యాయాలపై సెటైర్ అది. బాంబులా పేలింది. ఇంగ్లండ్ జడ్జిలకు గనుక ప్రత్యేక అధికారాలు ఉండి ఉంటే వీధుల్లోకి కూడా వచ్చి ఆర్డర్... ఆర్డర్ అనేవారే. అంతగా కలకలం రేగింది. చార్ల్స్ అదే ఏడాది ‘బెంట్లీ మిసలేనీ’ అనే పత్రికకు ఎడిటర్ అయ్యాడు.
 
రాస్తున్న పుస్తకాలు, ఇస్తున్న ప్రసంగాలు, వేదిక పఠనాలు (పబ్లిక్ రీడింగ్స్) చార్ల్స్‌పై డబ్బు కుమ్మరిస్తున్నాయి. వాటిని ఆయన విరాళాలుగా కుమ్మరిస్తున్నాడు. ఆసుపత్రులకు, సేవాసంస్థలకు చార్ల్స్ ఆపద్బాంధవుడయ్యారు. పిల్లల కోసం, మహిళల కోసం ఎవరైనా వచ్చి ఏదైనా చేస్తున్నామని చెబితే - డైనింగ్ హాల్‌లో ఉన్నా సరే - చార్ల్స్ వెంటనే లేచి వచ్చి డబ్బు సహాయం చేసేవారు.
 
యాభైకి దగ్గరపడుతుండగా ఆయన రాసిన ‘ఎ టేల్ ఆఫ్ టు సిటీస్’, ‘గ్రేట్ ఎక్స్‌పెక్టేషన్స్’ నవలలు ఆయనను మరింత సంపన్నుడిని చేశాయి. అతడిలో మరింత ఔదార్యాన్ని నింపాయి. సమాజానికి రెండు చేతులతో ఇస్తున్నారు చార్ల్స్. ఒకచేత్తో రాస్తూ, ఇంకో చేత్తో సహాయం చేస్తూ.
 1870 జూన్ 9న చార్ల్స్ గుండెపోటుతో చనిపోయారు!!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement