నాలుక పట్టేసి మాట ముద్దగా వస్తోంది...  | Sakshi
Sakshi News home page

నాలుక పట్టేసి మాట ముద్దగా వస్తోంది... 

Published Mon, Oct 8 2018 12:29 AM

Family health counselling - Sakshi

న్యూరాలజీ కౌన్సెలింగ్‌

మా పెద్దనాన్నగారి వయసు 48 ఏళ్లు. ఆర్నెల్ల క్రితం నుంచి ఆయనకు నాలుక పట్టేసినట్లుగా ఉండి, మాట ముద్దముద్దగా వస్తోంది. కుడివైపు భాగమంతా చచ్చుబడినట్లుగా మారుతోంది. చికిత్స తీసుకున్నా ప్రయోజనం లేదంటున్నారు. ఇలా ఎందుకు జరుగుతోంది? దయచేసి పరిష్కారం చెప్పండి.  – ఎల్‌. వెంకటేశ్వరరావు, నల్లగొండ 
మాట సరిగా రాకపోవడం, చూపులో తేడా రావడం, శరీరంలోని ఒకవైపు భాగం బలహీనపడటం, నడుస్తున్నప్పుడు బ్యాలెన్స్‌ లేకపోవడం... వంటి అకస్మాత్తుగా కనిపించే లక్షణాలన్నీ పక్షవాత సూచనలుగా పరిగణించాలి. అయితే దీన్ని నిర్ధారణ చేయడానికి సీటీ/ఎమ్మారై స్కాన్‌ పరీక్ష అవసరం. సాధారణంగా తొలిసారి కొద్దిపాటి పక్షవాతం వచ్చిన 30 శాతం మందిలో, ఏడాదిలో రెండోసారి తీవ్రంగా వచ్చేందుకు అవకాశం ఉంది. ప్రత్యేకంగా దీనికోసం రక్తాన్ని పలుచబార్చే మందులైన యాస్పిరిన్, క్లోపిడోగ్రెల్, స్టాటిన్స్‌ వంటివి తీసుకోని వారిలో ఇది తీవ్రంగా రావచ్చు. దీనితో పాటు పక్షవాతానికి ఆస్కారమిచ్చే రిస్క్‌ ఫ్యాక్టర్లు అయిన బీపీ, షుగర్, కొలెస్ట్రాల్, గుండెజబ్బులు, హోమోసిస్టిన్‌ లేదా గురక వంటివి రోగికి ఉండి, వాటిని నియంత్రించకపోతే పక్షవాతం వచ్చే అవకాశాలు మరింత ఎక్కువ. అందుకే మీ బంధువుకు వెంటనే అన్ని రకాల పరీక్షలు చేయించి, వ్యాధి విషయంలో తగిన నిర్వహణ చర్యలు (మేనేజ్‌మెంట్‌ ఆఫ్‌ డిసీజ్‌) తీసుకోవాల్సిన అవసరం ఉంది. మీ బంధువుకు మళ్లీ పక్షవాతం (స్ట్రోక్‌) వస్తే అది వైకల్యాన్ని తెస్తుంది. కాబట్టి మీరు వెంటనే మీ దగ్గర్లోని న్యూరాలజిస్ట్‌ను సంప్రదించండి. రెండోసారి స్ట్రోక్‌ను నివారించేందుకు తగిన మందులు క్రమం తప్పకుండా వాడండి. 

కాళ్లలో  మంటలూ – తిమ్మిర్లు...  ఎందుకిలా? 
నా వయసు 53 ఏళ్లు. రెండేళ్ల నుంచి నా కాళ్లలో మంటలు, పోట్లు, తిమ్మిర్లు చాలా బాధపెడుతున్నాయి. నాకు బీపీ, షుగర్‌ వ్యాధులు లేవు. ఎటువంటి చెడు అలవాట్లు కూడా లేవు. అయినా నాకు ఎందుకీ సమస్య. నాకు తగిన పరిష్కారం చూపగలరు.  – ఎమ్‌. రామ్మోహన్‌రావు, నెమ్మికల్‌ 
కాళ్లలో మంటలు, పోట్లు, తిమ్మిర్లు, కాలి చివర మొద్దుబారడం వంటి లక్షణాలు నరాల నుంచి వెన్నుపాము వరకు వచ్చే సమస్యలకు ఒక సూచన. ఈ సమస్య పెరుగుతూ పోతే చేతులకు కూడా వస్తుంది. అలాగే నడకలో మార్పు, మలమూత్ర విసర్జనపై నియంత్రణ కోల్పోవడం, అంగస్తంభనలో కూడా ఇబ్బందులు ఉండవచ్చు. వీటినే పెరిఫెరల్‌ న్యూరోపతి అంటారు. డయాబెటిస్, విటమిన్‌ బి12, బి1, ఫోలిక్‌ యాసిడ్, ప్యాంటథెనిక్‌ యాసిడ్‌ లోపాలు ఈ సమస్యకు ప్రధాన కారణాలు. కొన్నిసార్లు లెప్రసీ, హెచ్‌ఐవీ, హెపటైటిస్‌–బి అండ్‌ హెపటైటిస్‌ సి వైరస్‌ ల వంటివి కూడా ఈ సమస్యకు దారితీయవచ్చు. సాధారణంగా 30 శాతం మందిలో ఏ కారణం లేకుండా కూడా ఈ సమస్య వస్తుంది. ఇలాంటివారిలో డయాబెటిస్‌ వచ్చే అవకాశాలు ఎక్కువ. పై లక్షణాలను నియంత్రించడానికి గాబాపెంటిన్, ప్రీగాబాలిన్, అమీట్రిప్టిలిన్, డ్యూలోక్సెటిన్‌ మందులతో పాటు, మీ కండిషన్‌కు ఏ అంశం కారణమో దానికి కూడా వైద్యం చేయడం వల్ల మంచి ఉపశమనం కలుగుతుంది. అంటే ఉదాహరణకు బీ12 లోపం వల్ల ఈ కండిషన్‌ ఏర్పడిందనుకోండి. అప్పుడు  దాన్ని భర్తీ చేయడం కోసం ఆ విటమిన్‌ను సమకూర్చాలన్నమాట. మీరు చెబుతున్న  లక్షణాలున్నప్పుడు అరికాళ్లను జాగ్రత్తగా కాపాడుకోవాలి. లేదంటే చిన్న పుండ్లు కూడా తీవ్రంగా ఇబ్బంది పెడతాయి. కొన్నిసార్లు రక్తప్రసరణలో ఇబ్బందులు, వెన్నుపాము జబ్బులు కూడా ఇలాంటి లక్షణాలను కలిగించవచ్చు. మీరు ఒకసారి మీకు దగ్గర్లోని న్యూరాలజిస్ట్‌ను సంప్రదించండి. 

నా తలనొప్పే  వంశపారంపర్యంగా  మా అబ్బాయికీ వస్తోందా? 
నా వయసు 36 ఏళ్లు. గత రెండు దశాబ్దాలుగా నాకు ప్రతినెలా తలనొప్పి వస్తోంది. అలా నెలలో నాలుగైదుసార్లు వస్తోంది. ఈ తలనొప్పితో నేను నా రోజువారీ పనులేవీ చేసుకోలేకపోతున్నాను. ఇప్పుడు మా అబ్బాయిని కూడా అదే సమస్య వేధిస్తోంది. ఇప్పుడు వాడి వయసు ఎనిమిదేళ్లు. నా సమస్య వంశపారంపర్యంగా వాడికి సంక్రమించిందా? దయచేసి మా సమస్యను వివరించండి.  – డి. కామేశ్వరి, కాకినాడ 
మీ చెబుతున్న లక్షణాలను బట్టి మీరు మైగ్రేన్‌తో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. తరచూ తలనొప్పి రావడం, దాంతోపాటు వాంతులు, వెలుగును చూడటంలో ఇబ్బంది పడటం, పెద్ద శబ్దాలను తట్టుకోలేకపోవడం, చీకటి గదిలో కాసేపు నిద్రపోయాక తలనొప్పి ఉపశమించడం లాంటి లక్షణాలు ఉంటే అది మైగ్రేన్‌ కావచ్చు. మీకు మైగ్రేన్‌ తలనొప్పిని ప్రేరేపించే అంశం ఏమిటో చూడండి. అంటే... సూర్యకాంతికి ఎక్స్‌పోజ్‌ కావడం, ఘాటైన వాసనలు, పర్‌ఫ్యూమ్స్‌ లేదా సుగంధద్రవ్యాల వాసన, సమయానికి భోజనం చేయకపోవడం, నిద్రలేమి, మీరు తీసుకునే ఆహారపదార్థాలలో నిర్దిష్టంగా ఏదైనా సరిపడక వెంటనే తలనొప్పి రావడం (ఉదాహరణకు చీజ్, ఆరెంజ్, అరటిపండ్లు, అజినమోటో వంటి చైనా ఉప్పు, చాక్లెట్లు వంటివి) జరుగుతుంటే వెంటనే దాన్ని తీసుకోవడం ఆపేయండి. దాంతో తలనొప్పిని నివారించవచ్చు. మీకు వచ్చే తలనొప్పిని నివారించే టోపిరమేట్, డైవల్‌ప్రోయేట్, ఫ్లునరిజిన్, ప్రొపనలాల్‌ వంటి మందులు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. వాటిని తీసుకుంటే 70 శాతం వరకు మళ్లీ వచ్చే అవకాశం నివారితమవుతుంది. మీరు చెప్పినట్టే మైగ్రేన్‌ కుటుంబసభ్యుల్లో వంశపారంపర్యంగా రావచ్చు. అయితే మీ అబ్బాయిలో కనిపించే లక్షణాలు కంటి చూపునకు సంబంధించినవా లేక మెదడుకు సంబంధించినవా అని పరీక్షించాల్సిన అవసరం ఉంది. ఒకసారి మీరు న్యూరాలజిస్ట్‌ను సంప్రదించండి. 

కళ్లు తిరిగి  పడిపోతున్నట్లుగా ఉంది... కారణం  ఏమిటి? 
నా వయసు 47 ఏళ్లు. నాకు గత రెండేళ్ల నుంచి అప్పుడప్పుడూ కళ్లు తిరుగుతున్నాయి. మందులు వాడినప్పుడు తగ్గి మళ్లీ మళ్లీ ఈ సమస్య వస్తోంది. అలా అవుతున్నప్పుడు నాకు భయమేస్తోంది. దీనికి పూర్తిగా పరిష్కారం లేదా?  – కె. రాధాకుమారి, శ్రీకాకుళం 
మీరు చెబుతున్న లక్షణాలను బట్టి మీ సమస్య ‘వర్టిగో’ అని చెప్పవచ్చు. మనల్ని సరిగ్గా అంటే బ్యాలెన్స్‌డ్‌గా నిలబెట్టే ప్రధాన భాగం చిన్నమెదడు, చెవిలోపల  ఉన్న ‘వెస్టిబ్యులార్‌ నరం’. చిన్నమెదడుకు వచ్చే జబ్బుల వల్ల మీరు పేర్కొన్న వర్టిగో లక్షణాలతో పాటు ఇతర లక్షణాలు కూడా ఉండవచ్చు. అంటే చూపులో, మాటలో, నడకలో, స్పర్శలో, బలంలో మార్పులు ఉంటే తక్షణం న్యూరాలజిస్ట్‌ను సంప్రదించాలి. అలాగే కళ్లు తిరగడం అనేది తల తిప్పినప్పుడు కొద్ది క్షణాల పాటు ఉండి, వెంటనే తగ్గిపోవడం, వినికిడి తగ్గడం, చెవిలో హోరు శబ్దం రావడం... ఇవి చెవి నరానికి సంబంధించిన జబ్బు తాలూకు లక్షణాలు. దీనికి తక్షణ ఉపశమనానికి బీటాహిస్టిన్, సిన్నరజిన్‌ లాంటి మందులు ఉపయోపడతాయి. కొన్నిసార్లు ఇది మళ్లీ మళ్లీ వస్తుంది. అలా తరచుగా వచ్చేవారికి వెస్టిబ్యులార్‌ ఎక్సర్‌సైజెస్, ఎప్లేస్‌ మెథడ్‌ ద్వారా చికిత్స అవసరం. అప్పటికీ ఫలితం కనిపించకపోతే చెవి నరానికి కొన్ని ఇంజెక్షన్లు ఇవ్వడం ద్వారా దీన్ని నియంత్రించవచ్చు. వర్టిగో అనేది కాస్త ఇబ్బంది పెడుతుంది గానీ ఏమాత్రం ప్రమాదకరం కాదు. కాబట్టి మీరు అనవసరంగా ఆందోళన పడకండి. 
– డాక్టర్‌ బి. చంద్రశేఖర్‌రెడ్డి,
చీఫ్‌ న్యూరోఫిజీషియన్, సిటీ న్యూరో సెంటర్, రోడ్‌ నెం. 12, బంజారాహిల్స్, హైదరాబాద్‌ 

Advertisement
Advertisement