నిషేధ పర్వం

Sakshi Editorial On India China Conflict

వాస్తవాధీన రేఖ(ఎల్‌ఏసీ) వద్ద మన జవాన్లు 20మందిని చైనా సైనికులు దారుణంగా హతమార్చిన నాటినుంచీ చైనా ఉత్పత్తులనూ, ఆ దేశానికి చెందిన యాప్‌లను నిషేధించాలన్న డిమాండ్‌ బలంగా వినబడుతోంది. సోమవారం కేంద్ర ప్రభుత్వం టిక్‌టాక్‌తోసహా 59 యాప్‌లపై నిషేధం విధించి ఆ డిమాండ్‌ను కొంతవరకూ నెరవేర్చింది. కేంద్రం విడుదల చేసిన ప్రకటనలో ఎక్కడా చైనా గురించి, ఆ దేశంతో వున్న వైరం గురించి ప్రస్తావన లేదు. వినియోగదారుల డేటాను ఈ యాప్‌లన్నీ మన దేశం వెలుపలవున్న సర్వర్లకు చేరవేస్తూ, వారి ప్రయోజనాలను దెబ్బతీస్తున్నాయని, దేశ సార్వభౌమత్వానికి, భద్రతకు, రక్షణకు ముప్పు కలిగిస్తున్నాయని ప్రకటన సారాంశం.

ఈ యాప్‌లలో కొన్నింటిని వేరే దేశాలు ఇదివరకే నిషేధించాయి. అమెరికాలో టిక్‌టాక్‌ పోకడలపై దర్యాప్తు సాగు  తోంది. ఇందులో భద్రతకు ముప్పు తెచ్చే అంశాలున్నాయని అక్కడి నిఘా విభాగాల అనుమానం. మన దేశం విధించిన నిషేధంపై ‘తీవ్రంగా ఆందోళన చెందుతున్నామ’ంటూ స్పందించిన చైనా సైతం వాట్సప్, ట్విటర్, ఫేస్‌బుక్‌ తదితర సామాజిక మాధ్యమాలను దూరంపెట్టింది. కనుక ఇటువంటి నిషేధాలు ప్రపంచానికి కొత్తేమీ కాదు. టిక్‌టాక్‌ విషయంలో ఎప్పటినుంచో మన దేశంలో అనుమానాలున్నాయి. మొన్న మార్చిలో ఒక ఎంపీ దీన్ని గురించి ప్రశ్నించారు కూడా. అయితే అది వాస్తవం కాదని కేంద్రం జవాబిచ్చింది. 

నిషేధించిన యాప్‌లలో టిక్‌టాక్‌కు వున్న ప్రజాదరణ అంతా ఇంతా కాదు. మన దేశంలో 20 కోట్లమంది దాన్ని డౌన్‌లోడ్‌ చేసుకున్నారని అంచనా. ఫైల్‌ షేరింగ్‌ యాప్‌ షేర్‌ఇట్‌ కూడా అలాంటిదే. పుస్తకాలను, డాక్యుమెంట్లను సులభంగా పీడీఎఫ్‌గా మార్చి క్షణంలో ఎవరికైనా పంపే కామ్‌స్కానర్‌ కూడా అందరికీ పరిచితమైనది. ఇక మొబైల్‌ బ్రౌజర్‌ యూసీ బ్రౌజర్, గేమింగ్‌ యాప్‌ క్లాష్‌ ఆఫ్‌ కింగ్స్‌ వగైరాలు కూడా జాబితాలో వున్నాయి. ఇతర యాప్‌ల మాటెలావున్నా మారుమూల పల్లెలు, పట్టణాలు, నగరాల్లో సైతం సామాన్యులకు ఇప్పుడు టిక్‌టాక్‌ ప్రాణప్రదంగా మారింది. దీనికున్న ఆదరణ చూసిన అనేక బ్రాండ్లు, కోచింగ్‌ సెంటర్లు, ఇతర సంస్థలు తమ వ్యాపారాన్ని పెంచుకోవడానికి ఈ మాధ్యమాన్ని ఆశ్రయించాయి.

రాజకీయ నాయకులు, ప్రజలను ప్రభావితం చేయాలనుకునే ఇతర వర్గాలవారు టిక్‌టాక్‌ను వేదికగా చేసుకోవడం మొదలుపెట్టారు. కరోనా వైరస్‌ విషయంలో జాగ్రత్తగా వుండాలని అప్రమత్తం చేసే వీడియోల్లో క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీ, నటీనటులు కృతి సనన్, ఆయుష్మాన్‌ ఖురానా, సారా అలీ ఖాన్‌ వగైరాలు నటించారు. తెలుగులో కూడా అనేక మంది నటీనటులు టిక్‌టాక్‌ ద్వారా తమ సందేశాలు అందించారు. ఆటపాటలు, వ్యంగ్య వ్యాఖ్యలు, వంటలు, వెటకారాలు వగైరాలన్నీ టిక్‌టాక్‌ మాధ్యమంలో సూపర్‌హిట్‌ అయ్యాయి. వాటి సృష్టి కర్తలకు సినిమా నటులకుండే స్థాయి ఆదరణ ఏర్పడి, వారు డిజిటల్‌ స్టార్లయ్యారు. చెప్పాలంటే వినోదాన్ని టిక్‌టాక్‌ ప్రజాస్వామీకరించింది. ఎందుకంటే దానికి ఖరీదైన ఉపకరణాలు, మేకప్‌లు అవసరం లేదు. మెరుగైన ఆండ్రాయిడ్‌ సెల్‌ఫోన్‌ వుంటే చాలు. ఆ వేదికపై అవినీతి లేదు... బంధు ప్రీతి లేదు... ఎవరినో ఆశ్రయించే పనిలేదు... ఎవరి దయాదాక్షిణ్యాలూ అవసరం లేదు. వయసుతో పనిలేదు. ఏడెనిమిదేళ్ల వయసు వారినుంచి ఎనభై తొంభైయ్యేళ్ల వృద్ధుల వరకూ టిక్‌టాక్‌ ద్వారా పేరు ప్రఖ్యాతులు పొందినవారున్నారు.

ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఎనిమిదేళ్ల చిన్నారి ప్రాచీయాదవ్‌ ఇందుకు ఉదాహరణ. మధ్యప్రదేశ్‌లోని హర్దా అనే చిన్న జిల్లాకు చెందిన మహేంద్ర డోగ్నేను టిక్‌ టాక్‌లో అనుసరించేవారు 64 లక్షలమంది వున్నారు. ఇది ఆ యువకుడుంటున్న జిల్లా జనాభాకన్నా అధికం! మారుమూల పల్లెల్లో వున్నవారు సైతం తమ ప్రతిభను ప్రదర్శించి పేరు తెచ్చుకోవడంతో పాటు డబ్బు సంపాదించడం టిక్‌టాక్‌ వల్ల సాధ్యపడింది. అందులో ఆకర్షణీయమైన విషయాన్ని అందించగలిగేవారు రూ. 500 నుంచి రూ. 5 లక్షల వరకూ సంపాదించగలుగుతున్నారని రెండు నెలలక్రితం ఒక మీడియా సంస్థ వెల్లడించింది. ఫేస్‌బుక్, వాట్సాప్‌ మాధ్యమాలను టిక్‌టాక్‌ చాలా త్వరగానే అధిగమించి ఔరా అనిపించుకుంది.

ఇతర మాధ్యమాలు ఇంగ్లిష్‌ను వదల్లేని స్థితిలోవుంటే టిక్‌టాక్‌ ఏ భాష మాట్లాడేవారికైనా అందుబాటులోకొచ్చింది. అది 150 దేశాల్లో 75 భాషల్లో లభ్య మవుతోంది. మన దేశంలో తెలుగుతో సహా 15 భాషల్లో వేళ్లూనుకుంది. ఈ ప్రజాదరణను టిక్‌టాక్‌ దండిగా సొమ్ము చేసుకోగలుగుతోంది. అయితే ఈ క్రమంలో అది ఎన్నో వివాదాలను మూట గట్టుకుంటున్న మాట కూడా వాస్తవం. ముఖ్యంగా పసిపిల్లలతో లైంగిక చేష్టలు చేయించే ముఠాలకు, ఇతరులపై నిందలేసేవారికి, విద్వేషాలను పెంచేవారికి ఇది వేదికగా మారుతున్నా వారిని అరికట్టే కట్టుదిట్టమైన నియంత్రణలు సరిగాలేవన్న ఆరోపణలున్నాయి. ఈ కారణంతోనే నిరుడు మద్రాస్‌ హైకోర్టు టిక్‌టాక్‌పై కొన్నాళ్లు నిషేధం విధించింది. గత నెలలో మహిళపై యాసిడ్‌ దాడులను ప్రోత్సహించేదిగా వున్న ఒక వీడియో కలకలం రేపింది. ఫిర్యాదులొచ్చేవరకూ టిక్‌టాక్‌ దాన్ని పట్టించుకోలేకపోయింది. 

ఇప్పుడు యాప్‌లు నిషేధించడానికి కేంద్రం ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ చట్టంలోని సెక్షన్‌ 69ఏ ను ప్రయోగించింది. ఇందుకు కారణాలు ఏం చెప్పినా డౌన్‌లోడ్‌ చేసుకునే యాప్‌ల ద్వారా కోట్లాది మంది వినియోగదారుల సమాచారం సరిహద్దులు దాటిపోతున్న మాట వాస్తవం. ఇది చైనా యాప్‌ లకు మాత్రమేకాదు... అన్ని రకాల యాప్‌లకూ వర్తిస్తుంది. డౌన్‌లోడ్‌ చేసుకోవాలన్న ఆత్రుతలో ఆ యాప్‌లు కోరే సమాచారమేమిటో తెలుసుకోకుండా అనుమతులివ్వడం వల్ల వ్యక్తిగత సమాచారం అవాంఛనీయ శక్తులకు చేరే ప్రమాదం ఎప్పుడూ వుంటుంది. ఇప్పుడు నిషేధించిన యాప్‌లకు దీటైన దేశీయ యాప్‌లలోనైనా మెరుగైన నియంత్రణలు, జనం మనోభావాలను పట్టించుకునే ఏర్పాట్లు ఉంటాయని ఆశించాలి. 

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top