సెర్ఫా పేరిట తెరపైకి మరో మల్టీ లెవల్‌ మోసం..

Sakshi Special Investigation On Another Multi Level Marketing Fraud

లక్షాధికారి అవుతారంటూ వల.. రూ. 18 వేల వసూలు

బ్యాంకు ఖాతాలో తొలుత రూ. 2 వేలు జమ.. ఆపై ఒక్కో పార్ట్‌నర్‌ను చేర్పిస్తే రూ. 1,200 చొప్పున కమీషన్‌ ఆశ

మాటలే పెట్టుబడి.. మధ్యతరగతి ప్రజలే టార్గెట్‌

కట్టించుకున్న డబ్బులు వెనక్కివ్వని వైనం

విశాఖ కేంద్రంగా దందా.. హైదరాబాద్‌లోనూ కార్యకలాపాలు

సాక్షి పరిశోధన

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో గొలుసుకట్టు దందాలకు అడ్డుకట్ట పడటంలేదు. ఇటీవలి కాలంలో క్యూనెట్, హీరా గ్రూపు ఉదంతాలు వెలుగుచూసినా కొత్త పేర్లు, ఐడియాలతో జనాల జేబుకు చిల్లు పెట్టేందుకు నయా మార్గాల్లో పుట్టుకొస్తూనే ఉన్నాయి. వేగంగా డబ్బు రెట్టింపు చేస్తామని ఆశచూపుతూ మధ్యతరగతి ప్రజల జీవితా లతో ఆటలాడుకుంటున్నాయి. తాజాగా సెర్ఫా మార్కెటింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పేరిట హైదరాబాద్‌లో ఓ కొత్త కంపెనీ వెలిసింది. మధ్యతరగతి కుటుంబాలే లక్ష్యంగా వ్యాపారం సాగిస్తోంది. ఏడాదిలో లక్షాధి కారులు కావచ్చని అరచేతిలో స్వర్గం చూపిస్తూ అమాయకుల నుంచి భారీగా దండుకుంటోంది.

ఎలా చేస్తున్నారు..?
సెర్ఫా కంపెనీలో చేరాలంటే ముందుగా రూ. 18 వేలు కట్టాలి. దానికి సమాన విలువ అని చెబుతూ రెండు 100 గ్రాముల బరువున్న ట్యాబ్లెట్ల డబ్బాలు అంట గడతారు. కట్టిన డబ్బు వృథా కాలేదు అనే భావన కస్టమర్‌కు కలిగేలా సంతృప్తి పడేలా నూరిపోస్తారు. వాస్తవానికి ఆ ట్యాబ్లెట్ల విలువ మార్కెట్లో రూ. 1,000–2,000కు మించదు. తరువాత వారికి ఒక ఐడీ, పాస్‌వర్డ్‌ క్రియేట్‌ చేస్తారు. అంతకుముందే బ్యాంకు, ఆధార్‌ ఖాతాల వివరాలు తీసుకొని తొలుత ఖాతాలో రూ. 2 వేలు జమచేస్తారు. ఇక అక్కడ నుంచి ఖాతాదారు తరఫున ఎంత మంది చేరితే అన్ని రూ. 1,200 చొప్పున ఖాతాలో జమ చేస్తామని ఆశచూపుతారు. బంధువులు, స్నేహితులను చేర్పించమంటూ మానవ సంబంధాలపై వ్యాపారం నడిపిస్తున్నారు. వారు తమ కంపెనీలో చేరే ప్రతి ఒక్కరినీ పార్ట్‌నర్‌ని అని చెబుతుండటం గమనార్హం.

ఏడాదిన్నర కంపెనీలో మూడేళ్లుగా పనిచేస్తున్నారట..
వాస్తవానికి ఈ కంపెనీని రిజిస్ట్రార్‌ ఆఫ్‌ కంపెనీస్‌ (ఆర్వోసీ) వద్ద  2018 ఏప్రిల్‌ 26న విశాఖపట్నం కేంద్రంగా రిజిష్ట్రేషన్‌ చేశారు. అంటే దీని వయసు ఏడాదిన్నరలోపే. కానీ ఇందులో పనిచేసే ఉద్యోగులు మాత్రం తాము 2016 నుంచి ఈ కంపెనీలో చేస్తున్నామని, ఎంటెక్, ఎంబీఏలు చదివి వేల రూపాయల వేతనాలు వదులకొని ఇందులో భాగస్వాములుగా చేరామని గొప్పలు చెబుతున్నారు. ప్రతి వారినీ కంపెనీలో భాగస్వాములంటూ సంబోధించడంతో వెనకా ముందు చూడకుండా పేదలు దిగువ మధ్యతరగతి మహిళలు, నిరుద్యోగులు అప్పు చేసి మరీ పెట్టుబడి పెడుతున్నారు. 

క్యూనెట్‌ ప్రెస్‌మీట్‌తో ఖాతాదారుల్లో అనుమానాలు..
ఇటీవల క్యూనెట్‌ మోసాలపై సైబరాబాద్‌ పోలీసులు పెట్టిన విలేకరుల సమావేశంలో వివరాలు తెలుసుకుని ఇందులో చేరిన ఖాతాదారులు కొందరు ఆలోచనలో పడ్డారు. ఈ కంపెనీ ప్రతినిధులు ఇది మల్టీ లెవెల్‌ మార్కెటింగ్‌ సిస్టమ్‌ కాదని చెబుతున్నా.. అదేబాటలో నడుస్తుండటంతో అనుమానం వచ్చి తమ డబ్బులు తిరిగి ఇవ్వాలని అడగడం మొదలుపెట్టారు. కానీ, వారిని కంపెనీ ప్రతినిధులు దబాయిస్తున్నారు. తమపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే లీగల్‌ యాక్షన్‌ తీసుకుంటామని, కోర్టుకు లాగుతామని బెదిరిస్తున్నారు. దీంతో బాధితులు ‘సాక్షి’ని ఆశ్రయించారు. అందరిలాగానే వెళ్లిన సాక్షి ప్రతినిధికి కూడా కంపెనీ ఉద్యోగులు అరచేతిలో స్వర్గం చూపే ప్రయత్నం చేశారు. ఈ తతంగాన్నంతా ‘సాక్షి’ రికార్డు చేసింది. తరువాత దీనిపై వివరణ కోరగా.. తమకు అన్ని అనుమతులు ఉన్నాయని తామెవరినీ మోసం చేయడం లేదని చెప్పుకొచ్చారు.

చిక్కుకున్నాక మోసం..
ఈ దందాలే మానవ సంబంధాలు, మాటలే పెట్టుబడులు. మోసంలో చిక్కుకున్నాక.. తమ డబ్బును ఎలాగైనా తిరిగి వసూలు చేసుకోవాలని, బంధువులను, స్నేహితులను ఇందులో చేరుస్తున్నారు. ఫలితంగా మోసం వెలుగుచూసాక.. బంధాలు తెగిపోతున్నాయి. ఇలాంటి బాధితుల్లో అధికంగా సాఫ్ట్‌వేర్, ఇతర ప్రైవేటు, ఎంటెక్, ఎంబీఏలు చదివిన గ్రాడ్యుయేట్లు కావడం గమనార్హం.

డబ్బులిమ్మంటే బెదిరిస్తున్నారు..
మొదట్లో ఇదేదో మామూలు స్కీం అనుకున్నా. అందుకే పొరుగింటావిడ చెప్పిందని చేరాను. మొన్న క్యూనెట్‌ గురించి వార్తల్లో చదివా. రెండూ ఒకేరకంగా ఉండటంతో కంపెనీ ప్రతినిధులను నిలదీశా. వారు కంపెనీకి అనుమతులు ఉన్నాయన్నారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే మాత్రం లీగల్‌ యాక్షన్‌ తీసుకుంటామని తిరిగి మమ్మల్నే బెదిరిస్తున్నారు.
– తులసి, గృహిణి, కేపీహెచ్‌బీ కాలనీ

పేరేదైనా.. చివరి లక్ష్యం మోసమే..!
హైదరాబాద్‌లో రకరకాల పేర్లతో అక్రమార్కులు జనాల జేబులకు చిల్లు పెడుతున్నారు. అందుకు పోంజి, మల్టీలెవల్‌ మార్కెటింగ్, హెర్బల్‌ ఇలా తదితర మార్గాల్లో దందాలు చేస్తున్నారు. అందరి లక్ష్యం ఒకటే.. జనాల నుంచి తక్కువ సమయంలో అందినకాడికి దండుకోవడం.

క్యూనెట్‌: రాష్ట్ర రాజధాని ఇటీవల వెలుగుచూసిన మల్టీలెవల్‌ మార్కెటింగ్‌ మోసం విలువ దాదాపు రూ. 1,000 కోట్లపైనే. ఉద్యోగానికి రాజీనామా చేసిన ఓ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి రూ. 25 లక్షలు పెట్టుబడి పెట్టి దారుణంగా మోసపోయాడు. తనతోపాటు స్నేహితులు, బంధువులనూ చేర్పించాడు. వారి వద్ద మొహం చెల్లక చివరకు ఆత్మహత్య చేసుకున్నాడు.

హీరా: ఇదో రకమైన పోంజి స్కీం. అధిక వడ్డీ ఆశజూపి హైదరాబాద్‌ కేంద్రంగా సాగిన దందా ఇది. దీని విలువ ఏకంగా రూ. 5,000 కోట్లు. ఈ పథకంలో చేరిన వారిలోనూ అధిక శాతం విద్యావంతులు, గ్రాడ్యుయేట్లే ఉండటం గమనార్హం. ఆర్‌బీఐ నిబంధనలకు వ్యతిరేకంగా ఏ సంస్థా అధిక వడ్డీ చెల్లించదన్న చిన్న పాయింట్‌ను బాధితులెవరూ గుర్తించకపోవడం కుంభకోణానికి అసలు కారణం.

కరక్కాయలు: రోజుకు కిలో కరక్కాయలు దంచిపెడితే రూ. 1,000 ఇస్తామని ఆశచూపి కోట్ల రూపాయలు దండుకున్న విషయం తెలిసిందే. నెల్లూరుకు చెందిన ఓ కేటుగాడు ప్రారంభించిన ఈ దందాలో చిక్కి 650 మంది మహిళలు దాదాపు రూ.8.3 కోట్ల వరకు పోగొట్టుకున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top