కోచింగ్‌ పేరుతో దోపిడీ!   

Exploitation in the name of coaching! - Sakshi

వసతులు లేకున్నా అడ్డగోలు ఫీజుల వసూలు

బోధన సైతం అంతంతమాత్రమే...

నిరుద్యోగులను నంజుకుతింటున్నయాజమాన్యాలు

పట్టించుకోని అధికారులు

సాక్షి, కామారెడ్డి: ఉద్యోగ నియామకాలకు సంబంధించిన నోటిఫికేషన్‌లు వెలువడుతాయనగానే కోచింగ్‌ సెంటర్ల నిర్వాహకుల హడావుడి మొదలవుతుంది. అందమైన బ్రోచర్లు ముద్రించి నిరుద్యోగులను ఆకర్శించే ప్రయత్నం చేస్తారు. తమ దగ్గర అనుభవజ్ఞులైన అధ్యాపకులు ఉన్నారంటూ నమ్మిస్తారు. వీరి ప్రచారాన్ని చూసి కోచింగ్‌ సెంటర్లలో చేరిన నిరుద్యోగులు.. సెంటర్లలో సరైన వసతులు లేక ఇబ్బందులు పడుతున్నారు.

జిల్లాలో కోచింగ్‌ సెంటర్ల నిర్వహణకు సంబంధించి కనీస నియమాలు కూడా పాటించడం లేదు. అధికారులకు ఎంతో కొంత ముట్టజెప్పుకుని కోచింగ్‌ సెంటర్లను ఇష్టారాజ్యంగా నడుపుకుంటున్నారన్న ఆరోపణలున్నాయి. జిల్లా కేంద్రమైన కామారెడ్డి పట్టణంలో నడుస్తున్న వాటిలో ఏ ఒక్కటి కూడా నిబంధనల ప్రకారం కొనసాగడం లేదు. కనీస సౌకర్యాలు లేకపోవడంతో కోచింగ్‌లో చేరిన నిరుద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. 

ఇష్టారాజ్యంగా.. 

జిల్లా కేంద్రంలో నడస్తున్న కోచింగ్‌ సెంటర్ల లో యాజమాన్యాల ఇష్టారాజ్యం కొనసాగుతోంది. కోచింగ్‌ సెంటర్ల నిర్వాహకులు నిరుద్యోగుల నుంచి అడ్డగోలుగా ఫీజులు వసూలు చేస్తున్నారు. గతంలో ఉపాధ్యాయ నియామకాల కోసం టెట్, డీఎస్సీ అని ప్రకటనలు రావడంతోనే కోచింగ్‌ సెంటర్ల నిర్వాహకులు తమ కార్యాలయాల దుమ్ముదులిపారు.

రెండు మూడేళ్ల కాలంలో కామారెడ్డి పట్టణంలో టెట్, డీఎస్సీ పేరుతో క్లాసులు నిర్వహించి రూ. కోట్లల్లో వసూలు చేశారు. ఇప్పుడు వీఆర్వో, పోలీస్‌ కానిస్టేబుళ్ల పరీక్షల కోసం కోచింగ్‌ క్లాసులు నిర్వహిస్తున్నారు. ఏళ్ల తరబడిగా ఉద్యోగ నియామకాలు లేకపోవడంతో నిరుద్యోగులు నోటిఫికేషన్లు వెలువడితే చాలు.. కోచింగ్‌ సెంటర్లకు పరుగులు తీస్తున్నారు.

పోటీని తట్టుకుని ఉద్యోగం సాధించాలంటే కోచింగ్‌ తీసుకోవలసిందేనన్న భావనతో కోచింగ్‌ సెంటర్లను ఆశ్రయిస్తున్నారు. సెంటర్ల నిర్వాహకులు షార్ట్‌టర్మ్‌ కోచింగ్‌ల కోసం రూ. 5 వేల నుంచి రూ. 10 వేల వరకు ఫీజు వసూలు చేస్తున్నారు. మెటీరియల్‌ కోసం అదనంగా డబ్బులు గుంజుతున్నారు. 

నిబంధనలకు విరుద్ధంగా... 

కోచింగ్‌ సెంటర్ల నిర్వహణకు సంబంధించి విద్యాశాఖ నుంచి అన్ని అనుమతులు పొందాల్సి ఉంటుంది. కానీ జిల్లా కేంద్రంలో ఏ ఒక్కదానికి సరైన అనుమతులు లేవని తెలుస్తోంది. కోచింగ్‌ సెంటర్లలో కూర్చోవడానికి కనీస సౌకర్యాలు కూడా లేవు. వెంటిలేషన్, టాయ్‌లెట్స్, తాగునీటి సౌకర్యం.. ఇలా ఏ వసతీ కల్పించడం లేదు. విద్యాశాఖ నుంచి అనుమతులు పొందిన తర్వాతనే తరగతులు నిర్వహించాల్సి ఉన్నా.. ఎక్కడా అమలు కావడం లేదు.  

అర్హతలు లేని వారే బోధకులు 

కోచింగ్‌ సెంటర్లలో ఆయా అంశాలకు సంబంధించి పట్టభద్రులు బోధించాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ నడుస్తున్న సెంటర్లలో అర్హతలు లేనివారే ఎక్కువగా పనిచేస్తున్నారని తెలుస్తోంది. కేంద్రాల్లో బోధకులు, వారి విద్యార్హతల జాబితాలను ప్రదర్శించాల్సి ఉంటుంది. పూర్తిగా నిబంధనలను అతిక్రమించి తరగతులు నిర్వహిస్తున్నారు. తరగతులను ప్రారంభించే సమయంలో గొప్పలు చెప్పిన యాజమాన్యాలు.. తరువాత వాటి ఊసెత్తడం లేదు.

కోచింగ్‌ సెంటర్లు నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నప్పటికీ సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదు. సెంటర్ల నిర్వాహకులు అధికారులను మేనేజ్‌ చేసుకుంటున్నారని, దీంతో వారు వీటివైపు చూడడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా కోచింగ్‌ సెంటర్లను నడిపిస్తున్న వారిపై జిల్లా అధికారులు చర్యలు తీసుకోవాలని నిరుద్యోగులు కోరుతున్నారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top