‘విద్యా సంస్కరణల’ పేరుతో టోకరా | Cyber Criminals Cheat Priate Schools in Hyderabad | Sakshi
Sakshi News home page

‘విద్యా సంస్కరణల’ పేరుతో టోకరా

May 16 2019 8:15 AM | Updated on May 16 2019 8:15 AM

Cyber Criminals Cheat Priate Schools in Hyderabad - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: యూనివర్సిటీ ఆఫ్‌ మిచిగాన్, లండన్‌ యూనివర్సిటీ సహకారంతో పాఠశాల విద్యా విధానంలో సంస్కరణలు తీసుకురావడానికి కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ (ఎంహెచ్‌ఆర్డీ) ప్రయత్నాలు చేస్తోందని ప్రచారం చేయడమేగాక దానికి సంబంధించిన ప్రత్యేక పథకంలో చేరితే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని విజన్‌ డాక్యుమెంట్‌తో ఎర వేశారు. వారి మాయలో పడిన రెండు ప్రైవేట్‌ పాఠశాలల యజమాన్యాల నుంచి రూ.6.8 లక్షలు కాజేశారు. ఎట్టకేలకు మోసపోయామని గుర్తించిన బాధితుల ఫిర్యాదుతో సిటీ సైబర్‌ క్రైమ్‌ ఠాణాలో కేసు నమోదైంది. రంగంలోకి దిగిన ప్రత్యేక బృందం నిందితుల కోసం దేశ రాజధాని ఢిల్లీలో ముమ్మరంగా గాలిస్తోంది. ఈ గ్యాంగ్‌ ఇదే పంథాలో దేశ వ్యాప్తంగా మోసాలకు పాల్పడినట్లు ఆధారాలు లభ్యమయ్యాయి. ఆసిఫ్‌నగర్‌లోని రేడియన్స్‌ స్కూల్, టోలిచౌక్‌లోని ఐడియల్‌ స్కూళ్లకు చెందిన కరస్పాండెంట్లు సోహైల్, నవీద్‌లకు ఎంహెచ్‌ఆర్డీ పేరుతో సైబర్‌ నేరగాళ్లు వాట్సాప్, ఈ–మెయిల్స్‌ సందేశాలు పంపారు. వీటిలో సెంటర్‌ ఫర్‌ కరెక్టివ్‌ రిఫామ్స్‌ ఇన్‌ ఎడ్యుకేషన్‌ (సీసీఆర్‌ఈ) స్కీమ్‌లో చేరితో పాఠశాలకు కలిగే  ప్రయోజనాలు, తద్వారా  యజమాన్యానికి, ఉపాధ్యాయులు విద్యార్థులకు, సమాజానికి ఒనగూరే లాభాలు వివరిస్తూ ఓ విజన్‌ డాక్యుమెంట్‌ను ఎటాచ్‌ చేశారు. ప్రాథమికంగా ఈ విధానాన్ని పైలెట్‌ ప్రాజెక్టులో దేశంలోని 3000 స్కూళ్లలో చేపడుతున్నట్లు అందులో పేర్కొన్నారు. దీనికి కనిష్టంగా మూడేళ్లు, గరిష్టంగా ఐదేళ్ళ కాలవ్యవధి ఉందని, పనితీరును బట్టి కొనసాగింపు ఉంటుందని తెలిపారు. అత్యంత ఆకర్షణీయంగా ఉన్న ఇందులోనే సైబర్‌ నేరగాళ్ళు ఓ మెలికపెట్టారు. పైలెట్‌ ప్రాజెక్టులో భాగస్వాములయ్యేందుకు సెక్యూరిటీ డిపాజిట్‌ చెల్లించాలని షరతు విధించారు.

ఏప్రిల్‌ మొదటి వారంలో ఢిల్లీలో ఈ కార్యక్రమం లాంఛనంగా ప్రారంభం కానుందని, డిపాజిట్‌ చెల్లించి సభ్యులుగా చేరిన వారు మాత్రమే అందుకు హాజరయ్యేందుకు అర్హులంటూ నమ్మించారు. దీంతో ఈ రెండు స్కూళ్ల కరస్పాండెంట్లు రూ. 3.42 లక్షల చొప్పున మొత్తం రూ. 6.84 లక్షలు సైబర్‌ నేరగాళ్లు సూచించిన బ్యాంకు ఖాతాలో మార్చి రెండో వారంలో డిపాజిట్‌ చేశారు. ఆపై వారు తాము డిపాజిట్‌ చేసిన డబ్బుకు గ్యారంటీ ఏమిటంటూ సైబర్‌ నేరగాళ్లను వాట్సాప్‌ ద్వారా అడిగారు. అప్పటితో వారి నుంచి సమాచారం ఆగిపోయింది. ఎన్నిసార్లు ప్రయత్నించినా సంప్రదింపులు జరగలేదు. ఢిల్లీ కార్యక్రమానికి సంబంధించి ఎలాంటి ఉత్తర ప్రత్యుత్తరాలు లేకపోవడంతో అనుమానం వచ్చిన బాధితులు ఆరా తీయగా ఆ ప్రాజెక్టే లేదని తేలింది. తాము మోసపోయినట్లు గుర్తించిన వారు నగర సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. ప్రాథమిక దర్యాప్తు నేపథ్యంలో ఈ ముఠాకు సంబంధించి ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి.

ఈ గ్యాంగ్‌ సభ్యులు సీసీఆర్‌ఈ పేరుతో ఢిల్లీలో కార్యాలయాన్ని ప్రారంభించి దేశ వ్యాప్తంగా మోసాలకు పాల్పడుతున్నట్లు ఆధారాలు సేకరించారు. వీరిని పట్టుకోవడానికి ఢిల్లీకి వెళ్లిన సైబర్‌ క్రైమ్‌ పోలీసుల ఆ కార్యాలయాన్ని గుర్తించి ఆరా తీయగా కొన్నాళ్ల క్రితమే మూతపడినట్లు వెల్లడైంది. సాంకేతిక ఆధారాలను బట్టి ముందుకు వెళ్లిన పోలీసులు ఆ ఢిల్లీ గ్యాంగ్‌కు సంబంధించిన బ్యాంకు ఖాతాలను గుర్తించారు. వాటిలో రూ. 50 లక్షలకు పైగా నగదు నిల్వ ఉన్నట్లు తేల్చారు. దీంతో ఈ మొత్తాన్ని ఫ్రీజ్‌ చేయాల్సిందిగా బ్యాంకులకు లేఖ రాశారు. దేశ వ్యాప్తంగా ఈ తరహాలో మోసాలకు పాల్పడిన ఈ ఘరానా గ్యాంగ్‌ కోసం ప్రత్యేక బృందం ముమ్మరంగా గాలిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement