బాండ్‌ ఫండ్లు కొన్నిచాలు!

Risk in Every investment - Sakshi

ఎంచుకోవటానికి ఎన్నున్నా తక్కువే మేలు

అన్నిటి పనితీరూ దాదాపు ఒకేలా ఉండే చాన్స్‌

లిక్విడ్, షార్ట్‌ డ్యూరేషన్‌ ఫండ్స్‌లో రిస్క్‌ తక్కువ

వీటిని అర్థం చేసుకోవడం కూడా సులభమే

రిస్క్‌ ఉన్నా ఓకే అనుకుంటే క్రెడిట్‌ రిస్క్‌ పథకాలు

పెట్టుబడి పెట్టేటపుడు ప్రతి ఇన్వెస్ట్‌మెంట్‌పైనా అధిక రాబడిని ఆశిస్తే రిస్క్‌ పెరిగిపోతుందని గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ఎక్కువ రిస్క్‌ ఎక్కువ ఉంటే అక్కడే రాబడి కూడా ఎక్కువుంటుంది. అందుకని రిటైల్‌ ఇన్వెస్టర్లు ప్రతిచోటా అధిక రాబడి ఆశిస్తే... ప్రతికూల పరిస్థితుల్లో కొన్ని చేదు ఫలితాలు ఎదురుకావచ్చు. కాబట్టి రిటైల్‌ ఇన్వెస్టర్లు తమ పోర్ట్‌ఫోలియోను డైవర్సిపై చేసుకోవటం తప్పనిసరి.

అధిక రాబడుల కోణంలో 100 శాతం పెట్టుబడులను ఈక్విటీ పథకాల్లోనే ఇన్వెస్ట్‌ చేయకుండా, కొంత శాతాన్ని బాండ్‌ ఫండ్స్‌కు కూడా కేటాయించుకోవడం శ్రేయస్కరం. సెబీ ఇటీవల మ్యూచువల్‌ ఫండ్‌ పథకాలను హేతుబద్ధం చేయటం తెలిసిందే. అయితే, బాండ్‌ ఫండ్స్‌లో 16 కేటగిరీలను ప్రవేశపెట్టడంతో వీటిలో ఏ పథకాలు ఎంచుకోవాలి? అన్న సందేహం చాలా మందికి వస్తోంది. వీటిని నిపుణుల ముందు ఉంచింది ‘సాక్షి’. రెండు మూడు బాండ్‌ ఫండ్స్‌ చాలన్నది వారి సూచన. ఇంకా వారు చెప్పిన వివరాల సమాహారమే ఈ కథనం... – సాక్షి, పర్సనల్‌ ఫైనాన్స్‌ విభాగం

సరైన బాండ్‌ ఫండ్‌ ఎంచుకునేందుకు ముందుగా ఆ ఫండ్‌తో వచ్చే ప్రయోజనాలపై అవగాహన తెచ్చుకోవాలి. ప్రాథమికంగా చూస్తే బాండ్‌ ఫండ్‌ అన్నది మొత్తం పోర్ట్‌ఫోలియోకు కుషన్‌ లాంటిది. స్థిరమైన రాబడులతో పోర్ట్‌ఫోలియోకు దన్నుగా ఉంటుంది. డెట్‌ ఫండ్స్‌ అన్నవి మరింత ఆటుపోట్లతో కూడిన పెట్టుబడి సాధనాలకు హెడ్జింగ్‌ లాంటివన్నది ‘ఫండ్స్‌ ఇండియా’ మ్యూచువల్‌ ఫండ్స్‌ రీసెర్చ్‌ హెడ్‌ విద్యా బాల మాట. అయితే, బాండ్‌ ఫండ్స్‌లో ఎన్నో రకాలున్నాయి కనుక వాటిని చూసి అయోమయంలో పడిపోవక్కర్లేదు. బాండ్‌ పోర్ట్‌ఫోలియో ఏర్పాటుకు సులభ విధానాన్ని అనుసరించొచ్చని, రెండు మూడు రకాల పథకాలకు మించి అవసరం లేదని ఆయన చెప్పారు.

మొదటి ప్రాధాన్యం ఇదీ...  
బాండ్‌ ఫండ్స్‌ను ఎంపిక చేసుకునే వారికి తొలి ప్రాధాన్యం లిక్విడ్‌ ఫండే. 91 రోజుల వరకు కాల వ్యవధి తీరే సాధనాల్లో ఈ ఫండ్స్‌ ఇన్వెస్ట్‌ చేస్తాయి. వీటి గురించి అర్థం చేసుకునేందుకు ఎటువంటి గందరగోళం అవసరం లేదు. ‘‘వీటిలో రాబడులన్నవి ముందే అంచనా వేయొచ్చు.  పోర్ట్‌ఫోలియోకు స్థిరత్వాన్నిస్తాయి. క్రెడిట్‌ లేదా వడ్డీ రేట్ల పరంగా రిస్క్‌ ఉండదు’’అని విద్యా బాల వివరించారు. పైగా లిక్విడ్‌ ఫండ్స్‌లో పెట్టుబడులను అత్యవసర నిధిగా వినియోగించుకోవటం సులువు. మిగులు నిధులను బ్యాంకు ఖాతాల్లో ఉంచే బదులు లిక్విడ్‌ ఫండ్స్‌లో పెట్టుబడి పెడితే రాబడులు అధికంగా పొందొచ్చు.

బ్యాంకు సేవింగ్స్‌ ఖాతాలపై వడ్డీ 3.5 శాతమే. కానీ, లిక్విడ్‌ ఫండ్‌ లేదా లోడ్యూరేషన్‌  ఫండ్‌లో రాబడులు 7– 7.5 శాతం స్థాయిలో ఉంటాయి. లిక్విడ్‌ ఫండ్స్‌లో ఉంచిన నిధులను ఇన్వెస్టర్‌కు అవసరం ఏర్పడితే కొన్నింటిలో తక్షణమే వెనక్కి తీసుకునేందుకు అవకాశం ఉంది. రూ.50,000 వరకు లేదా ఫండ్‌ విలువలో 90 శాతం ఏది తక్కువ అయితే ఆ మేర వెంటనే వెనక్కి తీసుకోవచ్చు. కొన్నింటిలో మరుసటి రోజు తీసుకునేందుకు అవకాశం ఉంది. వెంటనే తీసుకునే అవకాశం ఉన్నందున బ్యాంకు ఖాతాకు ఉన్న సౌకర్యం ఇందులోనూ ఉంటుంది.

అతితక్కువ లేదా తక్కువ కాల ఫండ్స్‌ మూడేళ్ల కాల వ్యవధి వరకు ఉన్న సాధనాల్లో పెట్టుబడులు పెడతాయని, ఇన్వెస్టర్లు ఇంతే కాల వ్యవధి కోసం వీటిని ఎంచుకోవచ్చన్నది మార్నింగ్‌ స్టార్‌ ఫండ్‌ రీసెర్చ్‌ డైరెక్టర్‌ కౌస్తుభ్‌ బేల్‌పుర్కార్‌ సూచన. వడ్డీ రేట్ల పరంగా వీటిలో అంత రిస్క్‌ ఉండదని, తక్కువ కాల వ్యవధితో కూడిన బాండ్స్‌ వీటి పోర్ట్‌ఫోలియోలో ఉండడమే కారణమని, లిక్విడ్‌ ఫండ్‌ కంటే అధిక రాబడులను ఇస్తాయని చెప్పారాయన. దాదాపు రిస్క్‌కు దూరంగా ఇవి అధిక రాబడులను అందిస్తాయని ప్లాన్‌రూపీ ఇన్వెస్ట్‌మెంట్‌ సర్వీసెస్‌ వ్యవస్థాపకుడు అమోల్‌ జోషి చెప్పారు. చాలా మంది ఇన్వెస్టర్లకు లిక్విడ్‌ ఫండ్, లో డూరేషన్‌ ఫండ్‌ సరిపోతాయని ఆయన సూచించారు. ఎందుకంటే మారే వడ్డీ రేట్ల వాతావరణంలో వీటి రాబడులపై ప్రభావం తక్కువగా ఉంటుంది. డిఫాల్ట్‌ రిస్క్‌ చాలా చాలా తక్కువ.  

కొంత రిస్క్‌... ఇంకాస్త రాబడి
బాండ్‌ ఫండ్స్‌లో ఇతర కేటగిరీలోని ఫండ్స్‌లో వడ్డీ రేట్ల పరంగా రిస్క్‌ను అర్థం చేసుకోవడం కాస్త కష్టమే. అయితే, రిస్క్‌ ఉన్నా కాస్తంత అధిక రాబడులు ఆశించే వారికి నిపుణులు సూచించేవి క్రెడిట్‌ రిస్క్‌ ఫండ్స్‌ లేదా డైనమిక్‌ బాండ్‌ ఫండ్స్‌. లిక్విడ్, షార్ట్‌ డ్యురేషన్‌తో పాటు కాస్తంత పెట్టుబడులను వీటికి కేటాయించుకోవడం ద్వారా డెట్‌ ఫండ్స్‌ పోర్ట్‌ఫోలియోను పరిమితం చేసుకోవాలన్నది నిపుణుల సూచన. తక్కువ రేటింగ్‌ ఉన్న కార్పొరేట్‌ బాండ్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయడం ద్వారా అధిక రాబడులను అందించేవి క్రెడిట్‌ రిస్క్‌ ఫండ్స్‌. తక్కువ రేటింగ్‌ ఉన్న సాధనాల్లో పెడతాయి కనుక రిస్క్‌ ఎక్కువ.

అందుకే క్రెడిట్‌ రిస్క్‌ ఫండ్స్‌గా వీటిని పిలుస్తారు అయితే, దేశీ కార్పొరేట్‌ కంపెనీల పరిస్థితి మెరుగుపడుతూ ఉన్నందున తక్కువ రేటింగ్‌ ఉన్నవి కూడా మెరుగుపడే సూచనలున్నాయి. దీంతో రాబడులు అధికంగా వచ్చే అవకాశం ఉంటుంది. చాలా తక్కువ రేటింగ్‌ ఉన్న కంపెనీలు బాండ్ల చెల్లింపుల పరంగా డిఫాల్ట్‌ అయితే రాబడులపై ఆ ప్రభావం ఉంటుందని గుర్తుంచుకోవాలి. రిస్క్‌ తీసుకునే వారు డైనమిక్‌ బాండ్‌ ఫండ్‌ను కూడా పరిశీలించొచ్చు.

షార్ట్, లాంగ్‌ డ్యురేషన్‌ ఫండ్స్‌ మధ్య పెట్టుబడులను మారుస్తూ (దీన్నే డైనమిక్‌ అనేది) మారే వడ్డీ రేట్ల నుంచి అధిక రాబడులను అందుకునే ప్రయత్నం చేస్తుంటాయి. వడ్డీ రేట్ల గమనం గురించి అర్థం కాని వారు ఈ పథకాలను ఎంచుకోవచ్చు. మీడియం డ్యురేషన్, లాంగ్‌ డ్యురేషన్, కార్పొరేట్‌ బాండ్, బ్యాంకింగ్, పీఎస్‌యూ ఫండ్‌ తదితర కేటగిరీలు కూడా బాండ్‌ ఫండ్స్‌లో ఉన్నాయి. కానీ, ఇన్వెస్టర్ల పెట్టుబడులకు ఇవి ఏమంత విలువను చేకూర్చేవి కావన్నది నిపుణుల మాట.

చూడాల్సిన అంశాలు ఇవీ...
క్రెడిట్‌ రిస్క్‌
అన్ని డెట్‌ ఫండ్స్‌ కూడా ఫిక్స్‌డ్‌ ఇన్‌కమ్‌ లేదా మనీ మార్కెట్‌ ఇన్‌స్ట్రుమెంట్లు అయిన ప్రభుత్వ సెక్యూరిటీలు, బాండ్లు, ట్రెజరీ బిల్లులు, సర్టిఫికెట్‌ ఆఫ్‌ డిపాజిట్, కమర్షియల్‌ పేపర్లలో ఇన్వెస్ట్‌ చేసేవే. వీటిని బట్టి రిస్క్‌ ఆధారపడి ఉంటుంది. ప్రభుత్వ సెక్యూరిటీలు, ట్రెజరీ బిల్లులు అన్నవి రిస్క్‌ లేనివి. అదే కంపెనీ బాండ్‌ అయితే రిస్క్‌ తప్పకుండా ఉంటుంది. ఇన్వెస్టర్‌ తమ పోర్ట్‌ఫోలియోలో చేర్చుకునే పథకాలు ఎక్కడ ఇన్వెస్ట్‌ చేస్తాయన్న అవగాహన తప్పనిసరి. ప్రభుత్వ సెక్యూరిటీలు, ట్రెజరీ బిల్లులు మినహా మిగిలిన సాధనాలకు తక్కువ క్రెడిట్‌ రేటింగ్‌ ఉన్న వాటిలో ఇన్వెస్ట్‌ చేసినట్టయితే అధిక రిస్క్‌ ఉన్నట్టుగానే భావించాలి.

కాల వ్యవధి
డెట్‌ ఫండ్స్‌లో ఈక్విటీల్లానే ఎన్నో పథకాలు ఉన్నాయి. మీ పెట్టుబడుల కాల వ్యవధికి సరిపోయే పథకాలు కూడా ఉంటాయి. ఉదాహరణకు లిక్విడ్‌ ఫండ్స్‌ అన్నవి మూడు నెలల కాల వ్యవధి కోసం. లాంగ్‌ టర్మ్‌ బాండ్‌ ఫండ్స్‌ అన్నవి దీర్ఘకాలంలో ఒకటి లేదా రెండంకెల స్థాయిలో రాబడులు ఆశించేవారి కోసం.  

లిక్విడిటీ
డెట్‌ ఫండ్స్‌లో ఓపెన్‌ ఎండెడ్‌ ఫండ్స్‌ను మాత్రమే అవసరంపడితే లిక్విడ్‌ (నగదుగా)గా మార్చుకోవచ్చు. క్లోజ్‌ ఎండెడ్‌ ఫండ్స్‌ అన్నవి కూడా ఉన్నాయి. ఒక్కసారి ఇన్వెస్ట్‌ చేస్తే ఫండ్‌ కాల వ్యవధి ముగిసే వరకు వేచి ఉండాల్సి వస్తుంది. మధ్యంతరంగా డబ్బులు కావాల్సివ స్తే వీటిని అమ్మి సొమ్ము చేసుకోవడం కష్టం. అందుకే ఇన్వెస్ట్‌ చేసే వారు తమ అవసరాలను గుర్తెరిగి పథకాలను ఎంచుకోవాలి.

ఎగ్జిట్‌ లోడ్‌
చాలా వరకు డెట్‌ ఫండ్స్‌ ఎగ్జిట్‌ లోడ్‌ విధి స్తున్నాయి. అంటే పెట్టుబడులను వెనక్కి తీసుకునే సమయంలో విధించే చార్జీ. అయితే, ఇది కేవలం ప్రారంభంలో కొంత కాలం పాటే ఉంటుంది. అంటే నెలల నుంచి ఏడాది వరకు ఉండొచ్చు. ఆ లోపు వెనక్కి తీసుకుంటే ఆ మొత్తం నుంచి 1 శాతా న్ని మినహాయించుకుంటాయి ఫండ్స్‌ సంస్థలు.  

ఫండ్‌ మేనేజర్‌ పరంగా రిస్క్‌
ఫండ్‌ మేనేజర్లు సైతం కొన్ని సందర్భాల్లో మార్కెట్‌ గమనాలను అవగాహన చేసుకోలేకపోవచ్చు. దీంతో ఆ పథకం రాబడులు ప్రభా వితమవుతాయి.  

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top