ఎస్బీఐ ‘విలీనం’ షురూ..!

ఎస్బీఐ ‘విలీనం’ షురూ..!


అనుబంధ బ్యాంకులు, బీఎంబీ విలీనానికి తొలి అడుగు

వేల్యూయర్స్ కోసం ఎస్‌బీఐ క్యాప్స్ రంగంలోకి


 ముంబై: ఎస్‌బీఐలో ఐదు అనుబంధ బ్యాంకులు, భారతీయ మహిళా బ్యాంక్(బీఎంబీ) విలీనానికి తొలి అడుగు పడింది. ముందుగా స్టాక్ మార్కెట్లో లిస్టయి ఉన్న మూడు బ్యాంకులు, బీఎంబీ విలీనానికి సంబంధించి షేర్ల బదలాయింపు నిష్పత్తి(స్వాప్ రేషియో), విలువ మదింపు కోసం స్వతంత్ర వేల్యూయర్స్‌ను నియమించేందుకు ఎస్‌బీఐ కసరత్తు మొదలుపెట్టింది. చార్టర్డ్ అకౌంటెంట్(సీఏ) సంస్థల నుంచి వేల్యూయేషన్ ప్రతిపాదనలను ఆహ్వానిస్తున్నట్లు ఎస్‌బీఐ క్యాపిటల్ మార్కెట్స్ బహిరంగ ప్రకటన విడుదల చేసింది. అనుబంధ బ్యాంకుల్లో స్టేట్‌బ్యాంక్ ఆఫ్ మైసూర్, బికనీర్ అండ్ జైపూర్, ట్రావంకోర్‌లు మార్కెట్లో లిస్టయ్యాయి.


స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్, పాటియాలా మాత్రం లిస్టయి లేవు. వీటిని కూడా మిగతా అనుబంధ బ్యాంకులతో పాటే ఎస్‌బీఐ విలీనం చేసుకోనుంది. అయితే, అన్‌లిస్టెడ్ బ్యాంకుల నేపథ్యంలో వీటికి విడిగా విలువ మదింపును చేపట్టనుంది. వేల్యుయేషన్ కోసం సీఏ సంస్థలు అన్నిరకాల మార్కెట్ విధానాలను పరిగణనలోకి తీసుకోవాలని ఎస్‌బీఐ క్యాప్స్ ప్రకటనలో పేర్కొంది. ఎస్‌బీఐ, మూడు అనుబంధ బ్యాంకుల విలువను మదింపు చేయడంతోపాటు అనుబంధ బ్యాంకులు నియమించుకునే వేల్యూయర్‌తో కలిపి ఒక సంయుక్త నివేదికను సమర్పించాల్సి ఉంటుందని తెలిపింది. ప్రతి బ్యాంకుకూ వేర్వేరుగా నాలుగు రకాల స్వాప్ రేషియోలను ఇవ్వాలని కూడా వివరించింది. మరోపక్క, ఎస్‌బీబీజే, ఎస్‌బీఎం, ఎస్‌బీటీ, బీఎంబీ విలీనంపై నిష్పక్షపాత అభిప్రాయాల కోసం కూడా మర్చెంట్ బ్యాంకర్ల నుంచి ఎస్‌బీఐ క్యాప్స్ ప్రతిపాదనలను ఆహ్వానించింది.


 అనుబంధ బ్యాంకులు, బీఎంబీ విలీన ప్రతిపాదనకు గత నెలలోనే కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసిన సంగతి తెలిసిందే. విలీనం కార్యాచరణను రూపొందించేందుకు ఎస్‌బీఐ 15-20 మంది ఉన్నతాధికారులతో ఒక బృందాన్ని కూడా ఏర్పాటు చేసింది.


ఆ మూడేళ్ల వల్లే భారీ ఎన్‌పీఏలు: ఎస్‌బీఐ చీఫ్

న్యూయార్క్ : దేశీ బ్యాంకింగ్ రంగం ప్రస్తుతం ఎదుర్కొంటున్న తీవ్ర మొండిబకాయిల(ఎన్‌పీఏ) సమస్యకు ప్రధానంగా 2011-13 మధ్య వివిధ రంగాల్లో ప్రాజెక్టులు నిలిచిపోవడమే కారణమని ఎస్‌బీఐ చైర్‌పర్సన్ అరుంధతి భట్టాచార్య పేర్కొన్నారు. అయితే, ఆ అడ్డంకులను తొలగించి మళ్లీ ప్రాజెక్టులను పట్టాలెక్కించేందుకు ప్రయత్నిస్తున్నామని ఆమె చెప్పారు. ఈ దిశగా ఇప్పటికి కొంత పురోగతి సాధించామని, కానీ ఇంకా చేయాల్సింది చాలా ఉందని కూడా ఎస్‌బీఐ చీఫ్ పేర్కొన్నారు. మరింత మూలధనాన్ని సమకూర్చుకోవడం ద్వారా బ్యాంకింగ్ రంగాన్ని పటిష్టం చేయడంపై దృష్టిపెడుతున్నట్లు ఆమె వివరించారు.


ఎస్‌బీఐ, ఇండస్ ఎంట్రప్రెన్యూర్స్ ఆన్ ఇండియా భాగస్వామ్యంతో భారత కాన్సులేట్ ఇక్కడ నిర్వహించిన ఒక చర్చా కార్యక్రమంలో అరుంధతి ఈ అంశాలను ప్రస్తావించారు. ‘భారత్‌లో మారుతున్న ఆర్థిక ముఖచిత్రం-అవకాశాలు, సవాళ్లు’ అనే అంశంపై ఈ చర్చను నిర్వహించారు. కాగా, న్యూయార్క్ పర్యటనలో భాగంగా ఎస్‌బీఐ చీఫ్ పలువురు ఇన్వెస్టర్లతో పాటు రేటింగ్ ఏజెన్సీల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ‘భారత్‌లో స్థూల ఆర్థిక అంశాలన్నీ చాలా బాగున్నాయి. ద్రవ్యలోటు కట్టడిలో ఉంది. అదేవిధంగా రిటైల్ ద్రవ్యోల్బణం కూడా ఆర్‌బీఐ నిర్ధేశించిన లక్ష్యానికి అనుగుణంగానే(2017 కల్లా 5 శాతం) దిగొస్తోంది. ఈ లక్ష్యాన్ని కచ్చితంగా సాధించే అవకాశం ఉంది’ అని అరుంధతి వివరించారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top