మందగమన నష్టాలు | Nifty Second Day Running Loss | Sakshi
Sakshi News home page

మందగమన నష్టాలు

Aug 22 2019 9:04 AM | Updated on Aug 22 2019 9:04 AM

Nifty Second Day Running Loss - Sakshi

ఆర్థిక వ్యవస్థ మందగమన భయాలతో బుధవారం స్టాక్‌ మార్కెట్‌ నష్టాల్లో ముగిసింది. సెన్సెక్స్, నిఫ్టీలు వరుసగా రెండో రోజూ నష్టపోయాయి. ఇంట్రాడేలో 305 పాయింట్ల వరకూ నష్టపోయిన సెన్సెక్స్‌ చివరకు 268 పాయింట్లు పతనమై 37,060 పాయింట్ల వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 98 పాయింట్లు నష్టపోయి 10,919 పాయింట్ల వద్దకు చేరింది. ముడి చమురు ధరలు 1 శాతం మేర పెరగడం ప్రతికూల ప్రభావం చూపించింది. ఇక డాలర్‌తో రూపాయి మారకం విలువ 22 పైసలు పెరిగి 71.49కు పెరగడం ఎలాంటి సానుకూల ప్రభావం చూపించలేకపోయింది. కన్సూమర్‌ గూడ్స్, బ్యాంక్, లోహ, ఆర్థిక రంగ షేర్లు క్షీణించాయి. ఒక్క ఐటీ రంగ షేర్లు మాత్రమే లాభపడ్డాయి. 

384 పాయింట్ల రేంజ్‌లో సెన్సెక్స్‌
పలు కంపెనీలు అమ్మకాలు లేవని ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఉద్యోగాల్లో కోత విధిస్తున్నాయి. వృద్ది జోష్‌ను పెంచడానికి, వినియోగదారుల సెంటిమెంట్‌ను బలపరచడానికి ప్రభుత్వం చర్యలు ప్రకటించాలని మార్కెట్‌ వర్గాలు కోరుతున్నాయి. ప్యాకేజీ ఇస్తామని ప్రభుత్వం ఊరించిందే కానీ, ఇంతవరకూ ఎలాంటి నిర్దిష్టమైన ప్రకటన చేయకపోవడంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ దెబ్బతిన్నది. సెన్సెక్స్‌ లాభాల్లో ఆరంభమైనా, ఆ తర్వాత నష్టాల్లోకి జారిపోయింది. ఒక దశలో 79 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్‌ మరో దశలో 305 పాయింట్లు పతనమైంది. మొత్తం మీద రోజంతా   384 పాయింట్ల రేంజ్‌లో కదలాడింది. నికాయ్‌ మినహా మిగిలిన అన్ని ఆసియా మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. ప్యాకేజీ ఆశల కారణంగా యూరప్‌ మార్కెట్లు లాభాల్లో ఆరంభమై, లాభాల్లోనే ముగిశాయి. 

పదేళ్ల కనిష్టానికి టాటా మోటార్స్‌..
టాటా మోటార్స్‌ కంపెనీ షేరు ఇంట్రాడేలో 11 శాతం పతనమై పదేళ్ల కనిష్ట స్థాయి, రూ.109.55ను తాకింది. చివరకు 9.2 శాతం నష్టంతో రూ.112 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో అత్యధికంగా నష్టపోయిన షేర్‌ ఇదే. గత నాలుగు నెలల్లో  ఈ షేర్‌ 53 శాతం క్షీణించింది. మనకు మారుతీ సుజుకీ ఎలాగో చైనాకు జీలీ ఆటోమొబైల్‌ హోల్డింగ్స్‌ అలాగ. ఈ ఏడాది తొలి ఆరు నెలల కాలంలో తమ నికర లాభం 40 శాతం తగ్గిందని ఈ కంపెనీ ప్రకటించింది. రానున్న ఆరు నెలల్లో కూడా పెద్దగా పురోగతి ఉండదని పేర్కొంది. జీలీ కంపెనీ పరిస్థితే ఇలా ఉంటే టాటా మోటార్స్‌ పరిస్థితి ఇంకెలాగ ఉంటుందోనన్న ఆందోళనతో అమ్మకాలు వెల్లువెత్తాయి. మరోవైపు టాటా మోటార్స్‌ రేటింగ్‌ను రేటింగ్‌ సంస్థ, క్రిసిల్‌ తగ్గించడం కూడా ప్రతికూల ప్రభావం చూపించింది. ఈ షేర్‌తో పాటు ఓఎన్‌జీసీ, యస్‌బ్యాంక్, కోల్‌ ఇండియా, భెల్, టాటా పవర్, సెయిల్, రిలయన్స్‌ క్యాపిటల్, ఓకార్డ్, అలహాబాద్‌ బ్యాంక్‌ తదితర బీఎస్‌ఈ 500 సూచీలోని 31  షేర్లు కూడా ఐదేళ్ల కనిష్టానికి పడిపోయాయి. ఐటీసీ, టాటా స్టీల్‌ షేర్లు రెండేళ్ల కనిష్టానికి తగ్గాయి. దాదాపు 300కు పైగా షేర్లు ఏడాది కనిష్ట స్థాయిలకు పడిపోయాయి.   
యస్‌ బ్యాంక్‌ షేర్‌ 8.2 శాతం నష్టంతో రూ.65.40 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో 9.4 శాతం పతనమై ఐదేళ్ల కనిష్ట స్థాయి, రూ.64.50ను తాకింది. సెన్సెక్స్‌లో అత్యధికంగా నష్టపోయిన రెండో షేర్‌ ఇది. ఆర్థికంగా అవకతవకలు జరిగాయన్న వార్తలు వచ్చిన సీజీ పవర్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ సొల్యూషన్స్‌ కంపెనీలో ఈ బ్యాంక్‌కు 12.79  శాతం మేర వాటా ఉంది.  
మార్కెట్‌ బలహీనంగా ఉన్నప్పటికీ, నెస్లే ఇండియా, గ్లాక్సోస్మిత్‌లైన్‌ కన్సూమర్‌ హెల్త్‌కేర్, ట్రెంట్‌ షేర్లు జీవిత కాల గరిష్ట స్థాయిలకు     ఎగిశాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement