
న్యూఢిల్లీ: దేశ ఆర్థిక రంగం 2024 నాటికి రెట్టింపు అవుతుందని, 5 లక్షల కోట్ల డాలర్లకు (రూ.325 లక్షల కోట్లకు) చేరుతుందని రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ అంచనా వేశారు. 2030 నాటికి 10 లక్షల కోట్ల డాలర్ల (రూ.650 లక్షల కోట్లు) స్థాయికి చేరుకుని యావత్ ప్రపంచానికే ఆకర్షణీయ స్థానంగా కనిపిస్తుందన్నారు. 21వ శతాబ్దం మధ్య నాటికి మనదేశం చైనాను మించి వేగంగా వృద్ధి సాధిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. శుక్రవారమిక్కడ ‘హిందుస్తాన్‌టైమ్స్ నాయకత్వ సదస్సు’లో పాల్గొన్న సందర్భంగా ముకేశ్ అంబానీ మాట్లాడుతూ... 2004లోనే తాను దేశ ఆర్థిక వ్యవస్థ అప్పటి 500 బిలియన్ డాలర్ల స్థాయి (రూ.32.50 లక్షల కోట్లు) నుంచి 20 ఏళ్లలో 5 లక్షల కోట్ల డాలర్ల స్థాయికి ఎదుగుతుందని ఊహించినట్టు చెప్పారు.
ఈ శతాబ్దంలోనే ఆ ‘భాగ్యం’
ప్రస్తుతం మన దేశ జీడీపీ 2.5 లక్షల కోట్ల డాలర్లతో (రూ.162 లక్షల కోట్లు) ప్రపంచంలో ఆరో స్థానంలో ఉంది. ‘‘దీన్ని వచ్చే పదేళ్లలో మూడు రెట్లు పెంచుకుని 7 లక్షల కోట్ల డాలర్లతో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించడం సాధ్యమే. 2030 నాటికి 10 లక్షల కోట్ల డాలర్ల మార్కును చేరుకుని, చైనా, అమెరికాలతో ఉన్న అంతరాన్ని పూడ్చుకోగలం’’అని ముకేశ్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ శతాబ్దంలోనే భారత దేశం అమెరికా, చైనాలకు మించి సంపన్నవంతం అవుతుందన్నారు.
నాలుగో పారిశ్రామిక విప్లవం మనదే!
‘ప్రపంచ ఆర్థిక నేతగా ఎదగనున్న భారత్’ అనే అంశంపై అంబానీ మాట్లాడుతూ... మొదటి రెండు పారిశ్రామిక విప్లవాలకు దగ్గర దగ్గరగా ఉన్న భారత్... కంప్యూటర్ ఆధారిత మూడో పారిశ్రామిక విప్లవం నుంచి అవకాశాలను అందిపుచ్చుకుందన్నారు. ‘‘నాలుగో పారిశ్రామిక విప్లవం మన ముందుంది. ఇది కనెక్టివిటీ, కంప్యూటింగ్, డేటా, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ పునాదులపై ఉంది. భారత్ నాలుగో పారిశ్రామిక విప్లవంలో కేవలం పాల్గొనడమే కాకుండా నాయకత్వ స్థాయికి చేరుకునే అవకాశం ఉంది’’ అని చెప్పారు. చైనాకు తయా రీ ఏ విధంగానో, భారత్‌కు అద్భుత మేథాశక్తి అటువంటిదన్నారు.
మరిన్ని పెట్టుబడులు...
ఐదేళ్ల క్రితం చాలా భారత వ్యాపార సంస్థలు దేశం వెలుపల పెట్టుబడులు పెడుతుంటే రిలయన్స్ దేశీయంగానే 3.9 లక్షల కోట్లను ఇన్వెస్ట్ చేసిందన్న అంబానీ... మలివిడతలో మరిన్ని పెట్టుబడులకు సిద్ధమని చెప్పారు.
జియోతో వినియోగదారుడికి లబ్ధి
టెలికం రంగంలో నష్టాలకు జియోనే కారణమన్న ఎయిర్‌టెల్ అధినేత సునీల్ మిట్టల్ వ్యాఖ్యలపై అంబానీ పరోక్షంగా స్పందించారు. తమ కచ్చితమైన లాభాల కోసం కంపెనీలు నియంత్రణ సంస్థలు, ప్రభుత్వాల వైపు చూడరాదంటూ చురకలంటించారు. లాభ, నష్టాలనేవి వ్యాపారంలో ఉండే సవాళ్లుగా పేర్కొంటూ... జియో రాకతో దేశం, వినియోగదారులు లాభపడ్డారా? లేదా? అన్నది చూడాల్సిన ముఖ్యమైన అంశంగా పేర్కొన్నారు. అతి పెద్ద వ్యాపార సంస్థలుగా ఆ మాత్రం నష్టాలను భరించగలమన్నారు. జియో వచ్చిన తర్వాతే భారత్ ప్రపంచంలో నంబర్ వన్ మొబైల్ బ్రాడ్‌బ్యాండ్ మార్కెట్‌గా అవతరించిందని ముకేశ్ గుర్తు చేశారు.