పవన, సౌర విద్యుత్‌ ప్లాంట్లతో రైతులకు లబ్ధి

YS Jaganmohan Reddy Comments In Review Meeting With Electricity Authorities - Sakshi

తక్షణమే విద్యుత్‌ ఎగుమతి విధానం రూపొందించాలి

విద్యుత్‌ అధికారులతో సమీక్షలో సీఎం వైఎస్‌ జగన్‌

కొత్త ప్లాంట్లతో యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు

ఉత్పత్తిదారులనూ ప్రోత్సహించాలి

మెగా సోలార్‌ ప్లాంట్‌ విధివిధానాలపై సీఎం ఆరా

సాక్షి, అమరావతి: పవన, సౌర విద్యుత్‌ ప్లాంట్ల ద్వారా రైతులు అత్యంత ప్రయోజనం పొందేలా ‘విద్యుత్‌ ఎగుమతి విధానం’ (ఎనర్జీ ఎక్స్‌పోర్ట్‌ పాలసీ) రూపొందించాలని విద్యుత్‌ ఉన్నతాధికారులను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. విద్యుత్‌ ఉత్పత్తి ప్లాంట్లు పెట్టే వారిని ప్రోత్సహించే విధంగా పాలసీ ఉండాలని సూచించారు. బుధవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో విద్యుత్‌ ఉన్నతాధికారులతో సమీక్షించారు. రాష్ట్రంలో పవన, సౌర విద్యుత్‌ ప్లాంట్లు పెట్టేందుకు పలువురు ఆసక్తి చూపుతున్న తీరును అధికారులు సీఎంకు వివరించారు. ఇక్కడ ప్లాంట్లు పెట్టి, వేరే చోట అమ్ముకోవడానికి వారు సంసిద్ధత వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. ఈ క్రమంలో రైతుల భూముల్లో పవన, సౌర విద్యుత్‌ ప్లాంట్లు ఏర్పాటు చేయడం వల్ల వారికి లాభదాయకంగా లీజు సొమ్ము లభించే వీలుందని, ప్రభుత్వ భూములు లీజుకిచ్చినప్పుడు ప్రభుత్వానికీ ఆదాయం సమకూరే అవకాశం ఉందని ముఖ్యమంత్రి అభిప్రాయపడినట్టు అధికారులు తెలిపారు.

ఉత్పత్తి అయ్యే విద్యుత్‌ను రాష్ట్ర నెట్‌వర్క్‌ ద్వారా ఇతర ప్రాంతాలకు పంపుతారని, ఫలితంగా విద్యుత్‌ సంస్థలకూ వీలింగ్‌ చార్జీల ద్వారా ఆదాయం వస్తుందనే విషయమై చర్చించారు. విండ్, సోలార్‌ ప్లాంట్లు అటు రైతులకు, ఇటు విద్యుత్‌ సంస్థలకు లాభదాయకంగా ఉండేలా చూడాలని సీఎం ఆదేశించారు. కొత్త ప్లాంట్లు రావడం వల్ల రాష్ట్రంలో యువతకు మరికొన్ని ఉద్యోగాలు వస్తాయని, దీన్ని దృష్టిలో ఉంచుకుని ఉత్పత్తిదారులకు సానుకూల వాతావరణం కల్పించాలని సీఎం సూచించారు. భూములు లీజుకిచ్చినా ప్రభుత్వం, రైతులకే హక్కులుంటాయని సీఎం అధికారులతో అన్నారు. 

త్వరితగతిన మెగా సోలార్‌ 
ఉచిత విద్యుత్‌ కోసం ప్రభుత్వం ప్రతిపాదించిన 10 వేల మెగావాట్ల సోలార్‌ విద్యుత్‌ ప్లాంట్‌ ఏర్పాటును వీలైనంత త్వరగా పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. ఇందుకు సంబంధించి టెండర్లు పిలిచేందుకు వీలుగా అవసరమైన విధివిధానాలపై అధికారులతో చర్చించారు. నిర్మించడం, నిర్వహించడం, బదిలీ చేయడం (బీవోటీ) పద్ధతిలో ప్లాంట్‌ నిర్మాణం చేపట్టే అంశం కూడా చర్చకొచ్చింది. ఈ ప్రాజెక్టు పూర్తయితే భవిష్యత్‌లో ఉచిత విద్యుత్‌కు ఎలాంటి ఢోకా ఉండదని, ప్రభుత్వంపై సబ్సిడీ భారం కూడా తగ్గుతుందనే అభిప్రాయం చర్చలో వ్యక్తమైంది.

రాష్ట్రంలో మరో వెయ్యి మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తికి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎన్టీపీసీ ముందుకొచ్చిందని అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై ఆయన సానుకూలంగా స్పందిస్తూ.. ఎన్టీపీసీకి అవసరమైన భూమి ఇచ్చేందుకు ప్రయత్నించాలని సూచించారు. వ్యవసాయానికి పగటి పూట 9 గంటల విద్యుత్‌ అందించేందుకు వీలుగా ఫీడర్ల ఆటోమేషన్‌ ఏర్పాటు చేయాలని, వచ్చే రెండేళ్లలో ఈ ప్రక్రియ పూర్తవ్వాలని ఆయన ఆదేశించారు. సమీక్షలో ఇంధన శాఖ కార్యదర్శి శ్రీకాంత్‌ నాగులపల్లి, గ్రీన్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ సీఎండీ సాయిప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top