రిషితేశ్వరి కేసుపై అర్బన్ ఎస్పీ సీరియస్

రిషితేశ్వరి కేసుపై అర్బన్ ఎస్పీ సీరియస్


- పెదకాకాని పోలీస్  స్టేషన్లో అధికారులతో సుదీర్ఘ సమీక్ష

- వర్సిటీ పునఃప్రారంభ నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై చర్చ

- నాన్‌బోర్డర్స్ ఎవరినీ హాస్టళ్లలోకి అనుమతించ వద్దని ఆదేశాలు

- కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని నిర్ణయం

- బీఆర్క్ కళాశాల మాజీ ప్రిన్సిపాల్ పాత్రపై ప్రత్యేక ఆరా

- నేడు వర్సిటీని సందర్శించనున్న వైఎస్సార్ సీపీ నేతలు

సాక్షి, గుంటూరు:
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కలిగించిన ఆర్కిటెక్చర్ విద్యార్థిని రిషితేశ్వరి మృతి కేసు దర్యాప్తు తీరు, సెలవుల అనంతరం విద్యార్థులు యూనివర్సిటీకి రానున్న నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై అర్బన్ జిల్లా ఎస్పీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి సీరియస్‌గా దృష్టి సారించారు. వీటన్నిటిపై ఆదివారం పెదకాకాని పోలీస్‌స్టేషన్‌లో పోలీసు అధికారులతో ఆయన  నాలుగు గంటల పాటు సమీక్ష నిర్వహించారు. ఛార్జిషీట్ దాఖలు, ఎంత మందిని విచారించారు  వంటి అంశాలపై దర్యాప్తు అధికారులతో చర్చించినట్లు తెలిసింది.ఈ కేసులో ఇంకా ఎవరి ప్రమేయమైనా ఉందా? అనే దానిపై ఎస్పీ ఆరా తీసినట్టు సమాచారం. విద్యార్థిని రిషితేశ్వరి మృతి అనంతరం వర్సిటీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయనే కారణంతో పది రోజుల పాటు ఇచ్చిన సెలవులు మూడో తేదీతో ముగియనుండటం, నాలుగో తేదీ నుంచి విద్యార్థులు రానున్నారు. దీంతో  ముందుగా తీసుకున్న నిర్ణయం మేరకు నాన్‌బోర్డర్స్ ఎవరినీ హాస్టళ్లలోకి అనుమతించవద్దని యూనివర్సిటీ అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని సూచించారు. యూనివర్సిటీలో సీసీ కెమేరాలు, యాంటీ ర్యా గింగ్ బోర్డులు, బయోమెట్రిక్ విధానం ఏర్పాటుతోపాటు గుర్తింపు కార్డుల జారీ ఎంతవరకు వచ్చిందనే విషయంపై యూనివర్సిటీ అధికారుల నుంచి సమాచారం సేకరించా లని చెప్పారు. ఒక వేళ పనుల్లో జాప్యం జరుగుతుంటే ఎవరివల్ల జరుగుతుందో తెలుసుకుని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాలని ఎస్పీ చెప్పినట్లు తెలిసింది.ఒక వేళ విద్యార్థులు ఆందోళనలు చేపడితే కళాశాలల్లో మిగిలిన విద్యార్థులకు  ఇబ్బందులు కలగకుండా తీసుకోవాల్సిన చర్యలపై ఎస్పీ ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. యూనివర్సిటీ పరిస్థితులపై పూర్తిగా దృష్టి సారించి ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటూ ఎలాంటి గొడవలకు అవకాశం ఇవ్వకుండా కట్టుదిట్టమైన  భద్రతా చర్యలు చేపట్టాలని పోలీసు అధికారులను ఆదేశించినట్లు తెలిసింది. అదే విధంగా వైఎస్సార్ సీపీ నాయకులు సోమవారం యూనివర్సిటీని సందర్శించనున్న నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఎస్పీ పలు సూచనలు చేసినట్లు సమా చారం. త్వరలో ప్రభుత్వ అధికారుల నివాసాలను యూనివర్సిటీ ఎదుట ఉన్న ఐజేఎం రెయిన్‌ట్రీ పార్కులోని అపార్ట్‌మెంట్లలో ఏర్పాటు చేయాలని నిర్ణయించటంతో అక్కడ భద్రతా చర్యలపై చర్చించినట్లు తెలిసింది.ప్రిన్సిపాల్ పాత్రపై పోలీసుల దృష్టి?

రిషితేశ్వరి మృతి కేసులో మొదటి నుంచి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆర్కిటెక్చర్ కళాశాల మాజీ ప్రిన్సిపాల్ బాబురావు పాత్రపై పోలీసు అధికారులు ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ కమిటీ విచారణలో కూడా రిషితేశ్వరి తల్లిదండ్రుల తోపాటు విద్యార్థి సంఘాలు యూనివర్సిటీ సిబ్బంది, ప్రజాసంఘాలు ప్రిన్సిపాల్‌పై పలు ఫిర్యాదులు చేసిన విషయం తెలిసిందే. అంతేకాకుండా ప్రిన్సిపాల్ వ్యవహార శైలిపై పలు ఆరోపణలు రావటం, యూనివర్సిటీలో జరిగిన గొడవకు విద్యార్థులను రెచ్చగొట్టింది ప్రిన్సిపాలేననే విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో పోలీసు అధికారులు సైతం ఆయన పాత్రపై దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. గతంలో ప్రిన్సిపాల్ వ్యవహార శైలి, విద్యార్థులను అతను ఏమైనా వేధింపులకు గురిచేశాడా? అనే కోణంలో కూడా ఆరా తీస్తున్నట్టు తెలుస్తోంది.  ఆయన పాత్ర ఉన్నట్లు తేల్చే ఆధారాలు లభ్యమై తే అరెస్టు చేయాలని కూడా పోలీసులు భావిస్తున్నట్లు సమాచారం.

 

ఈ సమావేశంలో అడిషనల్ ఎస్పీ జె. భాస్కరరావు, మంగళగిరి డీఎస్పీ జి. రామకృష్ణ, ఎస్‌బి డీఎస్పీ సీతారామాంజనేయులు, మహిళా పోలీసుస్టేషన్ డీఎస్పీ కమలాకరరావు, గుంటూరు తూర్పు డిఎస్పీ సంతోష్, పెదకాకాని సీఐ కె. శేషారావు, మంగళగిరి సీఐ కొంకా శ్రీనివాసరావు, ఎస్‌ఐ పి. కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top