మనోడే.. కేసు ఎత్తేద్దాం | The government withdrew the case against MLA | Sakshi
Sakshi News home page

మనోడే.. కేసు ఎత్తేద్దాం

May 11 2017 2:35 PM | Updated on Sep 5 2017 10:51 AM

మనోడే.. కేసు ఎత్తేద్దాం

మనోడే.. కేసు ఎత్తేద్దాం

ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలను తమ పార్టీలోకి లాక్కునేందుకే చంద్రబాబు సర్కారు వారిపై కేసులు పెట్టి వేధింపులకు గురి చేస్తుందా...?

► గిద్దలూరు ఎమ్మెల్యేపై కేసు ఉపసంహరించుకున్న ప్రభుత్వం
► పార్టీ ఫిరాయించినందుకు నజరానా
► ఈ మేరకు మంగళవారం జీఓ జారీ

సాక్షి ప్రతినిధి, ఒంగోలు:  ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలను తమ పార్టీలోకి లాక్కునేందుకే చంద్రబాబు సర్కారు వారిపై కేసులు పెట్టి వేధింపులకు గురి చేస్తుందా...? ఎమ్మెల్యేలు అధికార పార్టీలో చేరిన మరుక్షణమే చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని వారిపై పెట్టిన కేసులను తొలగిస్తుందా....? ప్రభుత్వ చర్యలు చూస్తుంటే ఇదే నిజమనిíపిస్తుంది. పరిశీలకులు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి విషయంలో చంద్రబాబు సర్కారు ఇదే వైఖరిని అవలంబించినట్లు తెలుస్తోంది.

వైఎస్సార్‌సీపీ శాసనసభ్యునిగా గెలుపొందిన గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డితో పాటు మరో 20 మందిపై 2014 జూన్‌ 30న గిద్దలూరు పోలీస్‌స్టేషన్‌లో నమోదైన క్రైం నెం.152 కేసును ఉపసంహరించుకుంటూ చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు జీవో ఆర్‌.టి.నెం.379ను ప్రిన్సిపల్‌ సెక్రటరీ ఎ.ఆర్‌.అనురాధ మంగళవారం విడుదల చేశారు.

ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను రాష్ట్ర డీజీపీ, ప్రకాశం జిల్లా ఎస్పీ, గిద్దలూరు ఏపీపీలకు పంపింది. కుట్రపూరితంగా, గుమిగూడి, ప్రభుత్వ ఆస్తులను,  తగలబెట్టడం కారణాలు చూపి ఎమ్మెల్యే అశోక్‌రెడ్డితో మరో 20 మందిపై గిద్దలూరు పోలీసులు 120(బి), 143, 341, 435, 149 సెక్షన్లతో కేసు నమోదు చేశారు. అనంతరం నిందితులను అరెస్ట్‌ చేసి కోర్టులో హాజరుపరిచారు. ప్రస్తుతం కేసు కోర్టు పరిధిలో ఉంది. అయితే ప్రభుత్వం ఈ కేసును ఉపసంహరించుకుంటూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.

అసలేం జరిగింది....
గిద్దలూరు పట్టణంలోని డీఆర్‌ఆర్‌ ప్లాజాలో నివాసం ఉంటున్న డాక్టర్‌ హరనాధరెడ్డికి, అక్కడే నివాసం ఉంటున్న హోండా షోరూం నిర్వాహకుడు తోట సుబ్బారావుకు 2014 జూన్‌ 30న  గొడవ జరిగింది. ఇద్దరూ గిద్దలూరు పోలీసులకు పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నారు. ఎస్సై వై.శ్రీనివాసరావు హరనాధరెడ్డి సతీమణిపై దురుసుగా ప్రవర్తించాడు. ఈ విషయంపై వైఎస్సార్‌సీపీ నాయకుడు వైజా భాస్కరరెడ్డి స్టేషన్‌కు వెళ్లి ఎస్సై శ్రీనివాసరావుతో గొడవకు దిగాడు.

మహిళల పట్ల నీ ప్రవర్తన సరిగా లేదంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డాడు. దీంతో ఇరువురికీ మాటామాట పెరిగింది. దీంతో ఎస్సై శ్రీనివాసరావు వైజా భాస్కర్‌రెడ్డిపై చేయి చేసుకోవడంతో ఆయన కిందపడిపోయాడు. పరిస్థితి విషమంగా మారడంతో భాస్కరరెడ్డిని స్థానిక వైద్యశాలకు తరలించేలోపే ఆయన మృతి చెందాడు. సమాచారం అందుకున్న స్థానిక వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని అనుచరులతో కలిసి పోలీసుస్టేషన్‌ ముందు ధర్నా నిర్వహించారు.

భాస్కర్‌రెడ్డి మృతికి కారణమైన ఎస్సైపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ ఆందోళనకు దిగాడు. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అర్ధరాత్రి తర్వాత ఎమ్మెల్యే అనుచరులు రాచర్ల పోలీస్‌ స్టేషన్‌కు చెందిన వాహనాన్ని తగులబెట్టారు. అదే సమయంలో గొడవకు కారణమైన శ్రీనివాసరావుకు చెందిన హోండా షోరూంపై సైతం పెట్రోలు పోసి అశోక్‌రెడ్డి అనుచరులు నిప్పంటించారు. మరుసటి రోజు పెద్ద ఎత్తున ఆందోళనలు కొనసాగాయి. గిద్దలూరులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

వీటికి సంబంధించి పోలీసులు ఎమ్మెల్యే అశోక్‌రెడ్డితో పాటు మరో 20 మందిపై కేసులు నమోదు చేశారు. చాలా రోజుల పాటు దీనికి సంబంధించిన గొడవలు కొనసాగాయి. నాడు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేగా ఉన్న ముత్తుముల అశోక్‌రెడ్డిపై కేసులు నమోదు చేసి వేధింపులకు గురి చేయడమే గాక కోర్టుకు తిప్పిన చంద్రబాబు సర్కారు ఇప్పుడు ఎమ్మెల్యే అధికార పార్టీలో చేరడంతో ఆ కేసులను ఉపసంహరించుకుంటూ జీవో జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది. అధికారమా... మజాకా... అంటూ జనం ముక్కున వేలేసుకుంటున్నారు.    

పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి
వైఎస్సార్‌సీపీ నుండి గిద్దలూరు ఎమ్మెల్యేగా ఎన్నికైన అశోక్‌రెడ్డి అధికార పార్టీ ప్రలోభాలకు తలొగ్గి స్వప్రయోజనాల కోసం పార్టీ ఫిరాయించారు. 2016 జూన్‌ 1న ఆయన ముఖ్యమంత్రి సమక్షంలో టీడీపీ కండువా కప్పుకున్నారు. సొంత నియోజకవర్గంలో ఎంపీటీసీగా ఓడిపోయిన అశోక్‌రెడ్డిని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబెట్టి గెలిపించింది.        అశోక్‌రెడ్డి గెలుపు కోసం రేయింబవళ్లు పని చేసిన పార్టీ శ్రేణులను వంచించి ఆయన అధికార పార్టీలో చేరడంపై అప్పట్లో విమర్శలు వెల్లువెత్తాయి.

ఎమ్మెల్యే అశోక్‌రెడ్డిపై కేసులు ఎత్తేస్తూ విడుదలైన జీవో

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement