అరాచకం..! | Police blocking group at the University of YSR CP | Sakshi
Sakshi News home page

అరాచకం..!

Aug 4 2015 4:14 AM | Updated on May 25 2018 9:20 PM

అరాచకం..! - Sakshi

అరాచకం..!

ఆర్కిటెక్చర్ విద్యార్థిని రిషితేశ్వరి మృతి ఘటనపై జరుగుతున్న ఉద్దేశపూర్వకమైన నిర్లక్ష్యాన్ని...

- వర్సిటీ వద్ద వైఎస్సార్ సీపీ బృందాన్ని అడ్డుకున్న  పోలీసులు
- లోపలకు అనుమతి లేదంటూ ప్రధాన ద్వారం వద్ద నిలిపివేత
- అధికారుల తీరుపై మండిపాటు...అక్కడే ధర్నాకు దిగిన నేతలు
- లోపాలను కప్పిపుచ్చుకొనేందుకే నిరాకరిస్తున్నారని ధ్వజం
- గవర్నర్‌కు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించిన బృందం సభ్యులు
ఏఎన్‌యూ:
ఆర్కిటెక్చర్ విద్యార్థిని రిషితేశ్వరి మృతి ఘటనపై జరుగుతున్న ఉద్దేశపూర్వకమైన నిర్లక్ష్యాన్ని, తప్పులను ప్రశ్నించటానికి వస్తే యూనివర్సిటీ గేటు బయటే అడ్డుకుంటారా అంటూ వైఎస్సార్ సీపీ నాయకులు మండిపడ్డారు. ఈ ఘట నపై వైఎస్సార్ సీపీ నియమించిన నిజనిర్ధారణ కమిటీ సభ్యులు కె పార్ధసారథి, వంగవీటి రాధా, లేళ్ల అప్పిరెడ్డి, మేరుగ నాగార్జున, గుంటూరు తూర్పు ఎమ్మెల్యే షేక్ మహ్మద్ ముస్తఫాలు ఇన్‌చార్జి వీసీని కలిసేందుకు సోమవారం యూనివర్సిటీకి వచ్చారు. లోపలకు వెళ్లటానికి అనుమతి లేదని, వర్సిటీ ఉన్నతాధికారులు చెబితేనే అనుమతిస్తామని పోలీసులు, వర్సిటీ ఇంజినీరింగ్ సిబ్బంది వైఎస్సార్ సీపీ బృందాన్ని ప్రధాన ద్వారం వద్ద నిలిపివేశారు.  

ఇన్‌చార్జి వీసీని కలిసేందుకు ఒక రోజు ముందుగానే అనుమతి తీసుకున్నామని వైఎస్సార్ సీపీ బృందం వీరికి తెలిపింది. విషయాన్ని రిజిస్ట్రార్‌కు తెలిపి వారు పంపమంటే పంపుతామని పోలీసులు స్పష్టం చేశారు. ఎంతకూ లోపలకు అనుమతించకపోవటంతో వర్సిటీ ప్రధాన ద్వారం వద్ద నాయకులు బైఠాయించి ధర్నా చేశారు. యూనివర్సిటీ, ప్రభుత్వ అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ నాయకులు మాట్లాడుతూ పోలీసులు, వర్సిటీ ఉన్నతాధికారులు వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే యూనివర్సిటీలో ఉన్న లోపాలను కప్పిపుచ్చుతున్నారని తేటతెల్లమవుతుందన్నారు.

ఒకప్పుడు యూనివర్సిటీలోకి పోలీసులు రావాలంటే అధికారుల అనుమతి అవసరమని నేడు యూనివర్సిటీలోకి సామాన్యులు వెళ్లటానికి పోలీసుల అనుమతి కావాల్సి రావటం దురదృష్టకరమన్నారు.వర్సిటీలో కుల, మతతత్వం వేళ్లూనుకుందని, భారీగా నిధుల దుర్వినియోగం, అవకతవకలు జరు గుతున్నాయని ఆరోపించారు. ఉన్నతాధికారులను కలిసే వరకు వెనక్కు వెళ్లేది లేదని స్పష్టం చేశారు. దీంతో కాలినడకన వెళ్లి ఉన్నతాధికారులను కలిసేందుకు అనుమతి ఇచ్చారు. అనంతరం ఇన్‌చార్జి వీసీ ఆచార్య కేఆర్‌ఎస్ సాంబశివరావు, రిజిస్ట్రార్ ఆచార్య పి రాజశేఖర్‌లను కలసిన బృందం యూనివర్సిటీలో పోలీసు బలగాలను మొహరించాలని, రాకపోకల్లో ఆంక్షలు విధించాలని, విద్యార్థులకు సెలవులు ఇవ్వాలని ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల కాపీలను చూపించాలని డిమాండ్ చేశారు.

దీనికి రిజిస్ట్రార్ స్పందిస్తూ ఆ ఆదేశాలను ప్రభుత్వం తరువాత లిఖిత పూర్వకంగా పంపుతామని చెప్పిందన్నారు. యూనివర్సిటీలో ర్యాగింగ్ ఉందని హాస్టల్ వార్డెన్ బహిరంగంగా చెప్పారని, ప్రిన్సిపాల్ బాబురావు మాత్రం అలాంటిదేమీలేదంటున్నారని వైఎస్సార్ సీపీ బృందం పేర్కొంది.  వీటిపై యూనివర్సిటీ స్పందించకపోతే గవర్నర్, కేంద్ర ప్రభుత్వ పెద్దలను కలుస్తామని విలేకరులు అడిగిన ప్రశ్నకు పార్థసారధి బదులిచ్చారు. వర్సిటీకి వెళ్లిన వారిలో వైఎస్సార్‌సీపీ నేతలు పార్ధసారథి, మేరుగ నాగార్జున, లేళ్ల అప్పిరెడ్డి, వంగవీటి రాధా, ఎమ్మెల్యే ముస్తఫా, విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు పాను గంటి చైతన్య, యువజన విభాగం నగర అధ్యక్షులు ఎలికా శ్రీకాంత్, నాయకులు మే రువ నర్సిరెడ్డి, కోటా పిచ్చిరెడ్డి, గులాంరసూల్, షేక్ జానీ తదితరులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement