స్వామి భూములు స్వాహా | Sakshi
Sakshi News home page

స్వామి భూములు స్వాహా

Published Mon, Sep 30 2019 9:22 AM

Markapuram Temple Lands Irregularities In Prakasam - Sakshi

సాక్షి, ఒంగోలు :  ప్రతిష్టాత్మక ఆలయాలకు జిల్లా పెట్టింది పేరు. చారిత్రత  విశేషాలకు, మహిమలకు నిలయమైన భైరవ కోన, త్రిపురాంతకంలోని త్రిపురాంతకేశ్వర ఆలయాలు, సింగరకొండ ప్రసన్నాంజనేయస్వామి ఆలయం నుంచి మాలకొండ, మిట్టపాలెం, మార్కాపురం చెన్నకేశవుడు.. ఇలా అనేక మహిమాన్విత దేవాలయాలు ప్రకాశం జిల్లాలో కొలువై ఉన్నాయి.  దాదాపు 150కి పైగా ఆలయాలు దేవదాయ శాఖ పరిధిలో ఉన్నాయి.  ప్రతి ఆలయానికి ఎంతో కొంత భూమిని ఆలయ ఉద్ధరణ కోసం, పూజాదికాల నిర్వహణ కోసం పెద్దలు బహూకరించారు.  నిత్య ధూప దీప నైవేద్యాల కోసం ఈ భూమిని కేటాయించారు. ఇలా జిల్లాలో అన్ని ఆలయాలకు దాదాపు 30 వేల ఎకరాలకు పైచిలుకు భూమి ఉంది. ఈ భూమిని వేలం పాటల ద్వారా కౌలుకు ఇస్తూ..దాని మీద వచ్చే ఆదాయంతో పలు ఆలయాల్లో ధూప దీప నైవేద్యాలకు వినియోగిస్తున్నారు. అయితే, ఈ భూముల కేటాయింపు వ్యవహారం, వేలం, కౌలు వసూలు తదితరాల విషయంలో పారదర్శకత కొరవడుతోంది. ఇదిలావుంటే ప్రభుత్వం మంజూరు చేస్తున్న నిధులతోనే అనేక దేవాలయాల్లో పూజాదికాలు నిర్వహిస్తున్నారు. కానీ, ఎప్పటికప్పుడు సంబంధిత దేవదాయ శాఖాధికారులు ఆలయాలకు ఉన్న భూమి వివరాల విషయంలో పారదర్శకత పాటించడం లేదు. దీంతో అనేక చోట్ల దేవదాయ భూమి ఇతర ఆక్రమణదారుల ఆధీనంలోకి వెళుతోంది. 

20 వేల ఎకరాల పైనే..
దేవదాయ శాఖ పరిధిలో భూ రికార్డుల నిర్వహణ పదేళ్లుగా మందగించింది. జిల్లాలో రెగ్యులర్‌ అసిస్టెంట్‌ కమిషనర్ల నియామకం జరగకపోవం, ఎఫ్‌ఏసీలు జిల్లాలో ఒకటి రెండు రోజులు మాత్రమే ఉండటం. దేవదాయ శాఖ మీద ఒకరిద్దరి ఆ«ధిపత్యమే కొనసాగటం దరిమిలా దేవదాయ భూముల లెక్కల నిర్ధారణ మీద ప్రత్యేకంగా చర్యలు చేపట్టలేదు. దీంతో ఏళ్ల తరబడి ఒకే వ్యక్తుల చేతుల్లో దేవదాయ శాఖ భూమి నిలిచి ఉండటంతో అనేకచోట్ల కొందరు అక్రమార్కులు దేవదాయ భూమిపై కన్నేశారు. దరిమిలా జిల్లాలో 20 వేల ఎకరాలపైనే దేవదాయ శాఖ భూమి ఆక్రమణదారుల చెరలో ఉన్నట్టు తెలుస్తోంది. 

ఆన్‌లైన్‌కు నోచుకోని వైనం: 
దేవదాయ శాఖకు చెందిన భూములు ఆన్‌లైన్‌ చేసే వ్యవహారంలో జిల్లాకు వస్తున్న అధికారులు ఆసక్తి చూపటం లేదు. దీంతో పలుచోట్ల ఆలయ అభివృద్ధి కమిటీల చేతుల్లో భూములు బందీ అయిపోయాయి. దీంతో ఆలయాలకు రావాల్సిన ఆదాయానికి భారీ ఎత్తున గండి పడుతోంది. మండలం వారీగా దేవదాయ శాఖ పరిధిలోని ఆలయాలు, ఆలయాల వారీగా ఉన్న భూమి, ఏయే ఆలయాల ఆధీనంలోని భూమి ఆన్‌లైన్‌ చేశారు అనే విషయం మీద దేవదాయ శాఖ అధికారుల వద్ద సరైప సమాచారం లేదు. అదేవిధంగా ఏయే ఆలయాలకు చెందిన ఎంతెంత భూమి సాగులో ఉంది, సాగుకు గాను చెల్లిస్తున్న కౌలు తదితరాల మీద కూడా రికార్డుల నిర్వహణ లోపభూయిష్టంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక కొన్నిచోట్ల దేవదాయ శాఖ భూములు ఆన్‌లైన్‌ చేసేందుకు రెవెన్యూ అధికారులు కూడా ముందుకు రావటం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 

రైతు భరోసాతో కదులుతున్న తీగ: 
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కౌలు రైతుల సంక్షేమం కోసం ‘రైతు భరోసా’ పథకాన్ని ప్రవేశపెట్టింది. తద్వారా కౌలు రైతులకు ఆర్ధిక సాయం అందించేందుకు చర్యలు చేపడుతుండగా, జిల్లాలో ఏయే భూములు, ఎవరెవరి భూములు ఎంతెంత కౌలులో ఉన్నాయనే విషయం మీద అధికారుల వద్ద సరైన సమాచారం లేకపోవటంతో ఈ వ్యవహారం వెలుగులోకి వస్తోంది. ఈ క్రమంలో తక్షణం దేవదాయ శాఖ ఆధీనంలోని భూమి వివరాలు, ఏయే ఆలయాల భూమి ఎవరెవరి వద్ద కౌలులో ఉందనే వివరాలను ప్రకటించాలని పలు ఆలయాల ధర్మకర్తలు కోరుతున్నారు. 

Advertisement
Advertisement