వేధిస్తే.. ‘లా’గి కొట్టడమే..!

Many Laws For The Protection Of Women - Sakshi

మహిళల రక్షణకు అనేక చట్టాలు 

అక్షరాస్యతతోనే గృహహింసకు బ్రేక్‌  

అవగాహన కల్పించడంలో పోలీసుల పాత్ర కీలకం 

► ఈ ఏడాది జూన్‌ 24వ తేదీ ఒడిశాలోని జోడా ప్రాంతం. పదో తరగతి చదువుతున్న బాలిక తమ బంధువుల ఇంటికి వెళ్లింది. సాయంత్రం వరకూ అక్కడే గడిపి తిరుగు ప్రయాణమైంది. ఒంటరిగా వెళ్తున్న, ఆమెను ఐదుగురు యువకులు గమనించి వెంటాడారు. నిర్జన ప్రదేశంలోకి చేరుకోగానే అపహరించుకెళ్లి అత్యాచారం చేశారు.

► ఈ ఏడాది జూన్‌ 6వ తేదీ ఒంగోలులోని బస్టాండులో ఒంటరిగా బస్సు దిగిన పదో తరగతి విద్యార్థినిపై ఓ దివ్యాంగుడు కన్నేశాడు. తన స్నేహితుడి కోసం ఎదురు చూస్తున్న ఆమెను మాటలతో లోబర్చుకున్నాడు. ఆ స్నేహితుడు తనకు తెలుసునని నమ్మించి బస్టాండు సమీపంలోని గదికి పిలుచుకెళ్లాడు. ఆ రాత్రి అక్కడ తన మిత్రుడితో కలిసి ఆ బాలికపై పలుమార్లు అత్యాచారం చేశారు. అంతటితో ఆగకుండా ఆమెను మరో గదికి తరలించి, అక్కడ ఉంటున్న నలుగురు ఇంజినీరింగ్‌ విద్యార్థులతో కలిసి పైశాచికంగా అత్యాచారం చేశారు. ఒకటి రెండు రోజులు కాదు.. ఏకంగా పది రోజుల పాటు బాలికను గదిలో నిర్బంధించి పలుమార్లు అత్యాచారం చేశారు.  

ఇలాంటి ఘటనలు ప్రతి రోజూ ఏదో ఒక ప్రాంతంలో చోటు చేసుకుంటూ ఉన్నాయి. మహిళల్లో ఉన్న నిరక్షరాస్యత కారణంగా వారిలో ప్రశ్నించే తత్త్వం లేకపోవడంతో వారిపై ఆకృత్యాలు నానాటికీ పెరిగిపోతున్నాయి. మహిళల రక్షణ కోసం ఏర్పాటు చేసిన పదునైన చట్టాలు ఎన్ని ఉన్నా.. అవేవీ బాధితులను ఆదుకోలేకపోతున్నాయి. చట్టాలపై కనీస అవగాహన లేకపోవడంతో అవి కాస్త దుర్వినియోగమవుతున్నాయి. ‘ఎక్కడ స్త్రీలు పూజింపబడుతారో... అక్కడ దేవతలు నాట్యం చేస్తారు’ ఇది ఓ మహానుభావుని మాట. ‘స్త్రీ అర్ధరాత్రి నిర్భయంగా తిరిగినప్పుడే నిజమైన స్వాతంత్య్రం వచ్చినట్లు’ ఇది మహాత్మగాంధీ నినాదం. అదే కోవలో డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ సైతం రాజ్యాంగానికి పదును పెట్టారు.

హిందూకోడ్‌ బిల్‌.. చట్టసభల్లో రిజర్వేషన్‌ మహిళలకు గౌరవం కల్పించారు. అంతేకాక రాజ్యాంగంలోని పలు ఆర్టికల్స్‌ స్త్రీ స్వేచ్ఛకు పచ్చజెండా ఊపాయి. అయినా స్త్రీలపై హింస ఆగడం లేదు. భర్త రూపంలో... ప్రియుడి రూపంలో... అన్న... నాన్న... పక్కింటివాడు.. పొరుగింటివాడు... బస్సులో ఆకతాయిలు...రోడ్లపై రోమియోలు... స్కూళ్లలో కొందరు... ఇలా చెప్పుకుంటూపోతే మహిళా స్వేచ్ఛ అనేది ఎక్కడా కనిపించడం లేదు. బలహీనులైన అబలలపై బలవంతులైన మృగాళ్ల పెత్తనం నానాటికీ పెరిగిపోతోంది. ఇలాంటి తరుణంలోనే మహిళా హక్కుల పరిరక్షణకు నిర్భయ లాంటి పదునైన చట్టాలు వచ్చాయి. మహిళల రక్షణకు రూపొందించిన చట్టాల గురించి తెలుసుకుందాం రండి..  
– కళ్యాణదుర్గం రూరల్‌ 

రాజ్యాంగం ఏమంటోంది..  
► సమాజపరంగా కానీ, కుటుంబపరంగా కానీ స్త్రీ పురుషులను వేర్వేరుగా చూడరాదు. ఈ విషయంపై రాజ్యాంగంలో ప్రత్యేక ఆర్టికల్‌ ఉంది. 
► ఆర్టికల్‌ 14 ప్రకారం స్త్రీ పురుషులిద్దరూ సమానులే. ఇదే ఆర్టికల్‌ ప్రకారం సమాన రక్షణ పొందడానికి ఇద్దరూ అర్హులు.  
► ఆర్టికల్‌ 15/1 ప్రకారం స్త్రీగా ఆమెపై ఎవరూ వివక్ష చూపకూడదు. దుకాణాల్లో, ప్రదర్శనశాలల్లో, ఫలహారశాలల్లో, వినోదం కలిగించే ప్రదేశాలలో వారిని వెళ్లకుండా అడ్డుకోవడానికి వీలులేదు.  
► స్త్రీలతో గనుల్లో పని చేయించకూడదు. 

జీవించేందుకు సంపూర్ణ హక్కు  
► స్త్రీ తాను జీవితాంతం వివాహం చేసుకోకుండా ఉండాలని నిర్ణయించుకుంటే.. దానిని హక్కుగా గౌరవించాలి.   
► ఈ హక్కును కుటుంబంలోని అన్నదమ్ములు, తల్లిదండ్రులు అడ్డుకోలేరు. 18 సంత్సరాలు నిండిన స్త్రీ తన ఇష్టం వచ్చిన పురుషున్ని పెళ్లాడవచ్చు. అయితే నిషేధింపబడిన దగ్గర బంధువైనప్పుడు, భార్య ఉన్న పురుషుడిని పెళ్లాడడానికి వీలులేదు.  
► హిందూ స్త్రీ తనకు 18 ఏళ్లు నిండే వరకూ వివాహం చేసుకోకుండా ఉండవచ్చు. ముస్లిం మహిళ తన 15 లేదా 18 సంవత్సరాలు నిండేలోపు జరిగిన వివాహాన్ని తిరస్కరించవచ్చు. ఈ హక్కును వాడుకోవాలనుకుంటే ఆమె తన భర్తతో లైంగిక సంబంధం కలిగి ఉండరాదు.  
► స్త్రీని బలవంతంగా కాపురానికి తీసుకెళ్లే హక్కు ఎవ్వరికీ లేదు. 
18 సంవత్సరాలు నిండని బాలికను ప్రేమ పేరుతో తీసుకెళ్లి వివాహం చేసుకుంటే, సెక్షన్‌ 366 ప్రకారం యువకునికి పదేళ్ల జైలు శిక్ష విధించవచ్చు. 
 ఏ స్త్రీ అయినా భర్త బతికి ఉండగా మరో వ్యక్తిని పెళ్లాడడానికి వీలు లేదు. అలా పెళ్లాడితే నేరమే. ముస్లిం స్త్రీల విషయంలో ఈ నిబంధన చెల్లదు.  
► వివాహమైన (ఏ మతానికి చెందిన మహిళైనా) స్త్రీ భర్తతో కాక మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకోకూడదు. 
► హేతుబద్ధ సమయాల్లో... ఆర్యోగానికి, సభ్యతకు భంగం కలుగని రీతిలో, ఇబ్బంది కలుగని సమయాల్లో, భార్య, భర్త లైంగిక పరమైన కోర్కెలు తీర్చుకోనివ్వాలి. 

‘నిర్భయ’ంగా  
యావత్‌ దేశాన్ని నిర్భయ ఉదంతం కలిచివేసింది. రోడ్డుపై వెళుతున్న నిర్భయను బస్సులో తిప్పుతూ అత్యంత పాశవికంగా అత్యాచారం చేసి, మృతికి కారణమైన ఘటన యావత్‌ ప్రపంచాన్నే కదిలించింది.  ఆమె ఆత్మకు శాంతి కలిగేలా... మహిళలకు మరింత రక్షణ కల్పించేలా 2013 మార్చి 19న నిర్భయ చట్టాన్ని రూపొందించారు. ఈ చట్ట ప్రకారం స్త్రీ పట్ల ఏ పురుషుడైనా అసభ్యంగా ప్రవర్థించినా, అవమాన పరిచినా, వారి మనోభావాలను దెబ్బతీసేలా ప్రవర్తించినా సెక్షన్‌ 354 కింద కేసు నమోదు చేయవచ్చు. 

ముస్లిం స్త్రీలకు ప్రత్యేక హక్కులు  
► భర్త మరణించిన తర్వాత (ఇద్దతు కాలంలో) మళ్లీ వివాహం కుదరదు. 
► భర్త ఉన్న చోటే కాపురం చేయాలి. సహేతుకమైన కారణముంటే తప్ప వేరుగా జీవించేందుకు అవకాశం లేదు.  
► ముస్లిం స్త్రీలకు మెహరు హక్కు. భర్త చేత నిరాదరణకు గురైనా, విడాకులు ఇచ్చినా... భరణం పొందే హక్కు, పోషణ హక్కు, భర్తను తనతో కాపురం చేయమనే హక్కు తనకు తన భర్తకు వేరే గది (వీలైనంతవరకూ)  కావాలనే హక్కు, బంధువులను చూసి వచ్చే హక్కు, వారు ఆమెను చూసిపోయే హక్కు ఉంటుంది. 

నిరక్షరాస్యతే ఓ కారణం 
దేశంలో మహిళల రక్షణకు అనేక చట్టాలు ఉన్నాయి. అయితే వాటిని మహిళలు సద్వినియోగం చేసుకోలేకపోతున్నారు. చట్టాల గురించి వారికి అవగాహన లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణం. మహిళల్లో అక్షరాస్యత తక్కువ. ఈ కారణంతోనే తమ రక్షణ కోసం ఉన్న చట్టాల గురించి అవగాహన లేకుండా పోయింది. వేధింపులకు సంపూర్ణ అక్షరాస్యతతో అడ్డుకట్ట వేయవచ్చు.  
– నిర్మల, కేజీబీవీ ఎస్‌ఓ, శెట్టూరు 

చట్టాలు వినియోగించుకోగలగాలి
అనేక సామాజిక కట్టుబాట్ల మధ్య మహిళలు నలిగిపోతున్నారు. తమపై జరుగుతున్న లైంగిక దాడులు, గృహహింస, వివక్షకు వ్యతిరేకంగా పోరాటాలు సాగించలేకపోతున్నారు. కట్టుబాట్ల సంకెళ్లు తెంచుకుని చట్టాలను సమర్థవంతంగా వినియోగించుకోగలగాలి. అప్పుడే గృహ హింసను నిర్మూలించేందుకు వీలవుతుంది.  
– సంధ్యారాణి, ఆర్‌ఎంపీ వైద్యురాలు, ములకలేడు, కళ్యాణదుర్గం మం.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top