మృత్యుపాశమై వెంటాడిన విషవాయువు

Fall Sick After Poisonous Gas Leak at Visakhapatnam Chemical Plant - Sakshi

తెల్లవారు జామున మూడు గంటలైంది. అందరూ గాఢనిద్రలో వున్నారు. ఇంతలో ఒంటినిండా దద్దుర్లు, కళ్లల్లో మంటలు.. ఊపిరి అందడం లేదు. కడుపులో వికారం. ఏం జరుగుతోందో ఏమీ అర్థంగావడంలేదు. ప్రాణభయంతో కేకలు పెట్టారు. ఇళ్ల నుంచి బయటికి పరుగులు పెట్టారు. శ్వాస అందక ఎక్కడి వారక్కడ కుప్పకూలిపోయారు. రోడ్ల మీద, వీధుల్లోనూ అదే దృశ్యం. చివరికి మూగ జీవాలు కూడా ప్రాణాలు వదిలాయి. పక్షులు ప్రాణాలు కూడా గాల్లో కలిసిపోయాయి. పచ్చని చెట్లు నల్లగా మాడిపోయాయి.

విశాఖలోని గోపాలపట్నం పరిధివున్న ఆర్‌ఆర్‌ వెంకటాపురంలోని ఎల్జీ పాలిమర్స్ కంపెనీ నుంచి భారీగా లీకైన విషపూరితమైన రసాయన వాయువు ప్రభావానికి గురైన సమీప ప్రాంతాల్లోని విదారక పరిస్థితి ఇది. పెంటైన్, స్టేరైన్ అనే రసాయన వాయువులు మృత్యపాశమై స్థానికులను వెంటాడాయి. దాదాపు మూడు కిలోమీటర్ల మేర వ్యాపించిన రసాయన వాయువులను పీల్చి.. అనేక మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. చాలా మంది ఎక్కడి వారక్కడ కుప్పకూలిపోయి అపస్మారక​ స్థితిలోకి వెళ్లిపోయారు. ఏం జరుగుతుందో తెలియక గుండెలు బాదుకున్నారు. వెంటనే రంగంలోకి దిగిన ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలు.. వెంకటాపురం చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. వైద్య సిబ్బంది, అధికారులు, ప్రజా ప్రతినిధులు తక్షణమే స్పందించి బాధితులకు ఆపన్నహస్తం అందించారు. భయపడొద్దని పోలీసులు భరోసాయిచ్చారు.

సీఎం జగన్ దిగ్భ్రాంతి
ఈ విషాద ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి చెందారు. బాధితులకు తక్షణ సహాయం అందేలా అధికార యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేశారు. స్వయంగా బాధితులను పరామర్శించేందుకు, సహాయక చర్యల పర్యవేక్షణకు విశాఖకు పయనమయ్యారు. ఈ ప్రమాదం తమను ఎంతగానో కలచివేసిందని ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. (విశాఖ ఎల్‌జీ పాలిమర్స్‌లో భారీ ప్రమాదం)

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top