డెంగీ.. భయపడకండి

Dengue Cases File in Guntur - Sakshi

జిల్లాలో పెరుగుతున్న డెంగీ బాధితులు  

పరిసరాల అపరిశుభ్రతే కారణం

వ్యాధిపై అవగాహన అవసరమంటున్న వైద్యులు

అమాయకులను దోచుకుంటున్న ప్రైవేటు ఆస్పత్రులు

వాతావరణం ముసురేసింది... పరిసరాలను అపరిశుభ్రత కమ్మేసింది. వ్యాధుల కాలం వచ్చేసింది. ఏ ఇంట చూసినా జ్వర బాధితుల సంఖ్య పెరిగిపోతోంది. జ్వరమనే మాట వింటే చాలు పల్లె, పట్నమనే తేడా లేకుండా వణికిపోతోంది. అది డెంగీ కావచ్చేమోనంటూ అనుమానపు రోగం ముందుగా భయపెడుతూ.. పేదల జేబులు గుల్ల చేస్తోంది. ప్లేట్‌లెట్స్‌ పేరిట ప్రైవేటు వైద్యుల దోపిడీ యథేచ్ఛగా కొనసాగుతోంది. డెంగీపై అవగాహన పెంచుకుని అప్రమత్తతనే మందు బిళ్ల వేసుకుంటే వ్యాధిని తరిమికొట్టొచ్చని ప్రభుత్వ వైద్య యంత్రాంగం సూచిస్తోంది. అందుకే ఈ డెంగీ కథేంటో తెలుసుకోండి. దానిని దరి చేరకుండా జాగ్రత్త పడదాం రండి.

గుంటూరు మెడికల్‌: గుంటూరు జిల్లా ప్రజలను 2013లో, 2017లో  డెంగీ వణికింది. ఆ కాలంలో ఈ వ్యాధి బారిన పడిన ప్రజలు ప్రాణాలు కూడా కోల్పోయారు. దీనికి అవగాహనే ప్రధానమని వైద్యులు చెబుతున్నారు.

నాలుగో దశ ప్రమాదకరం
పగటి వేళ కుట్టే ఎడిస్‌ ఈజిస్ట్‌ అనే దోమకాటు వల్ల డెంగీ జ్వరం వస్తుంది. డెంగీ జ్వరం మొదటి దశలో జ్వరం, తీవ్రమైన ఒళ్లు నొప్పులు, తలనొప్పి, కళ్లు ఎర్రగా మారతాయి. రెండో దశలో ప్లేట్‌లెట్స్‌ తగ్గటం, జ్వరం, వాంతులు, కాళ్లు వాపులు వస్తాయి. మూడో దశలో బీపీ తక్కవగా ఉండటం, ప్లేట్‌లెట్స్‌ తగ్గటం, శరీరంపై మచ్చలు ఏర్పడతాయి. నాలుగో దశలో రోగికి కామెర్లు రావటంతోపాటుగా షాక్‌లోకి వెళ్లతాడు. బీపీ తగ్గటంతోపాటు కిడ్నీల పనితీరు మందగించి రక్తం బయటకు పోతుంది. నాలుగో దశను డెంగీ హెమరేజ్‌ షాక్‌ సిండ్రోమ్‌ అంటారు. మొదటి మూడు దశలో ఎలాంటి భయాందోళనలు చెందాల్సిన పని లేదు.

దోమలు పెరిగే ప్రదేశాలు
నిలువ ఉండే నీటిలో డెండీ దోమ పిల్లలు పురుగుల వలే కదులుతూ ఉంటాయి. నీటిని నిల్వ చేసే డ్రమ్ములు, తొట్టెలు, గాబులు, రుబ్బు రోళ్ళు, టైర్లు, టీ కప్పులు, ప్లాస్టిక్‌ కప్పులు, కొబ్బరి చిప్పలు, బోండాలు, ఫ్రిజ్, ఎయిర్‌ కూలర్స్‌ వెనుక భాగాలు, పూల కుండీలు, ఓవర్‌ హెడ్‌ ట్యాంకులు, నీటి సంపుల్లో దోమ లార్వాలు పెరుగుతాయి.

డెంగీ పేరుతో దోపిడీ
డెంగీ జ్వరంపై ప్రజలకు అవగాహన లేకపోవటంతో కొన్ని ఆస్పత్రుల్లో ప్లేట్‌లెట్స్‌ పేరిట లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నారు.బొప్పాయి కాయ తిన్నా, రసం తాగినా ప్లేట్‌లెట్స్‌ పెరుగుతాయనే అపోహల్లో ఉంటున్నారు. దీంతో ఆస్పత్రులకు వెళ్లకుండా ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. 

పట్టణ ప్రాంతాల్లోనే అధికం
గ్రామీణ ప్రాంతాల్లో కంటే మున్సిపాలిటీలు, గుంటూరు కార్పొరేషన్‌ పరిధిలోనే ఎక్కువగా డెంగీ కేసులు నమోదవుతున్నాయి. గుంటూరులోని ఏటీ అగ్రహారం, నల్లచెరువు, లాలాపేట, ఆర్‌ అగ్రహారం, పాత గుంటూరు, సుద్దపల్లిడొంక, బ్రాడీపేట, ఆనంద్‌పేట, కొత్తపేట, సంగడిగుంట, జిల్లాలోని కొప్పురావూరు, తమ్మవరం, తాడికొండ, తెనాలి చెంచుపేట, చిలుమూరు, వడ్డెరపాలెం, గంగిరెడ్డిపాలెం, మేడికొండూరులో ఈ ఏడాది డెంగీ కేసులు నమోదయ్యాయి. రాజధాని ప్రాంతాలైన తుళ్లూరు, తాడేపల్లి ఆరోగ్య కేంద్రాల్లో ప్రతి రోజూ జ్వర పీడితులు చికిత్స కోసం వస్తున్నారు.

ప్లేట్‌లెట్స్‌పై అపోహలు వీడండి
ఎలాంటి జ్వరం వచ్చినా ప్లేట్‌లెట్స్‌ తగ్గటం సహజం. సాధారణంగా రక్తంలో 2 లక్షల నుంచి 4.5 లక్షల వరకు ప్లేట్‌లెట్స్‌ ఉంటాయి. వీటి సంఖ్య 40 వేల కన్నా తక్కువగా ఉన్నప్పటికీ ఎలాంటి ప్రమాదం లేదు. శరీరంపై ఎర్రటి దద్దుర్లు ఏర్పడి అవి పగిలి రక్తం బయటకు రావటం, మూత్రంలో, దగ్గుతున్నప్పుడు కళ్లె ద్వారా రక్తం పడడం జరిగితే  ప్లేట్‌లెట్స్‌ ఎక్కించాల్సి ఉంటుంది.– డాక్టర్‌ నరేంద్ర వెంకటరమణ, ఫిజీషియన్, గుంటూరు

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top