
నెత్తురోడిన నల్లమల
నవ్యాంధ్రప్రదేశ్ శాసనసభ కొలువదీరిన రోజే జిల్లాలో ఎన్‌కౌంటర్ జరగడం కలకలానికి దారితీసింది.
సాక్షి, ఒంగోలు/మార్కాపురం: నవ్యాంధ్రప్రదేశ్ శాసనసభ కొలువదీరిన రోజే జిల్లాలో ఎన్‌కౌంటర్ జరగడం కలకలానికి దారితీసింది. కొన్నేళ్లపాటు ప్రశాంతంగా ఉన్న జిల్లా వాసులు మావోయిస్ట్‌ల ఎన్‌కౌంటర్‌తో ఉలిక్కిపడ్డారు. యర్రగొండపాలెం నియోజకవర్గం పాలుట్లకు 7 కిలోమీటర్ల దూరాన ఉన్న మురారి కురవ తండా అటవీ ప్రాంతంలో గురువారం సాయంత్రం సరిగ్గా 6.30 గంటల ప్రాంతంలో ఎన్‌కౌంటర్ జరిగినట్లు పోలీసువర్గాల సమాచారం.
ఈ ఘటనలో మావోయిస్ట్ దళసభ్యుడు జానాబాబూరావుతో పాటు అతని భార్య నాగమణి అలియాస్ భారతి, విమల మృతి చెందారు. మహబూబ్‌నగర్ జిల్లా నుంచి పోలీసులకు లొంగిపోయి రిమాండ్‌కు తరలించే క్రమంలో పరారైన విక్రమ్ కూడా వీరితోనే ఉన్నట్లు సమాచారం. విక్రమ్ బుల్లెట్ గాయాలతో పరారైనట్లు తెలుస్తోంది. మృతదేహాల వద్ద ఆయుధాలు, విప్లవ సాహిత్యం స్వాధీనం చేసుకున్నారు. కృష్ణా నది మార్గాన పుట్టిలలో ప్రయాణిస్తూ తండా వాసుల ఆశ్రయం తీసుకుంటూ జానాబాబురావు దళం కొంత కాలంగా జిల్లాలోనే సంచరిస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు.
2001 నుంచి 2008 వరకు జిల్లాలో నిరాటంకంగా మావోయిస్టు ఎన్‌కౌంటర్లు జరిగాయి. ఆది నుంచి మావోయిస్టులకు జిల్లాలోని పుల్లలచెరువు మండలం షెల్టర్ జోన్‌గా ఉంది. బెంగళూరులో మావోయిస్టు ఇంజినీర్ టెక్‌మధును అరెస్ట్ చేసినప్పుడు మొత్తం 1262 రాకెట్ లాంచర్లు తయారు చేసినట్లు వెల్లడైంది. అయితే మొట్టమొదటిసారిగా మావోయిస్టులు రాకెట్ లాంచర్లు గుంటూరు జిల్లా దుర్గి పోలీస్‌స్టేషన్‌పై ప్రయోగించగా విఫలమైంది. ఆ తర్వాత దోర్నాల చెక్‌పోస్ట్ వద్ద కూడా ప్రయోగించారు. తయారు చేసిన రాకెట్ లాంచర్లలో 90 శాతం డంప్‌లు పుల్లలచెరువు మండలం శతబోడు, పాతచెరువుతండా అడవుల్లో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
జిల్లాలో మావోయిస్టుల చరిత్ర
= 1988లో దగ్గు రాయలింగం హత్యకు నిరసనగా బస్సు దహనంతో జిల్లాలో పీపుల్స్‌వార్ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి.
= 1989 ఏప్రిల్ 6న కారంచేడులో ప్రస్తుత బీజేపీ నేత దగ్గుబాటి పురందేశ్వరి మామ దగ్గుబాటి చెంచురామయ్యను హత్య చేశారు.
= 1991లో పెద్దదోర్నాల ఎంపీపీ కార్యాలయాన్ని పేల్చి వేశారు.
= 1992 ఆగస్టు 14న పెద్దదోర్నాల మండలం గటవానిపల్లెలో గజవల్లి బాలకోటయ్యను కాల్చి చంపారు.
ప్రజాప్రతినిధులపై కాల్పులు
= 1995 డిసెంబర్ 1న అప్పటి ఒంగోలు ఎంపీ మాగుంట సుబ్బరామిరెడ్డి కాల్చివేత
= 1997 ఆగస్టు 24న పెద్దదోర్నాల మండలం వై చెర్లోపల్లె సర్పంచ్ కుమారుడు బట్టు సంజీవరెడ్డి హత్య
= 1998 ఫిబ్రవరి 25న వలేటివారిపాలెం ఎంపీపీ హత్య
= 2002 సెప్టెంబర్ 18న పెద్దదోర్నాల ఎంపీపీ గంటా కేశవ బ్రహ్మానందరెడ్డి హత్య
= 2003 జూన్ 11న పెద్దదోర్నాల మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ రావిక్రింది సుబ్బరంగయ్య హత్య
= 2004 ఫిబ్రవరి 11న పెద్దదోర్నాల పీఏసీఎస్ అధ్యక్షుడు అల్లు వెంకటేశ్వరరెడ్డిపై కాల్పులు
= 2004 ఏప్రిల్ 4న సురభేశ్వర కోన దేవస్థానం అధ్యక్షుడు ఎస్.విజయమోహన్‌రావు హత్య
= 2005 ఏప్రిల్ 25న అప్పటి పెద్దదోర్నాల ఎంపీపీ అమిరెడ్డి రామిరెడ్డి వాహనంపై కాల్పులు
= 2005 ఏప్రిల్ 27న అప్పటి ఎస్పీ మహేష్ చంద్రలడ్హాపై హత్యాయత్నం
= 2006 అక్టోబర్ 30న గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే పగడాల రామయ్య సోదరుడి దారుణ హత్య
= 2006 ఏప్రిల్ 8న అప్పటి కంభం శాసనసభ్యుడు ఉడుముల శ్రీనివాసరెడ్డిపై దాడికి యత్నం
ముఖ్య సంఘటనలు..
= 1993లో వైపాలెం గెస్ట్‌హౌస్ పేల్చివేత
= 2001 ఫిబ్రవరిలో ప్రశాంతి ఎక్స్‌ప్రెస్ నుంచి వాకీటాకీ అపహరణ
= 2001 మార్చి 21న శ్రీశైలం-సున్నిపెంట పోలీస్‌స్టేషన్ల పేల్చివేత
= 2001జూన్ 3న పుల్లలచెరువు ఏఎస్సై ప్రశాంతరావు హత్య
= 2001 జూన్ 17న యర్రగొండపాలెం పోలీస్‌స్టేషన్ పేల్చివేత
బాహ్య ప్రపంచంలోకి..
= 1980 జనవరి 22న పీపుల్స్‌వార్ ఏర్పాటు
= 1992 మే 21న అప్పటి ప్రభుత్వం పీపుల్స్ వార్‌పై నిషేధం
= 1995 జూలై 15న అప్పటి టీడీపీ ప్రభుత్వం మావోయిస్టులపై మూడు నెలల పాటు నిషేధం ఎత్తివేత
= 1996 జూలై 24న ప్రజాభద్రత చట్టం కింద పీపుల్స్‌వార్‌పై మళ్లీ నిషేధం
= 2004లో అధికారంలోకి వచ్చిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ఆర్ ఆ ఏడాది జూలై 21న నిషేధం ఎత్తివేత
= 2004 అక్టోబర్ 11న తొలిసారిగా పీపుల్స్‌వార్ అగ్రనేతలు జనజీవన స్రవంతిలోకి రాక (దోర్నాల మండలం చిన్నారుట్ల నుంచి)
= 2004 అక్టోబర్ 21న మళ్లీ అడవిలోకి..
= 2004 అక్టోబర్‌లో సీపీఐ మావోయిస్టు పార్టీ ఆవిర్భావం
= 2006 ఆగస్టు 17న మావోయిస్టు పార్టీపై నిషేధం విధింపు
టార్గెట్ జానాబాబూరావు
పోలీసులు మూడేళ్ల నుంచి జానాబాబూరావును టార్గెట్ చేశారు. ఆయన కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఇప్పటి ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన జానాబాబూరావుపై రూ.5 లక్షలు, విమలక్కపై రూ.4 లక్షలు, భారతిపై రూ.3 లక్షల రివార్డును గతంలోనే ప్రభుత్వం ప్రకటించినట్లు సమాచారం.
త్రిపురాంతకానికి సుపరిచితుడే
త్రిపురాంతకం : ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన జానాబాబూరావు త్రిపురాంతకానికి సుపరిచితుడు. ఎండూరివారిపాలెం పంచాయతీ పరిధిలోని సంగంతండాకు చెందిన కె.పెద్ద విజయను వివాహం చేసుకుని ఈ ప్రాంతంలో నివాసం ఉన్నాడు. 1990లో మావోయిస్టు సానుభూతిపరునిగా ఎర్రగొండదళానికి టచ్‌లో ఉండేవాడు. ఆ తర్వాత దళ సభ్యునిగా చేరి ఉద్యమంలోకి వెళ్లిపోయాడు. జానాబాబూరావు భార్య విజయకు ముగ్గురు కుమారులు. వీరంతా ప్రస్తుతం ఇక్కడే నివాసం ఉంటున్నారు.
విజయ మిషన్ కుడుతూ జీవనం సాగిస్తుండగా ముగ్గురు కుమారులు కూలీ పనులు చేసుకుని జీవిస్తున్నారు. వీరికి జానాబాబూరావుతో 20 ఏళ్లుగా సంబంధాలు తెగిపోయాయి. పోలీసుల కథనం ప్రకారం.. రెండో భార్య పి.కవిత అలియాస్ విమలది మెదక్ జిల్లా తొరుగుట్ల మండలం ఒడెంచెరువు. మూడో భార్య నాగమణి అలియాస్ భారతిది మహబూబ్‌నగర్ జిల్లా అమ్రాబాద్ మండలం మందావానిపల్లె. ఆమె ఆ గ్రామానికి గతంలో సర్పంచ్‌గా పని చేశారు.