
త్వరలో ఓ మంచి సినిమా : రసూల్ ఎల్లోర్
తెరపై హీరో హీరోయిన్లు అందంగా కనబడాలన్నా, లొకేషన్లు అద్భుతంగా చూపాలన్నా, దృష్టి మరలకుండా సినిమా చూడాలన్నా...
- దర్శకత్వం అంటే ఎంతో ఇష్టం
- ఇండస్ట్రీ విశాఖ రావాలంటే చాలా జరగాలి
- సినిమాటోగ్రాఫర్, డెరైక్టర్ రసూల్ ఎల్లోర్
విశాఖపట్నం : తెరపై హీరో హీరోయిన్లు అందంగా కనబడాలన్నా, లొకేషన్లు అద్భుతంగా చూపాలన్నా, దృష్టి మరలకుండా సినిమా చూడాలన్నా... అందుకు కెమెరా పనితనం ఎంతో అవసరం. ప్రేక్షకులకు గుర్తుండిపోయే అతి కొద్దిమంది ఛాయాగ్రహకుల్లో రసూల్ ఎల్లోర్ ఒకరు. ఓ సినిమా వర్క్‌షాప్ కోసం విశాఖ వచ్చిన ఆయనతో ‘న్యూస్‌లైన్’తో మాట్లాడింది. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే...
నేను ఇక్కడి వాడినే..
రాజమండ్రిలో పుట్టి పెరిగాను. నాన్న జగన్మోహన్‌రావు ఎలక్రికల్ ఇంజనీర్‌గా పనిచేసేవారు. అమ్మ షీలా బ్రిటిష్ కుటుంబానికి చెందినవారు.
సినిమాల్లో ప్రవేశం
విఖ్యాత సినిమాటోగ్రాఫర్ ఎస్.గోపాల్‌రెడ్డి మా బంధువు. ఆయన వద్ద ఆరేళ్లు పనిచేశాను. తర్వాత జగపతిబాబు నటించిన గాయం చిత్రంతో కేరీర్ ప్రారంభించాను. తర్వాత ఎన్నో సినిమాలకు ఛాయాగ్రహకుడిగా పనిచేశాను. రంగీలా (ఓ పాటకు), దౌడ్, కిక్, జల్సా, నువ్వు నేను, ఊసరవెల్లి, నీకు నాకు డేష్ డేష్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సినిమాలు చేశాను.
దర్శకత్వం
నాకు డెరైక్షన్ అంటే కూడా ఇష్టం. అందుకే ఒకరికి ఒకరు చిత్రాన్ని రూపొందించాను. అది మంచి హిట్ అయింది. భగీరధ, సంగమం చిత్రాలకు దర్వకత్వం వహించాను. ఈ మూడింటికి కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం నేనే. ఈమధ్య డైరక్షన్‌కు బాగా గ్యాప్ వచ్చింది. మంచి కథ కోసం ఆలోచిస్తున్నాను. ప్రస్తుతానికి చర్చల్లో ఉంది. స్క్రిప్టు పూర్తవగానే సినిమా తీస్తాను.
కథపై అవగాహన అవసరం
నేను సినిమాటోగ్రాఫర్‌గా చేసిన ప్రతి సినిమాకు ముందే కథ వింటాను. జడ్జ్ చేసుకుని నచ్చితేనే ఒప్పుకుంటాను. నా దృష్టిలో అది చాలా బెస్ట్. ఎందుకంటే సినిమాటోగ్రాఫర్‌కు కథపై అవగాహన ఉంటే మంచి అవుట్‌పుట్ వస్తుంది.
విశాఖకు చాలా రావాలి....
నేను తొలి చిత్రం గాయం విశాఖలో షూట్ చేశాం. ఎంతో అందమైన లొకేషన్లున్నాయి. నేడు చాలా డెవలప్ అయింది. కాకపోతే ఇండస్ట్రీ రావాలంటే చాలా అవసరం. మేన్ పవర్ ఉండాలి. టెక్నీషియన్లు కావాలి. ఎడిటింగ్, డబ్బింగ్ తదితర అన్ని వనరులు అవసరం. ఇవన్నీ రావాలంటే ఇక్కడి వారే ముందుకు రావాలి. బంతి విశాఖ కోర్టులో ఉంది. దాన్ని వినియోగించుకోవాల్సిన అవకాశం ఇక్కడి వారికే ఉంది.