నీళ్లు ఫుల్‌.. కరెంట్‌ నిల్‌ | AP Genco does not focus on hydroelectricity | Sakshi
Sakshi News home page

నీళ్లు ఫుల్‌.. కరెంట్‌ నిల్‌

Jul 27 2018 2:55 AM | Updated on Mar 28 2019 5:32 PM

AP Genco does not focus on hydroelectricity - Sakshi

సాక్షి, అమరావతి: జలాశయాల్లో సరిపడా నీరున్నా జలవిద్యుదుత్పత్తిపై ఏపీ జెన్‌కో దృష్టి సారించడం లేదు. ఇప్పటికీ ప్రైవేట్‌ విద్యుత్‌కే ప్రాధాన్యమివ్వడం విస్మయ పరుస్తోంది. వర్షాకాలంలో వీలైనంత వరకూ జలవిద్యుత్‌ను వాడుకుంటే సగటు ఉత్పత్తి వ్యయం తగ్గుతుంది. గత వారం రోజులుగా విస్తారంగా వర్షాలు పడుతున్నాయి.

ఎగువ ప్రాంతాల నుంచి నీరు చేరడం వల్ల ప్రధాన ప్రాజెక్టుల్లో నీటి మట్టాలు క్రమంగా పెరుగుతున్నాయి. శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ఇప్పటికే 866 అడుగుల మేరకు చేరుకుంది. మరో నాలుగు అడుగుల మేర నీరు వస్తే జల విద్యుత్‌ ఉత్పత్తికి అవకాశం ఉంది. రాయలసీమలోని ప్రాజెక్టులకు నీటి సరఫరాకు ఇబ్బందులు లేకుండా జలవిద్యుదుత్పత్తికి ప్రణాళికలు  సిద్ధం చేసుకోవాల్సి ఉన్నా జెన్‌కో ఇప్పటివరకూ ఆ సన్నాహాలేమీ చేయలేదు.

వారం ముందు నుంచే విద్యుదుత్పత్తికి అనుకూలంగా యంత్రాలను సన్నద్ధం చేయాలి. ట్రయల్‌ రన్‌ ప్రారంభించాల్సి ఉంటుంది. 770 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యాన్ని వందశాతం పీఎల్‌ఎఫ్‌(ప్లాంట్‌ లోడ్‌ ఫ్యాక్టర్‌)తో వాడుకునే దిశగా ప్రణాళికలే సిద్ధం చేయలేదు. శ్రీశైలంలో విద్యుదుత్పత్తి మొదలైతే ఎక్కువ ధర ఉండే ప్రైవేట్‌ విద్యుత్‌లో దేన్ని నిలిపివేయాలనే అంశంపై ఇంకా చర్చించలేదు.

మాచ్‌ఖండ్‌లో 20 మెగావాట్లే
మాచ్‌ఖండ్‌లో 2,750 అడుగులకు గానూ 2,703 అడుగుల మేర నీటిమట్టం ఉంది. ఇక్కడ 35 మెగావాట్ల మేర జల విద్యుత్‌ సామర్థ్యం ఉంది. కానీ ప్రస్తుతం ఉత్పత్తి చేసేది కేవలం 20 మెగావాట్లే. పవన విద్యుత్‌ ఉత్పత్తి పెరిగితే అది కూడా ఆపేస్తున్నారు.

సీలేరులో సగమే...
సీలేరు నీటి సామర్థ్యం 1360 అడుగులు కాగా ఇప్పటికే పూర్తిస్థాయికి చేరుకుంది. ఇక్కడ 730 మెగావాట్ల సామర్థ్యంతో విద్యుత్‌ ఉత్పత్తికి అవకాశాలున్నా ప్రస్తుతం 400 మెగావాట్లకే పరిమితం చేశారు.

ప్రైవేట్‌ విద్యుత్‌పైనే ప్రేమ
జలవిద్యుత్‌ సాధారణంగా జూన్‌ నుంచి సెప్టెంబర్‌ మధ్యే లభిస్తుంది. యూనిట్‌ ధర కేవలం రూ. 2లోపే ఉంటుంది. బొగ్గు ఆధారిత థర్మల్‌ విద్యుత్‌ ధర యూనిట్‌ రూ. 5పైన ఉంటోంది. పవన విద్యుత్‌ యూనిట్‌ సగటున రూ. 5.40 వరకూ ఉంది. ఈ నేపథ్యంలో ఏ లెక్కన చూసినా ఈ సీజన్‌లో జల విద్యుత్‌ లాభసాటి. ప్రస్తుతం రాష్ట్రంలో రోజుకు 156 మిలియన్‌ యూనిట్ల మేర విద్యుత్‌ డిమాండ్‌ ఉంది.

శ్రీశైలం, మాచ్‌ఖండ్, సీలేరు నుంచి రోజుకు 36 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ లభించే అవకాశం ఉంది. కానీ ప్రస్తుతం ఇది ఆరు మిలియన్‌ యూనిట్లు కూడా ఉండటం లేదు. ఇదే సమయంలో ప్రైవేట్‌ ఉత్పత్తిదారులు అందించే పవన, సౌర విద్యుత్‌ రోజుకు 60 మిలియన్‌ యూనిట్ల వరకూ ఉంటోంది. ఏపీ జెన్‌కో జల, థర్మల్‌ విద్యుత్‌ను వాడుకుంటే ఖరీదైన పవన, సౌర విద్యుత్‌ను ఆపేయాల్సి ఉంటుంది. అందువల్లే రాష్ట్ర ప్రభుత్వం జల విద్యుదుత్పత్తిని నిర్లక్ష్యం చేస్తోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement