సాక్షి, కర్నూలు : ఆళ్లగడ్డ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికలో పోటీ చేసేందుకు టీడీపీ వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది.
సాక్షి, కర్నూలు : ఆళ్లగడ్డ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికలో పోటీ చేసేందుకు టీడీపీ వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. దీనిపై తెలుగుదేశం పార్టీ జిల్లా నేతలతో సమావేశం అనంతరం అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. అయితే జిల్లా టీడీపీ నేతలు మాత్రం బరిలో నిలిచేందుకే మొగ్గుచూపుతున్నారు. పోటీపై పునరాలోచనలో పడడానికి ప్రధానంగా రెండు కారణాలు కనిపిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
గత ట్రాక్ రికార్డును పరిశీలిస్తే గెలిచే అవకాశం లేదన్నది ఒక కారణం కాగా, దీంతోపాటు హుదూద్ తుపాన్ నేపథ్యంలో ఉత్తరాంధ్ర అల్లకల్లోలమైంది. దీనిపై రాష్ట్ర ప్రజలందరి దృష్టి కేంద్రీకృతమైంది. ఇలాంటి పరిస్థితుల్లో పోటీ చేయడం వల్ల, గత సాంపద్రాయాన్ని కాదని రాజకీయాలు చేస్తున్నారన్న అపప్రద మూటుకట్టుకోవడం ఎందుకన్నది మరోకారణంగా కనిపిస్తోన్నది విశ్లేషకుల భావన. ఇదే భావన టీడీపీ పెద్దల్లోనూ నెలకొనడంతో పోటీపై పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది.
అయితే పోటీ వద్దని అధిష్టానం తీసుకున్న నిర్ణయాన్ని జిల్లా టీడీపీ నేతలు ధృవీకరించడం లేదు. సోమవారం సమావేశమయ్యాకే నిర్ణయం వెలువడతుందని జిల్లా నేతలు పేర్కొంటున్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా పోటీ చేసే అంశంపై తన నిర్ణయాన్ని సోమవారం ప్రకటించనుంది. కాగా, మంగళవారం నామినేషన్ల దాఖలుకు తుది గడువు. సాధారణంగా సెంటిమెంట్‌తో మంగళవారం రాజకీయ నాయకులు నామినేషన్లు దాఖలు చేయరు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ కూడా పోటీపై సోమవారం ఉదయమే అధికారిక ప్రకటన చేసే అవకాశముంది.