‘స్టే’జీవికి ఝలక్‌

ACB court decision on Lakshmi Parvathi complaint Over Chandrababu - Sakshi

చంద్రబాబుపై అక్రమాస్తుల కేసులో విచారణ కొనసాగింపు

నందమూరి లక్ష్మీపార్వతి ఫిర్యాదుపై ఏసీబీ న్యాయస్థానం నిర్ణయం

తదుపరి విచారణ మే 13కు వాయిదా 

సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో గతంలోనే ముగిసిన స్టే గడువు 

స్టే పొడిగింపు లేకపోవడంతో విచారణ కొనసాగించాలని ఏసీబీ కోర్టు నిర్ణయం 

2005లో చంద్రబాబుపై ప్రైవేట్‌ ఫిర్యాదు దాఖలు చేసిన లక్ష్మీపార్వతి 

ఆదాయానికి మించి భారీగా ఆస్తులు ఆర్జించారని ఆరోపణ 

అక్రమ సంపాదనతో భూములు,భవనాలు, షేర్లు కొన్నారని ఫిర్యాదు

సాక్షి, హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారని, దీనిపై ఏసీబీ విచారణకు ఆదేశించాలని కోరుతూ నందమూరి లక్ష్మీపార్వతి 2005లో దాఖలు చేసిన ప్రైవేట్‌ ఫిర్యాదుపై విచారణ కొనసాగించాలని హైదరాబాద్‌లోని అవినీతి నిరోధక శాఖ ప్రత్యేక న్యాయస్థానం నిర్ణయించింది. అందులో భాగంగా తదుపరి విచారణను మే 13వ తేదీకి వాయిదా వేసింది. లక్ష్మీపార్వతి ఫిర్యాదుపై ఏసీబీ కోర్టు విచారణ జరపకుండా చంద్రబాబు 2005 మార్చిలో హైకోర్టు నుంచి స్టే తెచ్చుకున్నారు. గత ఏడాది సుప్రీంకోర్టు ఒక కేసులో తీర్పునిస్తూ.. స్టే ఉత్తర్వులు మంజూరు చేసి ఆరు నెలలు దాటినప్పుడు, తిరిగి ఆ ఉత్తర్వులు పొడిగింపు పొందాల్సి ఉంటుందని, లేకపోతే స్టే లేనట్లుగా భావించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. లక్ష్మీపార్వతి దాఖలు చేసిన ఫిర్యాదు గత నెలలో ఏసీబీ కోర్టు ముందు విచారణకు వచ్చింది.

ఈ సందర్భంగా కోర్టు ఈ కేసుకు సంబంధించి ఏవైనా స్టే ఉత్తర్వులున్నాయా అంటూ సందేహం వ్యక్తం చేసింది. విచారణను వాయిదా వేసింది. శుక్రవారం ఈ కేసు మరోసారి విచారణకు రాగా, లక్ష్మీపార్వతి తరఫు న్యాయవాది సురేందర్‌రెడ్డి స్పందిస్తూ.. ఈ ఫిర్యాదుపై చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించి 2005లో స్టే పొందారని తెలిపారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఆరు నెలల గడువు ముగిసిన తరువాత స్టే పొడిగింపు పొందాలని, అయితే, ఈ కేసులో చంద్రబాబు ఇప్పటివరకు ఎలాంటి పొడిగింపు పొందలేదని ఆయన ఏసీబీ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అలా అయితే సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం స్టే లేనట్లుగానే భావించాల్సి ఉంటుందని, అందువల్ల లక్ష్మీపార్వతి ఫిర్యాదుపై విచారణను కొనసాగిస్తామని ఏసీబీ కోర్టు స్పష్టం చేసింది. తదుపరి విచారణను మే 13వ తేదీకి వాయిదా వేసింది. ఆ రోజు విచారణకు హాజరు కావాలని లక్ష్మీపార్వతిని ఆదేశించింది. 

లక్ష్మీపార్వతి ఫిర్యాదులోని ముఖ్యాంశాలు 
‘‘చంద్రబాబు నాయుడు సాధారణ వ్యవసాయ కుటుంబంలో పుట్టారు. ఆర్థిక స్థోమత లేకపోవడంతో ఆయన విద్యాభ్యాసమంతా ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లోనే సాగింది. 1978లో చిత్తూరు జిల్లా చంద్రగిరి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఎమ్మెల్యేగా నెలకు రూ.350 జీతం అందుకున్నారు. 1980లో మంత్రి అయ్యారు. మంత్రిగా నెలకు రూ.2,500 జీతం తీసుకున్నారు. 1978 నుంచి 1983 వరకు ఎమ్మెల్యేగా, మంత్రిగా ఆయన ఆదాయం రూ.74,050. 1983లో తెలుగుదేశం పార్టీలో చేరారు. అప్పటి నుంచి 1989 వరకు ఆయన వ్యవసాయ ఆదాయం ఏడాదికి రూ.36,000. ఈ విషయాన్ని చంద్రబాబు 1988లో ఓ కేసులో హైకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్‌లో పేర్కొన్నారు. 1983 నుంచి 1989 వరకు ఆయన ఆదాయం రూ.2.16 లక్షలు. 1992లో చంద్రబాబు హెరిటేజ్‌ ఫుడ్స్‌ను ప్రమోట్‌ చేశారు. ఆ కంపెనీ డైరెక్టర్‌గా ఐదు నెలలు పాటు నెలకు రూ.20,000 చొప్పున జీతం తీసుకున్నారు. 1999లో స్పీకర్‌కు ఆస్తుల వివరాలు సమర్పించినప్పుడు, అందులో హెరిటేజ్‌ ఫుడ్స్‌లో రూ.76.15 లక్షల పెట్టుబడులు పెట్టినట్లు చెప్పారు. అలాగే రూ.3.07 లక్షలను ఇతర ఆదాయంగా చూపారు. అన్‌లిస్టెడ్‌ వాటాల విలువ రూ.41.55 లక్షలు. ఇలా తన పేరు మీద మొత్తం ఆస్తుల విలువను రూ.144.50 లక్షలుగా చూపారు. 

బాబు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు 
అంతేకాకుండా నెల్లూరు జిల్లా బాలాయపల్లి మండలం నిందాలి గ్రామంలో 26.43 ఎకరాలు, హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెంబర్‌ 65లో ప్లాట్, వెంకటేశ్వర హౌసింగ్‌ సొసైటీలో మరో 600 చదరపు గజాల స్థలం ఉన్నట్లు చంద్రబాబు చూపారు. వీటి విలువను రూ.5.36 కోట్లుగా పేర్కొన్నారు. తన కుమారుడు నారా లోకేశ్‌ పేరు మీద రూ.2.45 కోట్ల ఆస్తులున్నట్లు చెప్పారు. తండ్రి, కొడుకుల ఆస్తిని రూ.7.82 కోట్లుగా చూపారు. 1999 నుంచి 2004 వరకు చంద్రబాబు ముఖ్యమంత్రిగా కొనసాగారు. కుప్పం ఎమ్మెల్యేగా ఆయన రిటర్నింగ్‌ అధికారికి సమర్పించిన అఫిడవిట్‌లో తన ఆస్తులను రూ.1.58 కోట్లుగా చూపారు. లోకేశ్‌ పేరిట ఉన్న ఆస్తులను చూపించలేదు. 1978 నుంచి 2003 వరకు చంద్రబాబు అధికారిక సంపాదన రూ.7.38 లక్షలు మాత్రమే. రిటర్నింగ్‌ అధికారికి చూపిన అఫిడవిట్‌లోని లెక్కలు నిజమనుకున్నా, ఆయనకు ఆదాయానికి మించి ఉన్న ఆస్తులు రూ.1.50,85,066. ఇవి ఆయన కుమారుడు లోకేశ్‌ ఆస్తులను కలపకుండా చూపిన ఆస్తులు.

ఆ సమయంలో లోకేశ్‌ మైనర్‌గా ఉన్నాడు. మైనర్‌ ఆస్తులను తండ్రి ఆస్తులుగా పరిగణించాల్సి ఉంటుంది. దీని ప్రకారం చంద్రబాబు మొత్తం ఆస్తుల విలువ రూ.4.03 కోట్లు. చంద్రబాబు ఎమ్మెల్యేగా, మంత్రిగా తనకొచ్చే జీతంతో జూబ్లీహిల్స్‌లో ఇల్లు కట్టలేరు. హెరిటేజ్‌లో రూ.76.15 లక్షల పెట్టుబడి పెట్టలేరు. వివిధ కంపెనీల్లో రూ.44.55 లక్షల విలువైన షేర్లు కొనలేరు. ఎమ్మెల్యే, మంత్రిగా అధికార దుర్వినియోగానికి పాల్పడం ద్వారా సంపాదించిన డబ్బుతోనే చంద్రబాబు ఇవన్నీ చేయగలిగారు. 1995లో చంద్రబాబు రెవెన్యూ శాఖ మంత్రి అయ్యారు. అప్పటి నుంచి ఆయన భార్య భువనేశ్వరి ఆస్తులతో పాటు హెరిటేజ్‌ ఫుడ్స్‌ ఆస్తులు కూడా గణనీయంగా పెరుగుతూ వచ్చాయి. పలు కీలక ప్రాంతాల్లో ఎకరాల కొద్దీ భూములు కొనేశారు. అలాగే హైదరాబాద్‌ నడిబొడ్డున పంజాగుట్టలో భవనం కొనుగోలు చేశారు. చంద్రబాబు తన తల్లి అమ్మణ్ణమ్మ పేరిట హైదరాబాద్‌ మదీనాగూడలో భూమి కొని, దాన్ని కుమారుడు లోకేశ్‌ పేరిట బదలాయించారు. 

రూ.76 లక్షలతో రూ.17.44 కోట్ల ఆస్తులు కొనడం సాధ్యమేనా? 
2004లో రిటర్నింగ్‌ అధికారికి సమర్పించిన అఫిడవిట్‌లో భువనేశ్వరి ఆస్తులను రూ.19.34 కోట్లుగా> చంద్రబాబు చూపారు. 1994–2003 మధ్య రూ.76 లక్షలుగా భువనేశ్వరి ఆదాయం ఉంది. ఈ మొత్తంతో రూ.17.44 కోట్ల ఆస్తులు కొనుగోలు చేయడం అసాధ్యం. చంద్రబాబు చర్యలు అవినీతి నిరోధక చట్టం కిందకు వస్తాయి. ఈ ఆధారాలన్నింటితో ఏసీబీ డీజీకి ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అందువల్ల ఈ ప్రైవేట్‌ ఫిర్యాదు దాఖలు చేస్తున్నా. దీన్ని విచారణకు స్వీకరించి, చంద్రబాబుపై విచారణ జరిపేలా ఏసీబీని ఆదేశించండి’’ అని నందమూరి లక్ష్మీపార్వతి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదు గురించి పత్రికల్లో వార్తా కథనాలు వచ్చాయి. వెంటనే చంద్రబాబు ఏసీబీ కోర్టులో ఇంప్లీడ్‌ పిటిషన్‌ దాఖలు చేసి, తన వాదనలు వినాలని కోరారు.

చంద్రబాబు అభ్యర్థనను న్యాయస్థానం తోసిపుచ్చింది. దీంతో చంద్రబాబు వెంటనే హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. క్రిమినల్‌ పిటిషన్‌ కాకుండా అధికరణ 226 కింద రిట్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన అప్పటి న్యాయమూర్తి జస్టిస్‌ డీఎస్‌ఆర్‌ వర్మ ఏసీబీ కోర్టులో లక్ష్మీపార్వతి ఫిర్యాదుపై తదుపరి చర్యలన్నింటినీ నిలిపేస్తూ 2005 మార్చిలో ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులను ఎత్తివేయాలని కోరుతూ లక్ష్మీపార్వతి పిటిషన్‌ దాఖలు చేశారు. అప్పటి న్యాయమూర్తి జస్టిస్‌ వంగా ఈశ్వరయ్య ఈ పిటిషన్‌ను కొట్టివేశారు. దీంతో అప్పటి నుంచి స్టే కొనసాగుతూ వస్తోంది.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top