
PC: BCCI/IPL.com
ఐపీఎల్-2025లో టీమిండియా స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్, లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ రిషబ్ పంత్ తన పేలవ ప్రదర్శన కొనసాగిస్తున్నాడు. ఆదివారం ధర్మశాల వేదికగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ పంత్ తీవ్ర నిరాశపరిచాడు. కీలక సమయంలో క్రీజులోకి వచ్చిన పంత్ కేవలం 18 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు.
ఈ ఏడాది సీజన్‌లో ఒక్క హాఫ్ సెంచరీ మినహా.. మిగితా ఏ మ్యాచ్‌లోనూ పంత్ చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు. ఐపీఎల్-2025 వేలంలో రికార్డు ధరకు అమ్ముడైన.. తన ప్రైస్ ట్యాగ్‌కు ఏ మాత్రం న్యాయం చేయలేకపోతున్నాడు. ఇప్పటివరకు 10 మ్యాచ్‌లు ఆడిన పంత్.. 12.80 సగటుతో 128 పరుగులు మాత్రమే చేయగల్గాడు. ఈ క్రమంలో రిషబ్ పంత్‌కు భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ కీలక సూచనలు చేశాడు. ఈ గడ్డు పరిస్థితుల్లో పంత్ తన ఆరాధ్య క్రికెటర్ ఎంఎస్ ధోనితో మాట్లాడాలని సెహ్వాగ్ సూచించాడు.
"పంత్ ఈ సమయంలో తను ఆరాధించే క్రికెటర్లతో ఓ సారి మాట్లాడితే బాగుంటుంది. అతడికి సలహాలు ఇచ్చేందుకు చాలా మంది క్రికెటర్లు ఉన్నారు. ఎంస్ ధోని.. అతడి రోల్ మోడల్ ఉన్న విషయం అందరికి తెలిసిందే. కాబట్టి ధోనికి ఓసారి కాల్ చేస్తే బెటర్‌గా ఉంటుంది. ధోనితో మాట్లాడితే పంత్ కచ్చితంగా తన ఫామ్‌ను తిరిగి అందుకుంటాడు.
అదేవిధంగా రిషబ్ పంత్ గతంలో ఐపీఎల్‌లో అద్బుతంగా ఆడిన తన వీడియోలను చూడాలి నేను భావిస్తున్నాను. ఎందుకంటే అది అతడి ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది. ప్రస్తుత రిషబ్ పంత్ గాయపడటానికి ముందు మనం చూసిన దానికి పూర్తి భిన్నంగా ఉన్నాడు. నా కెరీర్‌లో కూడా 2006-07 సమయంలో ఇటువంటి పరిస్థితులనే ఎదుర్కొన్నాను.
నన్ను జట్టు నుంచి పక్కన పెట్టారు కూడా. ఆ సమయంలో రాహుల్ ద్రవిడ్ నన్ను నా పాత వీడియోలను చూడమని సలహా ఇచ్చాడు. గతంలో ఎలా ఆడానో ఓ సారి పరిశీలించుకున్నాను. దీంతో నా రిథమ్‌ను తిరిగి పొందాను. పంత్ విషయంలో కూడా ఇదే జరగొచ్చు" అని క్రిక్‌బజ్ లైవ్ షోలో సెహ్వాగ్ పేర్కొన్నాడు.
చదవండి: ఏం ఆడుతున్నార్రా బాబూ! గుడ్లు ఉరిమి చూసిన రియాన్.. ఒక్క చూపుతోనే..