IPL 2025: ఈ పంత్‌ మనకొద్దు, పీకి పడేయండి సార్‌..! విసుగెత్తిపోయిన లక్నో అభిమానులు | IPL 2025, PBKS VS LSG: Sanjiv Goenka Resigned Look After Rishabh Pant Bizarre Dismissal, As Merciless Fans Call For Sacking Of LSG Captain | Sakshi
Sakshi News home page

IPL 2025: ఈ పంత్‌ మనకొద్దు, పీకి పడేయండి సార్‌..! విసుగెత్తిపోయిన లక్నో అభిమానులు

Published Mon, May 5 2025 12:31 PM | Last Updated on Mon, May 5 2025 2:04 PM

IPL 2025, PBKS VS LSG: Sanjiv Goenka Resigned Look After Rishabh Pant Bizarre Dismissal, As Merciless Fans Call For Sacking Of LSG Captain

Photo Courtesy: BCCI

ప్రస్తుత ఐపీఎల్‌ సీజన్‌లో లక్నో సూపర్‌ జెయింట్స్‌ కెప్టెన్‌ రిషబ్‌ పంత్‌ దారుణ ప్రదర్శన కొనసాగుతుంది. ఈ సీజన్‌లో అతను ఇప్పటివరకు ఆడిన 11 మ్యాచ్‌ల్లో ఒకే ఒక హాఫ్‌ సెంచరీ సాయంతో 128 పరుగులు (99.22 స్ట్రయిక్‌ రేట్‌తో) మాత్రమే చేశాడు. నిన్న (మే 4) పంజాబ్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో 17 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌ సాయంతో 18 పరుగులు చేసి అసాధారణ రీతిలో ఔటయ్యాడు.

అజ్మతుల్లా బౌలింగ్‌లో ముందుకు వచ్చి భారీ షాట్‌కు ప్రయత్నించగా.. బ్యాట్‌ ఓ పక్క, బంతి ఓ పక్క గాల్లోకి లేచాయి. శశాంక్‌ సింగ్‌ క్యాచ్‌ పట్టడంతో పంత్‌ నిరాశగా పెవిలియన్‌కు వెనుదిరిగాడు. పంత్‌ విచిత్ర రీతిలో ఔటైన అనంతరం లక్నో ఓనర్‌ సంజీవ్‌ గొయెంకా కూడా చాలా దిగాలుగా, కోపంగా కనిపించాడు. 

ఈ పంత్‌ ఇక​ మారడా అన్నట్లు హావభావాలు పెట్టాడు. గొయెంకా ఎక్స్‌ప్రెషన్స్‌ను సోషల్‌మీడియాలో అభిమానులు మీమ్స్‌గా వాడుకుంటున్నారు. గొయెంకా ఓపిక నశించింది. ఇక పంత్‌కు బడిత పూజే అంటూ కామెంట్స్‌ పెడుతున్నారు.

మరోవైపు పంత్‌ వరుస వైఫల్యాల నేపథ్యంలో లక్నో అభిమానులు విసుగెత్తిపోయారు. ఈ పంత్‌ మనకొద్దు, తక్షణమే జట్టు నుంచి తొలగించండంటూ లక్నో ఓనర్‌ సంజీవ్‌ గొయెంకాను అభ్యర్థిస్తున్నారు. పంత్‌పై రూ. 27 కోట్ల పెట్టుబడి సుద్ద దండగ అని​ కామెంట్లు చేస్తున్నారు.  

కాగా, ఈ సీజన్‌ మెగా వేలంలో లక్నో సూపర్‌ జెయింట్స్‌ పంత్‌ను రూ. 27 కోట్లకు కొనుగోలు చేసింది. ఐపీఎల్ చరిత్రలోనే ఖరీదైన ఆటగాడిగా పంత్‌ రికార్డుల్లోకెక్కాడు. అయితే ఈ సీజన్‌లో పంత్‌ తీసుకున్న డబ్బుకు కనీస న్యాయం కూడా చేయలేకపోతున్నాడు. ప్రతి మ్యాచ్‌లో ఘెరంగా విఫలమై అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేస్తున్నాడు. 2016లో అరంగేట్రం చేసిన తర్వాత ఐపీఎల్‌లో పంత్‌ ఇంత ఘోరమైన ప్రదర్శనలు ఎప్పుడూ చేయలేదు.

ఈ సీజన్‌లో పంత్‌ కెప్టెన్‌గానూ పెద్దగా ప్రభావం చూపలేకపోతున్నాడు. తొలి 6 మ్యాచ్‌ల్లో టాపార్డర్‌ ఆటగాళ్లు చెలరేగడంతో లక్నో 4 విజయాలు సాధించింది. అయితే గడిచిన ఐదు మ్యాచ్‌ల్లో టాపార్డర్‌ అంతంతమాత్రంగా ఆడుతుండటంతో పంత్‌ కెప్టెన్సీ లోపాలు బయటపడ్డాయి. చివరి ఐదు మ్యాచ్‌ల్లో లక్నో నాలుగింట ఓడింది. 

పంత్‌ జట్టును గెలిపించే ఒక్క మంచి నిర్ణయం కూడా తీసుకోలేకపోయాడు. పైగా బ్యాటింగ్‌ ఆర్డర్‌లో తనను తాను వెనక్కు పంపుకోవడం లాంటి చెత్త నిర్ణయాలు తీసుకున్నాడు. ఛాంపియన్‌ జట్టుకు కావాల్సిన అన్ని వనరులు ఉన్నా పంత్‌ సద్వినియోగం చేసుకోలేకపోతున్నాడు.

వ్యక్తిగతంగా, కెప్టెన్‌గా ఇంతలా విఫలమవుతున్న పంత్‌పై యజమానిగా గొయెంకాకు కోపం రావడం సహజమే. పైగా పంత్‌ కోసం అతను కేఎల్‌ రాహుల్‌ లాంటి గొప్ప ప్లేయర్‌ను కాదనుకున్నాడు. లక్నో అభిమానుల బాధలోనూ అర్దముంది. జట్టు బాగాలేకపోతే ఏదో  అనుకునే వారు. అన్నీ బాగున్నా జట్టును విజయపథంలో నడిపించలేకపోతే అది కెప్టెన్‌ వైఫల్యమే అవుతుంది. అందుకే వారు ఈ స్థాయిలో పంత్‌పై రియాక్ట్‌ అవుతున్నారు. 

కాగా,  నిన్న (మే 4) రాత్రి జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్‌ జెయింట్స్‌పై పంజాబ్‌ కింగ్స్‌ 37 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన పంజాబ్‌.. ఓపెనర్‌ ప్రభ్‌సిమ్రన్‌ సింగ్‌ (48 బంతుల్లో 91; 6 ఫోర్లు, 7 సిక్సర్లు) రెచ్చిపోవడంతో 5 వికెట్ల నష్టానికి 236 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. 

అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన లక్నో.. టాపార్డర్‌ ఘోరంగా విఫలం కావడంతో లక్ష్యాన్ని ఛేదించలేకపోయింది.  ఆయుశ్‌ బదోని (40 బంతుల్లో 74; 5 ఫోర్లు, 5 సిక్సర్లు), అబ్దుల్‌ సమద్‌ (24 బంతుల్లో 45; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) ప్రతిఘటించడంతో ఆ జట్టు నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేయగలిగింది.

ఈ ఓటమితో లక్నో ప్లే ఆఫ్స్‌ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. లక్నో ఇకపై ఆడాల్సిన మూడు మ్యాచ్‌లు గెలిచినా ఇతర జట్ల జయాపజయాలపై వారి ఫేట్‌ ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం లక్నో రన్‌ రేట్‌ (-0-469) కూడా చాలా తక్కువగా ఉంది. ప్లే ఆఫ్స్‌ రేసులో ఉన్న జట్లలో ఈ ఒక్క జట్టు రన్‌రేట్‌ మాత్రమే మైనస్‌లో ఉంది. 

లక్నో ఒక వేళ మూడు మ్యాచ్‌లు గెలిచినా ప్లే ఆఫ్స్‌ బెర్త్‌ దక్కాలంటే భారీ తేడాతో గెలవాలి. ప్రస్తుతం ఆ జట్టు ఖాతాలో 10 పాయింట్లు (11 మ్యాచ్‌ల్లో 5 విజయాలు) ఉన్నాయి. పంజాబ్‌ చేతిలో ఓటమితో పాయింట్ల పట్టికలో ఏడో స్థానానికి పడిపోయింది. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement