
మట్టిదందా.. కాసులపంట
సాక్షి, పెద్దపల్లి: నాణ్యమైన ఇటుక తయారీకి చెరువు మట్టి అవసరం. దీంతోనే పంట చేలకు చేరాల్సిన మట్టి ఇటుకబట్టీలకు వెళ్తోంది. ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చేలా కలెక్టర్ కొత్తమట్టి పాలసీ తీసుకొచ్చినా.. కొందరు అధికారులు, మట్టి నిర్వాహకులతో కలిసి దందాకు తెరతీశారు. సర్కారు ఖజానాకు గండికొడుతున్నారు. ఏటా వేసవిలో చెరువులు వట్టిపోయాక ఇటుక బట్టీ వ్యాపారులు మాఫియా అవతారం ఎత్తి, మైనింగ్, ఇరిగేషన్, రెవెన్యూ అధికారులను మామూళ్ల మత్తులో ముంచుతున్నారు. పెద్దఎత్తున మట్టి అక్రమంగా తరలించుకుపోతున్నారనే ఆరోపణలున్నాయి.
సీజ్ చేసినా.. కాసులు కురిస్తున్నాయి..
నిబంధనల ప్రకారం చెరువుల్లో మట్టి తీసేందుకు ప్రభుత్వానికి రాయల్టీ చెల్లించాలి. అనుమతి పొందాక మట్టి తీయాలి. కానీ చాలామంది ఇటుకబట్టీ నిర్వాహకులు అనుమతి గోరంత తీసుకొని.. కొండంత తవ్వుకుపోతున్నారు. స్థానికుల ఫిర్యాదుతో ఏదోఓచోట మట్టికుప్పలు అధికారులు సీజ్ చేయడం, జరిమానా పేరిట పెనాల్టీ తీసుకుని మట్టి తరలింపునకు అనుమతి ఇవ్వడం జిల్లాలో పరిపాటిగా మారిందనే ఆరోపణలు వస్తున్నాయి.
మట్టితీతకు చెరువుల గుర్తింపు
పెద్దపల్లి, రాఘవాపూర్, రంగంపల్లి, రామగిరి, కమాన్‌పూర్, రామగుండం, ధర్మారం, సుల్తానాబాద్, కాట్నపల్లి తదితర ప్రాంతాల్లో 160కిపైగా ఇటుక బట్టీలు ఉన్నాయి. వీటిద్వారా ఏటా రూ.కోట్ల వ్యాపారం సాగుతోంది. హైదరాబాద్, వరంగల్, మంచిర్యాల తదితర ప్రాంతాలకు ఇక్కడి నుంచి ఇటుక సరఫరా అవుతూ ఉంటుంది. ఇటుక తయారీకి అవసరమయ్యే నల్లరేగడి మట్టి చెరువుల్లో లభిస్తుంది. దీనిని ఏటా వేసవిలో రాజకీయ పార్టీల అండతో అక్రమార్కులు తరలించుకుపోతున్నారు. ఇటుకబట్టీల యజమానులు, ఇతరుల పేరిట అనుమతి తీసుకుని కొంతమొత్తంలో రాయల్టీ, సీనరేజీ చెల్లించి పెద్దఎత్తున మట్టి తరలిస్తున్నారు. ఇటుకబట్టీ యజమానులు కొందరు తమకు అవసరమయ్యే మట్టిని తీసుకోవడంతోపాటు ఇతరులరులకూ విక్రయిస్తూ రూ.లక్షలు ఆర్జిస్తున్నారు. ఈనేపథ్యంలో మైనింగ్, రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు ఈఏడాది జిల్లాలోని 14 చెరువుల్లో 3.8లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి తరలించేందుకు అవకాశం ఉందని గుర్తించారు. నీటిమట్టం తగ్గిన తర్వాత తవ్వకానికి అనుమతి ఇస్తారు.
మట్టి కావాలా? సర్‌ను కలవండి
జిల్లాలో సుమారు 160 ఇటుకబట్టీలున్నాయి. జిల్లాలో తయారీ చేసిన ఇటుకలకు రాష్టవ్యాప్తంగా డిమాండ్ ఉంది. దీంతో ఆయా బట్టీల నిర్వాహకులు ఇటుకల తయారీ కోసం చెరువుల్లో మట్టి తవ్వకాలకు అనుమతి తీసుకుంటారు. ఇదేఅదనుగా ఓ అధికారి తన కార్యాలయంలోని ఒక వ్యక్తిని ఏజెంట్‌గా నియమించుకుని ఇటుకబట్టీ నిర్వాహకులకు ఫోన్ చేయిస్తున్నట్లు సమాచారం. ‘మీకు మట్టి కావాలంటే సర్‌ను కలవండి’అంటూ ఫోన్‌లు చేయిస్తుండడం, దీంతో వచ్చి కలిసిన వారికి అనుమతి కట్టబెట్టేందుకు ప్రయత్నాలు చేస్తుండటంపై విమర్శలు వస్తున్నాయి. ఒకవైపు కలెక్టర్ కొత్తగా మట్టి పాలసీని తీసుకురాగా.. దానికి సంబంధం లేకుండానే సీజ్‌చేసిన మట్టికుప్పలకు అనుమతి పేరిట అక్రమంగా తరలించేందుకు తెరతీశారు. దీంతో ప్రభుత్వా ఆదాయానికి రూ.కోటికి పైగా గండిపడిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ విషయంపై సంబంధిత శాఖ అధికారులను సంప్రదిస్తే.. నిబంధనలు అతిక్రమించే వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
చెరువు మట్టిపై అక్రమార్కుల కన్ను కాసులు కురిపిస్తున్న సీజ్‌చేసిన మట్టి పర్యవేక్షణ కరువు.. అడ్డగోలు తరలింపు ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి
ఇది కొత్తపల్లి చెరువు మట్టికుప్ప. 2023లో అధికారులు సీజ్ చేశారు. దీని విలువ దాదాపు రూ.18లక్షల వరకు ఉంటుంది. అధికారులు అనుమతి ఇవ్వకుండానే అక్రమార్కులు తరలిస్తున్నారు. దీనిపై మైనింగ్ అధికారులకు ఫిర్యాదులు అందినా పట్టించుకోలేదు. దీంతో ఆర్డీవోకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన అధికారులు.. మట్టి తరలింపును అడ్డుకుని తూకం వేయించారు. వారంరోజుల తర్వాత చూస్తే అక్కడ మట్టికుప్పే కనిపించలేదు.
నిబంధనలు అతిక్రమించి రాఘవాపూర్ చెరువులోంచి తీసిన మట్టికుప్పలు ఇవి. 2023లో అధికారులు సీజ్ చేశారు. ఒకటి దాదాపు 20వేల మెట్రిక్ టన్నులు, మరోటి 19,361 మెట్రిక్ టన్నుల వరకు ఉంటుందని నిర్ధారించారు. ఇక్కడే అక్రమార్కులు, అధికారులు ఒక్కటయ్యారు. రెండింటిలో ఒకమట్టి కుప్పకు అనుమతి తీసుకోని రెండింటినీ తరలిస్తున్నారు. అనుమతి తీసుకోకుండా ఇప్పటికే దాదాపు 20 వేల మెట్రిక్ టన్నులు తీసుకెళ్లారు. అధికారులు చెబుతున్న 19వేల మెట్రిక్ టన్నుల ఇంకో మట్టి కుప్పను తరలించేందుకు సిద్ధమయ్యారు. వాస్తవంగా ఇది 30వేల మెట్రిక్ టన్నులు ఉండాలి. కానీ, నామ్‌కే వాస్తేగా రూ.7,74,440 జరిమానా విదించి తరలించేందుకు అనుమతి ఇచ్చారు. ఈతతంగంలో పెద్దఎత్తున డబ్బులు చేతులు మారినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈఒక్కఘటనలో ప్రభుత్వానికి సుమారు రూ.25లక్షలు నష్టం వాటిల్లినట్లు సమాచారం.

మట్టిదందా.. కాసులపంట

మట్టిదందా.. కాసులపంట

మట్టిదందా.. కాసులపంట

మట్టిదందా.. కాసులపంట