
భర్తపై వేధింపుల కేసు నమోదు
ముద్దనూరు : మండలంలోని పెనికలపాడు గ్రామానికి చెందిన నాగవేణి అనే మహిళ తన భర్త వేధిస్తున్నాడని ఫిర్యాదు చేయడంతో శనివారం పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్‌ఐ మైనుద్దీన్ సమాచారం మేరకు నాగవేణికి కడపకు చెందిన వెంకటసుబ్బయ్యతో 13 ఏళ్ల క్రితం వివాహమైంది. మద్యానికి బానిసైన అతను గత 2 సంవత్సరాల నుంచి భార్యను శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నాడు. వేధింపులు భరించలేని నాగవేణి ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో
సెక్యూరిటీ గార్డు మృతి
కమలాపురం : కడప–తాడిపత్రి ప్రధాన రహదారిలో మండలంలోని టి. చదిపిరాళ్ల వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో కమలాపురం పట్టణం రాం నగర్‌కు చెందిన ముద్దల బాలాజీ (29) అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు తెలిపిన సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. మృతుడు మండలంలోని భారతి సిమెంట్ ఫ్యాక్టరీలో సెక్యూరిటీ గార్డుగా విధులు నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాడు. శనివారం బాలాజీ తన విధులు ముగించుకుని ఇంటికి వస్తున్న క్రమంలోమార్గ మధ్యంలో టి.చదిపిరాళ్ల వద్దకు రాగానే కమలాపురం నుంచి ఎర్రగుంట్ల వైపు వెళ్తున్న లారీ బలంగా ఢీ కొంది. ఈ ఘటనలో తలకు బలమైన గాయం కావడంతో బాలాజీ అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న ఎస్‌ఐ విద్యా సాగర్ ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. శవ పంచనామా నిర్వహించి పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహాన్ని రిమ్స్‌కు తరలించారు. మృతుని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. కాగా మృతునికి భార్య, ఇద్దరు చిన్న వయస్సు గల కుమార్తెలు ఉన్నారు. కుటుంబ సభ్యులు శోక సంద్రంలో మునిగిపోయారు. బాలాజీ మృతితో కాలనీలో విషాద ఛాయలు అలుముకున్నాయి.