
21 నుంచి సీపీఐ జిల్లా మహాసభలు
వేంపల్లి : బద్వేలులో ఈ నెల 21 నుంచి 23 వరకు జరగనున్న సీపీఐ 25వ జిల్లా మహాసభల జయప్రదానికి అన్ని వర్గాల ప్రజలు సహకరించాలని సీపీఐ జిల్లా కార్యదర్శి గారి చంద్ర కోరారు. గురువారం స్థానిక ఎస్టీయూ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) 1925 డిసెంబర్ 26న కాన్పూర్‌లో ఆవిర్భవించి 2025 డిసెంబర్ 26 నాటికి వందేళ్లు పూర్తి చేసుకుని శత జయంతి ఉత్సవాలు నిర్వహించుకోబోతోందన్నారు. పాలక ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై, జిల్లా సమగ్ర అభివృద్ధి సాధనే లక్ష్యంగా సీపీఐ పోరాడుతోందన్నారు. కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన ఎన్‌డీఏ 2014 ఎన్నికల్లో నల్లధనం వెలికితీత, పన్నుల భారం తగ్గింపు, ధరల నియంత్రణ, ప్రతి అకౌంట్లో లక్షల డబ్బు జమ, ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాల కల్పన వంటి వాగ్దానాలు ఇచ్చిందన్నారు. వాటి అమలులో వైఫల్యాన్ని సీపీఐ ఎండగడుతోందన్నారు. సంపద సృష్టిలో భాగస్వాములైన కార్మికులు, కర్షకులను దోపిడీ చేసే చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తోందన్నారు. విభజన హామీలైన రాష్ట్రానికి ప్రత్యేక హోదా, వెనకబడిన రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ, జాతీయ హోదా కలిగిన పోలవరం పూర్తికి నిధులు, కడపలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు, ఆర్థిక లోటు భర్తీ, విద్యా, వైద్య సంస్థల సాధనకై దశల వారీ పోరాటాలను సాగిస్తోందన్నారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు సుబ్రహ్మణ్యం, సీపీఐ పులివెందుల ఏరియా కార్యదర్శి వెంకట రాములు, ఏరియా సహాయ కార్యదర్శి బ్రహ్మం, వేంపల్లి మండల కార్యదర్శి అంజనప్ప, తదితరులు పాల్గొన్నారు.