
బాలల రక్షణకు సమన్వయంతో పనిచేయాలి
– ఐసీడీఎస్ పీడీ శ్రీలక్ష్మి
కడప కోటిరెడ్డిసర్కిల్ : మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో మిషన్ వాత్సల్య పథకంలో భాగంగా బాలల సంరక్షణ లోకీలకంగా వ్యవహరించే తహసీల్దార్లు, మండల అభివృద్ధి అధికారులు, బాలల సంక్షేమ పోలీసు అధికారులు, ఎంఈఓలు సమన్వయంతో పనిచేయాలని ఐసీడీఎస్ పీడీ దేవిరెడ్డి శ్రీలక్ష్మి తెలిపారు. బుధవారం కలెక్టరేట్‌లోని సభా భవనంలో బాలల రక్షణలో భాగస్వాముల పాత్రపై వర్క్‌షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పిల్లలకు మానవీయ దృక్పథంతో సేవలు అందించాలన్నారు. బాల్య వివాహాల నిరోధంలో తహసీల్దార్లు సహకరించాలన్నారు. సంక్షేమ పథకాల అమలులో ఎంపీడీఓల పాత్ర ప్రధానమన్నారు. అనంతరం వర్క్‌షాప్‌లో పాల్గొన్న వారికి మహిళా శిశు సంక్షేమశాఖ తరుపున శ్రీలక్ష్మి సర్టిఫికెట్లు అందజేశారు. కార్యక్రమంలో స్టెప్ సీఈఓ సాయిగ్రేస్‌తోపాటు పలువురు పోలీసు అధికారులు, ఐసీడీఎస్ అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, సిబ్బంది పాల్గొన్నారు.