
ఉమ్మడి కడప జిల్లా స్థాయి బ్యాడ్మింటన్ ఎంపికలు
కడప ఎడ్యుకేషన్ : ఉమ్మడి కడప జిల్లా స్థాయి బ్యాడ్మింటన్ ఎంపికలు ఈనెల 12, 13 తేదీలలో నిర్వహించనున్నట్లు బ్యాడ్మింటన్ అసోసియేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ సింగం భాస్కర్ రెడ్డి, సెక్రటరీ పి. శ్రీనివాసులరెడ్డి తెలిపారు. జూలై 12వ తేదీ రెండవ శనివారం కడప డీఎస్‌ఏ ఇండోర్ స్టేడియంలో అండర్ 15, అండర్ 17 విభాగాలకు చెందిన బాల బాలికల ఎంపికలు జరుగుతాయన్నారు. అలాగే 13వ తేదీ ఆదివారం ప్రొద్దుటూరు జార్జ్ క్లబ్‌లో అండర్ 11, అండర్ 13 బాలబాలికలకు ఎంపికలు ఉంటాయన్నారు. ఈనెల 10వ తేదీ సాయంత్రం లోపు 9440107080 లేదా 9440223908 నంబర్‌కు ఎంట్రీలను పంపాలని అసోసియేషన్ చైర్మన్ బాషా కోరారు.
రోడ్డు ప్రమాదంలో
గాయపడిన వ్యక్తి మృతి
మైదుకూరు/బి.కోడూరు : రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ బి.కోడూరు మండలం గుంతపల్లెకు చెందిన గుంత జయరామిరెడ్డి (42) అనే వ్యక్తి మంగళవారం మృతి చెందాడు. మృతుడి కుటుంబ సభ్యులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. గుంతపల్లెకు చెందిన జయరామిరెడ్డి జూన్ 29న ఖాజీపేట మండలం శ్రీనివాసపురం గ్రామంలోని బంధువుల ఇంటికి వచ్చాడు. అదే రోజు ఆయన శ్రీనివాసపురం గ్రామానికి చెందిన తన బంధువు కొండా వెంకట రమణారెడ్డితో కలిసి మైదుకూరుకు వస్తున్నారు. జాతీయ రహదారి సర్వాయపల్లె అండర్ పాస్ వద్ద సిమెంట్ మిక్చర్ వాహనం వారిని ఢీ కొంది. సంఘటనలో జయరామిరెడ్డి, వెంకటరమణారెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. ప్రాథమిక చికిత్స అనంతరం వారిని మెరుగైన చికిత్స కోసం కర్నూలుకు తరలించారు. కర్నూలులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో కొండా వెంకటరమణారెడ్డి చికిత్స పొందుతున్నాడు. కర్నూలు ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతూ జయరామిరెడ్డి మంగళవారం మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
బైకుల దొంగ అరెస్టు
యశవంతపుర : అతని కన్ను పడితే ఎలాంటి బైక్ అయినా మాయం అవుతుంది. ఘరానా ద్విచక్ర వాహనాల దొంగను బెంగళూరు హెచ్‌ఏఎల్ పోలీసులు అరెస్ట్ చేసి రూ. 40 లక్షల విలువగల 32 బైక్‌లను సీజ్ చేశారు. అన్నమయ్య జిల్లా మదనపల్లెకి చెందిన హేమంత్ (23) నిందితుడు. ఇటీవల విభూతిపురలో జరిగిన బైకు చోరీ కేసులో విచారించి మదనపల్లి మొయిన్‌రోడ్డులో నివాసం ఉంటున్న హేమంత్‌ను అరెస్ట్ చేశారు. హొసకోట, విజయపురలోనూ బైకులను చోరీ చేశాడు. 20 బైకులను మదనపల్లెలోని తన స్నేహితులకు అమ్మినట్లు పోలీసులు తెలిపారు. మిగిలిన బైకులను మదనపల్లె మెయిన్ రోడ్డులోని ఖాళీ జాగాలో దాచి ఉంచాడు. వాటిని స్వాధీనం చేసుకుని తరలించారు.
రోడ్డు ప్రమాదంలో
యువకునికి తీవ్ర గాయాలు
కలికిరి : తిరుపతి–మదనపల్లి జాతీయ రహదారిలో వాల్మీకిపురం మండల పరిధిలోని గండబోయనపల్లి సమీపంలో గల టోల్‌గేట్ వద్ద మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాలు.. కలికిరి గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎల్లయ్య కుమారుడు వినేష్ సొంత పనుల నిమిత్తం మదనపల్లికి వెళ్లి తిరిగి వస్తున్నాడు. గండబోయనపల్లి సమీపంలోని టోల్‌గేటు వద్ద కర్ణాటకకు చెందిన కెఎ36ఎం 9619 తూఫాన్ వాహనం వేగంగా వచ్చి ఢీకొంది. ప్రమాదంలో వినేష్‌కు తీవ్ర గాయాలు కాగా, తూఫాన్ వాహనం రోడ్డుపైన ఫల్టీ కొట్టింది.