కురబలకోట : అన్నమయ్య జిల్లా కురబలకోట మండలం చెన్నామర్రి మిట్ట వద్ద సోమవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదం పెను విషాదాన్ని మిగిల్చింది. కర్నాటక రాష్ట్రం బాగేపల్లెకు చెందిన మూడు కుంటుంబాల వారు డ్రైవర్‌తో కలిపి 15 మంది తిరుమల దైవ దర్శనానికి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో ట్రావెల్ టెంపోలో స్వగ్రామానికి వస్తుండగా మండలంలోని చెన్నామర్రి వద్ద ఎదురుగా వచ్చిన కంటైనర్ లారీ ఢీకొనడంతో ఈ ఘోరం జరిగింది. మేఘర్ష్ (16), చరణ్ (17), శ్రావణి (24) అక్కడికక్కడే విగత జీవులుగా మారారు. మరో పది మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో నరసింహారెడ్డి (49), రూప (40) ఆదర్స్ (19), రామంద్రప్ప (45), కళావతి (40), దర్సన్ (16), శివప్ప(42), సునందమ్మ (38) చైత్ర (19) తోపాటు ట్రావెల్ టెంపో ఢ్రైవర్ మంజునాధ (42) ఉన్నారు. అర్తనాదాలు, విలాపాలతో సంఘటన స్థలం శోకతప్తమైంది. విషాదంతో కర్నాటకలోని బాగేపల్లె, కొత్త ఉడుంపల్లె గొల్లు మన్నాయి.
పెనుప్రమాదం సంభవించడంతో కురబలకోట, మదనపల్లె ప్రాంతాలు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డాయి. మృతి చెందిన ముగ్గురి మృత దేహాలను మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. గాయపడిన వారిని 108 వాహనం, పోలీసు వాహనంలో తరలించారు. డ్రైవర్ మంజునాథ తీవ్రంగా గాయపడడంతో మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నారు. నరసింహారెడ్డి, శివప్ప కుటుంబాలకు చెందిన వారిని మెరుగైన వైద్యం కోసం కర్నాటక రాష్ట్రంలోని వివిధ ఆసుపత్రులకు తరలించారు. ఇదిలా ఉండగా ట్రావెలర్ టెంపోను ఢీకొని వెళ్లిపోయింది కంటైనర్ లారీగా గుర్తించారు. వాహనంతో పాటు డ్రైవర్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.
టాప్‌తో సహా లేచిపోయింది
ట్రావెలర్ టెంపో జరిగిన ప్రమాదం చూస్తే గండెలు తరుక్కుపోతాయి. ట్రావెలర్ టెంపో డ్రైవర్ పక్కగా ఎదురుగా వచ్చిన లారీ ఢీకొట్టడంతో అటు వైపు ఉన్న వారు ముగ్గురు చనిపోగా పది మంది తీవ్రంగా గాయపడ్డారు. లారీ వేగంగా ఢీ కొట్టడంతో టెంపో ట్రావెలర్ వాహనం టాప్ ఏమాత్రం లేకుండా లేచిపోయింది. సీట్లలోనే తీవ్ర గాయాలతో అంగలార్చడం చలింపజేసింది. మరికొందరు చెల్లా చెదురుగా రోడ్డుపై పడిపోయారు. సంఘటనఽ స్థలం రక్తసిక్తమంది. పోలీసులు సకాలంలో స్పందించారు. స్థానికులు కూడా సహాయక చర్యలతో మానవత్వాన్ని చాటుకున్నారు.
ఒక్కో కుటుంబలో ఒక్కరు..
మండలంలోని చెన్నామర్రి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక్కో కుటుంబానికి చెందిన ఒకరు మృతి చెందడం కలవరాన్ని కల్గిస్తోంది. బాగేపల్లె నుండి నరసింహారెడ్డి, రామచంద్రప్ప, శివప్ప కుటుంబాల వారు తిరుమల యాత్ర వెళ్లారు. నరసింహారెడ్డి కుటుంబంలో అతని కుమారుడు మేఘర్స్ (16), రామచంద్రప్ప కోడలు శ్రావణి (24), శివప్ప కుటుంబం నుండి చరణ్ (17) మృతి చెందారు. వీరిలో శ్రావణికి ఐదేళ్ల క్రితం వివాహమైంది. మిగిలిన వారు విద్యార్థులు.
అదృష్టవంతులు
ప్రమాదానికి గురైన ట్రావెలర్ టెంపో డ్రైవర్ మంజునాథ పక్క సీట్లో బాగేపల్లెకు చెందిన అశోక్ (32) కూర్చున్నాడు. ఇతని వెనుక సీట్లో బాగేపల్లె దగ్గరున్న ఎ. కొత్తపల్లెకు చెందిన ఏడో తరగతి విద్యార్థి హేమంత్ కూర్చున్నారు. ఇతను ఒక్కడే తిరుమల గుండు చేయించుకున్నారు. వీరు డ్రైవర్‌కు ఎడమ పక్కన సీట్లలో ఉండడం వల్ల పెను ప్రమాదం నుండి తప్పించుకున్నారు. 15 మందిలో వీరిద్దరికి రక్త గాయాలు కాలేదు. అంత ప్రమాదంలో వీరు బతికి బట్టకట్టడం అధృష్టమేనని చెబుతున్నారు.