
ప్రజాస్వామ్యానికి ‘కూటమి’ తూట్లు
పులివెందుల : రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యానికి తూట్లు పొడుస్తోందని కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి ధ్వజమెత్తారు. సోమవారం స్థానిక భాకరాపురంలోని తన స్వగృహంలో ఆయన మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన తొలి రోజు నుంచి కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామిలను తుంగలో తొక్కి కక్ష సాధింపు రాజకీయాలకు తెరలేపిందన్నారు. సాక్షాత్తూ ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న చంద్రబాబు నాయుడు పార్టీలకతీతంగా ప్రజలకు సేవ చేయాల్సిందిపోయి.. ఎట్టి పరిస్థితులలోనూ వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు పనిచేయవద్దని బహిరంగంగా చెప్పారని గుర్తు చేశారు. తమ ప్రభుత్వంలో పార్టీలకతీతంగా ప్రజలకు సంక్షేమ పథకాలు అందాయని పేర్కొన్నారు. పార్టీలనేవి కేవలం ఎన్నికల వరకేనని తర్వాత ప్రజలందరూ ప్రజాస్వామ్య ప్రభుత్వంలో భాగమేనని గట్టిగా నమ్మిన నాయకుడు వైఎస్ జగన్ అని కొనియాడారు. అనంతరం ఆయన ప్రజా దర్బార్ నిర్వహించారు.
ఉపాధి హామీ పథకం నిర్వీర్యం
కూటమి ప్రభుత్వంలో ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేస్తున్నారని ఎంపీ అవినాష్‌రెడ్డి విమర్శించారు. సోమవారం కొంతమంది ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు ఎంపీని కలిశారు. తమను అకారణంగా తొలగిస్తున్నారని ఆయన దృష్టికి తెచ్చారు. దీనిపై ఎంపీ మాట్లాడుతూ ఈ ప్రభుత్వంలో ఉపాధి హామీ పథకం ఉనికి కోల్పోయే ప్రమాదం ఏర్పడిందన్నారు. ఆ పథకంలో అవినీతికి అంతులేకుండా పోయిందని.. కూలీలతో చేయించాల్సిన పనులను మిషన్ల ద్వారా కొద్ది గంటలు మాత్రమే చేయించి బిల్లులు చేసుకుంటున్నారని ఆరోపించారు. ఫీల్డ్ అసిస్టెంట్ల తొలగింపుపై న్యాయ పోరాటం చేస్తామని వారికి భరోసా ఇచ్చారు.
వ్యవస్థలను దిగజారుస్తున్న ప్రభుత్వం
కూటమి ప్రభుత్వం వ్యవస్థలను దిగజారుస్తోందని ఎంపీ మండిపడ్డారు. ఇటీవల పులివెందులలో టీడీపీ తోరణాలు తొలగించారన్న కారణంతో మైనర్ బాలురులపై పోలీసులు హత్యాయత్నం కేసు పెట్టడాన్ని తప్పుబట్టారు. బెయిల్‌పై వచ్చిన మైనర్ బాలురు, వారి కుటుంబ సభ్యులు ఎంపీని కలిశారు. ఈ సందర్భంగా ఎంపీ వారితో మాట్లాడుతూ పిల్లలు చదువుపై దృష్టి సారించాలని, మీకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామన్నారు. టీడీపీ నాయకులు పోలీసుల ద్వారా మైనర్ బాలురపై అక్రమ కేసు పెట్టడం నీచమైన చర్య అని మండిపడ్డారు. ఇలాగే అక్రమ కేసు ఎదుర్కొన్న మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్‌తోపాటు ఇతర నాయకులకు ఆయన మనో ధైర్యం చెప్పారు. అన్ని విధాలుగా పార్టీ అండగా ఉంటుందన్నారు.
ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి