
ఉద్యోగాల పేరుతో మోసం
కడప అర్బన్ : జిల్లాలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, కస్తూర్బా కళాశాలల్లో కేరీర్ కౌన్సెలింగ్ డెవలప్‌మెంట్ అధికారి(సీసీడీఓ) పేరిట ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయంటూ కడపకు చౌటుపల్లె రోడ్డులో నివాసముంటున్న రవి అలియాస్ రఫి కొంతమంది నిరుద్యోగులను నమ్మ బలికించాడు. ఒక్కో నిరుద్యోగి వద్ద నుంచి రూ.5 లక్షల నుంచి 6.50 లక్షల వరకు వసూలు చేశాడని బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ సందర్భంగా బాధితులు రవి అలియాస్ రఫీ నివసిస్తున్న ఇంటి వద్ద ఆదివారం ఉదయం ఆందోళన చేపట్టారు. బాధితులు మాట్లాడుతూ రవి అలియాస్ రఫీ తమకు ఉద్యోగాలను ఇప్పిస్తామంటూ ఒకొక్కక్కరి దగ్గరి నుంచి రూ. 6:50 లక్షలను తీసుకున్నాడన్నారు. నిరుద్యోగులైన తమకు ఉద్యోగం వస్తే అప్పు ఎలాగైనా తీర్చుకోవచ్చనే ధైర్యంతో తొలుత కొందరు డబ్బులిచ్చి ఉద్యోగాల్లో చేరారన్నారు. సంబంధిత అధికారి సంతకం చేసిన నియామక ఉత్తర్వులను తీసుకుని 2024 ఆగస్టులో ఉద్యోగాల్లో చేరారన్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు వెళ్లగా అక్కడున్న అధికారులు కూడా తమను ఉద్యోగాల్లో చేర్చుకున్నారని వారు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 21 మంది ఉద్యోగాల్లో చేరామన్నారు. మూడు నెలల పాటు పని చేశామన్నారు. తరువాత ఉన్నతాధికారులు నిర్వహించిన తనిఖీల్లో తమ నియామకాలు చెల్లవంటూ రద్దు చేసి ఇళ్లకు పంపించారన్నారు. తాము డబ్బులిచ్చిన రవి అలియాస్ రఫిని ప్రశ్నించగా తాను కూడా గుంటూరుకు చెందిన వలీ అనే వ్యక్తికి ఇచ్చానని చెప్పాడు. దీంతో బాధితులు జమ్మలమడుగు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా పోలీసులు రవి అలియాస్ రఫీపై చీటింగ్ కేసు నమోదు చేశారు. బాధితులు ఏజెంట్ రవి ఇంటి వద్ద ఆందోళన చేస్తుండగా తాలూకా ఎస్‌ఐ తులసి నాగ ప్రసాద్ సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఏదైనా ఉంటే పోలీసులకు ఫిర్యాదు చేయాలని జమ్మలమడుగులో రవిపై కేసు నమోదైందని, చట్టపరమైన చర్యలు తీసుకుంటారని ఆందోళన విరమించాలని చెప్పడంతో బాధితులు ఆందోళన విరమించారు. ఈ విషయంపై ఏజెంట్ రవిని వివరణ కోరగా తనకు రూ.80 లక్షలు డబ్బులు రావాలన్నారు. ఇప్పుడు తనపై ఒత్తిడి తెస్తే, తన వద్ద నుంచి డబ్బులు తీసుకున్న వారు పారిపోతారని తెలిపారు.
ఖాళీ బిందెలతో మహిళల నిరసన
సిద్దవటం : మండలంలోని మాధవరం–1 గ్రామ పంచాయతీ పరిధిలోని వెంకటేశ్వరపురంలో నెలకొన్న తాగునీటి సమస్యను పరిష్కరించాలని అధికారులను కోరినా స్పందించలేదని గ్రామ మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆదివారం వారు ఖాళీ బిందెలతో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం స్థానిక మహిళలు మాట్లాడుతూ గత రెండు వారాలుగా తాగునీరు రావడం లేదన్నారు. సుదూర ప్రాంతాలకు వెళ్లి తాగునీరు తెచ్చుకుంటున్నామన్నారు. ఉన్నతాధికారులు తమ సమస్యను పరిష్కరించి తాగునీరు అందించాలని వారు కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక మహిళలు పారిజాతం, లక్ష్మిదేవి, ఈశ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు.
మోసగించిన వ్యక్తి ఇంటివద్ద బాధితుల ఆందోళన