
పిచ్చికుక్క స్వైర విహారం
బద్వేలు అర్బన్ : పట్టణంలో అబ్బరాతివీధిలో ఆదివారం పిచ్చికుక్క స్వైర విహారం చేసింది. ఈ ఘటనలో ఓ బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. అబ్బరాతివీధికి చెందిన మోహన్ కళ్యాణ్ ఇంటి ముందు ఆడుకుంటుండగా పిచ్చికుక్క ఒక్కసారిగా మీద పడి దాడి చేసింది. తీవ్ర గాయం కావడంతో తల్లిదండ్రులు పట్టణంలోని ఓ ప్రై వేటు ఆసుపత్రిలో చికిత్స చేయించారు. అలాగే పట్టణంలోని కోటవీధిలో కృతిక్ అనే బాలుడు, పప్పుల వీధిలో సన్విన్ అనే బాలిక పిచ్చికుక్క దాడిలో గాయపడ్డారు. పట్టణంలో పిచ్చికుక్క స్వైరవిహారం చేస్తున్న విషయం తెలిసిన వెంటనే మున్సిపల్ కమిషనర్ వి.వి.నరసింహారెడ్డి కుక్కను పట్టుకునేందుకు మున్సిపల్ సిబ్బందిని పురమాయించారు. ఎట్టకేలకు అబ్బరాతివీధిలో మున్సిపల్ సిబ్బంది పిచ్చికుక్కను పట్టుకుని అంతమొందించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారులను మున్సిపల్ కమిషనర్ పరామర్శించారు.
గుంటూరు కొట్టాలులో చోరీ
మైదుకూరు : మైదుకూరు మున్సిపాలిటీ పరిధిలోని గుంటూరు కొట్టాలు గ్రామంలో నాగిరెడ్డి వెంకటసుబ్బారెడ్డి అనే వ్యక్తి ఇంట్లో దుండగులు చోరీ చేశారు. ఆదివారం తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో జరిగినట్టుగా భావిస్తున్న ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. వెంకటసుబ్బారెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి ఇంటి వసారాలో నిద్రిస్తున్నారు. ఇంటి వెనుక వైపున గోడకు కన్నం వేసిన దుండగులు ఇంటిలోకి ప్రవేశించి బీరువా పగలగొట్టారు. అందులోని 15 తులాల బంగారు ఆభరణాలు, 5 తులాల వెండి వస్తువులు, రూ.25 లక్షల నగదును దోచుకెళ్లారు. ఉదయం లేచి ఇంటిలోకి వెళ్లిన వెంకటసుబ్బారెడ్డి బీరువాలోని వస్తువులు, దుస్తులు చిందరవందరగా ఉండటంతో చోరీ జరిగినట్టు గుర్తించారు. సంఘటనపై మైదుకూరు అర్బన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మైదుకూరు డీఎస్పీ రాజేంద్రప్రసాద్ బాధితుని ఇంటిని పరిశీలించారు. క్లూస్ టీం సభ్యులు ఇంటిలో వేలిముద్రలను సేకరించారు. అర్బన్ ఎస్‌ఐ చిరంజీవి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

పిచ్చికుక్క స్వైర విహారం