
ఒక భూమి అమ్మితే మరో భూమి ఆక్రమించారు
కడప రూరల్ : అధికార పార్టీ నేతల అండతో భూ ఆక్రమణకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని చింతకొమ్మదిన్నె మండలం, లింగారెడ్డిపల్లెకు చెందిన బి.ఈశ్వర్‌రెడ్డి కోరారు. మండల పరిధిలోని బుగ్గలేటిపల్లె గ్రామ పంచాయతీలో చిత్తూరు ప్రధాన రహదారికి ఆనుకొని తనకు మొత్తం 3.70 ఎకరాల భూమి ఉందన్నారు. ఇరవై ఏళ్ల కిందట రోడ్డుకు ఆనుకొని ఉన్న తన మొత్తం భూమిలో వెనుకవైపున ఉన్న 70 సెంట్లను కడప నగరం ఐటీఐ సర్కిల్‌లో నివాసముంటున్న ఒక వ్యక్తికి విక్రయించానని పేర్కొన్నారు. తరువాత తాను ఉపాధి నిమిత్తం ఇతర ప్రాంతాలకు వెళ్లానని తెలిపారు. కాగా ఇటీవల నాలుగు నెలల క్రితం తన భూమిని పరిశీలించగా, తన నుంచి 70 సెంట్ల భూమిని కొనుగోలు చేసిన వ్యక్తి అక్రమంగా రోడ్డుకు ఆనుకొని ఉన్న 50 సెంట్ల స్థలాన్ని ఆక్రమించుకొని ఫినిషింగ్ వేశారని ఆరోపించారు. ఈ విషయమై ఆక్రమించిన వ్యక్తిని ప్రశ్నించగా ఇది తన స్ధలం, ఎవరికి చెప్పుకుంటావో.. చెప్పుకోపో నువ్వు వెనక ఉన్న స్థలం తీసుకోపో అని బెదించారన్నారు. సర్వేయర్ వచ్చి కొలతలు వేసి చెప్పినా కూడా ఆక్రమించిన వ్యక్తి వినుకోవడం లేదన్నారు. ఈ విషయమై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశామని, ఆయన చింతకొమ్మదిన్నె పోలీసు స్టేషన్‌కు రెఫర్ చేశారని తెలిపారు. అక్కడికి వెళితే పోలీసులు ఏ మాత్రం స్పందించలేదని వాపోయారు. రెవెన్యూ సిబ్బంది కూడా ఆక్రమించిన వ్యక్తికే వత్తాసు పలుకుతున్నారన్నారు. ఈ విషయమై మరోమారు సోమవారం జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. సమావేశంలో నాగమునెమ్మ, ఈశ్వర్‌రెడ్డి, వీరమ్మ తదితరులు పాల్గొన్నారు.
న్యాయం కోసం బాధితుడి వేడుకోలు