
విద్యార్థినికి టీసీ ఇవ్వడంపై ఆందోళన
మైదుకూరు : మైదుకూరు మండలం వనిపెంటలోని మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ బాలికల గురుకుల పాఠశాలలో కె.లోకేశ్వరి అనే విద్యార్థినికి ప్రిన్సిపాల్ టీసీ ఇచ్చి పంపడంపై విద్యార్థిని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. వనిపెంట ఎస్సీ కాలనీకి చెందిన లోకేశ్వరి గురుకుల పాఠశాలలో 6వ తరగతి పూర్తి చేసుకుంది. 7వ తరగతిలోకి ప్రవేశించాల్సి ఉన్న ఆ విద్యార్థిని పాఠశాల పునః ప్రారంభమై నెల రోజులు దాటినా పాఠశాలకు రాలేదు. శుక్రవారం లోకేశ్వరి పాఠశాలకు రావడంతో ప్రిన్సిపాల్ వి.నిర్మల టీసీ ఇచ్చి ఇంటికి పంపారు. ఆ విషయమై విద్యార్థిని తల్లిదండ్రులు వసంత, వీరయ్య పాఠశాల వద్దకు చేరుకుని తమ కుమార్తెను తిరిగి పాఠశాలలో చేర్చుకోవాలని ప్రిన్సిపాల్‌ను కోరగా ఆమె ససేమిరా అన్నారు. ఈ విషయం సోషల్ మీడియాలో రావడంతో శనివారం పాఠశాల వద్దకు వెళ్లిన విలేకరులు లోకేశ్వరి విషయంపై ప్రిన్సిపాల్‌ను వివరణ కోరారు. లోకేశ్వరి సక్రమంగా చదవడం లేదని, పాఠ్యపుస్తకాలను చించడం, యూనిఫాం వేసుకోకుండా క్లాసులకు రావడం చేస్తూ ఉండేదని ప్రిన్సిపాల్ నిర్మల తెలిపారు. తోటి విద్యార్థినులను కొట్టేదన్నారు. ఈ విషయంపై ఉపాధ్యాయులు, విద్యార్థినులు చాలా సార్లు తనకు ఫిర్యాదు చేశారని తెలిపారు. విద్యార్థిని విషయంపై కమిటీలో చర్చించి టీసీ ఇచ్చి పంపాలని నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. కాగా గురుకుల పాఠశాల సంఘటనపై డీఈఓ ఆదేశాలతో శనివారం సాయంత్రం మైదుకూరు మండల విద్యాశాఖాధికారి పద్మలత పాఠశాలకు చేరుకుని విచారించారు. ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థినులతో మాట్లాడారు. ఆ మేరకు డీఈఓకు నివేదిక పంపుతామని ఎంఈఓ తెలిపారు.