
పేదలకు పౌష్టికాహారం అందించేందుకు కృషి
కడప సెవెన్‌రోడ్స్: జిల్లాలోని గ్రామీణ ప్రాంత ప్రజల పౌష్టికాహారం మెరుగు పరిచేందుకు ఐఎస్‌బీ, బిల్‌గేట్స్ ఫౌండేషన్స్ బాసటగా నిలుస్తున్నాయని జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి తెలిపారు. ఎనాక్ట్స్ ప్రాజెక్ట్, ఎనేబుల్ అగ్రికల్చర్ న్యూట్రిషన్ కన్వర్జేన్స్ త్రు టెక్నికల్ సపోర్ట్‌లో భాగంగా భారతీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ పాలసీ, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బిజినెస్(ఐఎస్‌బీ) భాగస్వామ్యంతో జిల్లాలో పౌష్టికాహార లోపం ఉన్న వారిని గుర్తించి పౌష్టికాహారం పెంపొందించడానికి జిల్లా కలెక్టర్ ఆధ్యర్యంలో గురువారం ఆన్‌లైన్ జూమ్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ పాలసీ ఐఎస్‌బీ వారి ఆధ్వర్యంలో బిల్ గేట్స్ ఫౌండేషన్ సహకారంతో జిల్లాలోని పౌష్టికాహార లోపంతో ఉన్న మహిళలు, పిల్లలకు న్యూట్రిషన్ ఫుడ్ అందించేందుకు ఎనాక్ట్స్ ప్రాజెక్ట్ ద్వారా ఆకాంక్షిత జిల్లాలో భాగంగా మొదటగా చింతకొమ్మదిన్నె, జమ్మలమడుగు మండలాలలో అమలు చేసి తర్వాత జిల్లా వ్యాప్తంగా అమలు చేసేందుకు ఒప్పందం కుదిరిందన్నారు. గ్రామీణ కుటుంబాలకు పోషక ఆహారాన్ని అందుబాటులోకి తీసుకురావడానికి పోషక అంశాలపై భారతీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ పాలసీ, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ సహకారంతో జిల్లాలో అధ్యయనం చేయనున్నారని తెలిపారు. పౌష్టికాహార, ప్రోటీన్ ఆహార పదార్థాలను కొనలేని స్థితిలో చాలా మంది ప్రజలు ఉన్నారని, వారందరికీ అందుబాటులో సరసమైన ధరల్లో పౌష్టికాహారం బహుళ రంగ మార్కెట్ల ద్వారా అందించడానికి ఈ సంస్థలు కృషి చేస్తున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
బాసటగా ఐఎస్‌బీ, బిల్‌గేట్స్ ఫౌండేషన్‌లు
కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి