
తెలుగు తమ్ముళ్ల తన్నులాట
కలసపాడు : స్థానిక తెలుగు దేశం పార్టీ కార్యాలయంలో గురువారం టీడీపీ జిల్లా మైనారిటీ పార్లమెంట్ అధ్యక్షుడు, కలసపాడు పార్టీ అబ్జర్వర్ ఖాదర్‌బాషా, టీడీపీ మండల అధ్యక్షుడు జి.వెంకటరామిరెడ్డి ఆధ్వర్యంలో బూత్ కన్వీనర్ల, పార్టీ సంస్థాగత ఎన్నికలపై సమావేశం నిర్వహించారు. మండలంలోని ఇ.తంబళ్లపల్లె గ్రామానికి చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు ప్రహ్లాద రెడ్డికి, ఎన్నికల ముందు వైఎస్సార్‌సీపీ నుంచి టీడీపీలో చేరిన నారాయణ రెడ్డి వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. వైఎస్సార్‌సీపీకి కోవర్టుగా ప్రహ్లాదరెడ్డి పనిచేస్తున్నాడని నారాయణరెడ్డి ఆరోపించాడు. తాను ఈ పార్టీలో ఉన్నానని, వైఎస్సార్‌సీపీ నుంచి వచ్చి తనను విమర్శిస్తావా అని ప్రహ్లాదరెడ్డి నారాయణరెడ్డితో వాగ్వాదానికి దిగారు. ఈ విషయంలో మార్కెట్ యార్డు మాజీ చైర్మన్, టీడీపీ నాయకుడు సాధనకారి రంతు జోక్యం చేసుకోవడంతో మరింత ఉద్రిక్తతకు దారి తీసింది. దీంతో పార్టీ కార్యాలయంలోనే తన్నులాట కొనసాగించి ఒకరిపై ఒకరు పిడిగుద్దులు గుద్దుకుంటూ చొక్కాలు చించుకుని వీరంగం సృష్టించారు. మండలంలో గత కొంత కాలంగా ప్రహ్లాదరెడ్డి టీడీపీలో జరుగుతున్న అన్యాయాలపై స్థానిక మీడియా ద్వారా అధిష్టానాన్ని ప్రశ్నిస్తున్నారు. పార్టీకి వీరవిధేయుడుగా ఉన్న ప్రహ్లాదరెడ్డి అంటే నియోజకవర్గ యువ నాయకుడికి నచ్చలేదు. దీనిని దృష్టిలో ఉంచుకుని ఏదో ఒక విధంగా ప్రహ్లాదరెడ్డిపై దాడి చేయాలని ముందుగా నిర్ణయించుకుని పథకం ప్రకారం దాడి చేసినట్లు మండలంలో ప్రచారం జరుగుతోంది. తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నా సకాలంలో స్పందించి చర్యలు తీసుకోవాల్సిన పోలీసులు ప్రేక్షక పాత్ర వహించడం పలు విమర్శలకు తావిస్తోంది. పోరుమామిళ్ల సీఐ శ్రీనివాసులు కలసపాడుకు చేరుకుని కొంత మేర సమస్యను సద్దుమణిగేలా చూశారు. తర్వాత ప్రహ్లాదరెడ్డిని పోలీస్ స్టేషన్‌కు పిలిపించి తీవ్ర స్థాయిలో మందలించినట్లు తెలిసింది. మండలంలో తెలుగు తమ్ముళ్లు రెండు గ్రూపులుగా విడిపోయి ఒకరిపై ఒకరు ఇటీవల విమర్శలు గుప్పించడంతోపాటు ఆధిపత్యానికి తెరతీశారు. మండలంలో అంతంత మాత్రమే బలం ఉన్న టీడీపీ రెండు గ్రూపులుగా విడిపోయి బాహాబాహికి దిగడంతో పార్టీ పరిస్థితి మరింత దిగజారిందని తెలుగు తమ్ముళ్లు చర్చించుకుంటున్నారు.
కలసపాడులో ఉద్రిక్తత
ప్రేక్షక పాత్ర వహించిన పోలీసులు