
రైతులను నట్టేట ముంచిన సీడ్స్ యాజమాన్యం
పోరుమామిళ్ల : మొక్కజొన్న పంటకు పొలంలోనే డబ్బులు ఇచ్చి తీసుకెళతామని చెప్పి లక్ష్మీప్రసన్న సీడ్స్ యాజమాన్యం రైతులను నమ్మించి నట్టేట ముంచిందని సీపీఐ ఏరియా కార్యదర్శి పాడుగు మస్తాన్ ఆరోపించారు. బుధవారం ఆయన రైతులతో కలసి మొక్కజొన్న సీడ్స్ ఏజెంట్లు, యాజమాని నిర్వాకం వివరించారు. పోరుమామిళ్ల మండలంలో మొక్కజొన్న సీడ్స్ డీలర్ వెంకటేశ్వరరెడ్డి, ఏజంట్లు గురయ్య, శ్రీను, ప్రసాద్ రైతులకు విత్తనాలు ఇచ్చి, పండిన పంటకు క్వింటాకు రూ. 60 వేలు ఇస్తామని చెప్పారన్నారు. రామాయపల్లెలో వారి మాటలు నమ్మి మొక్కజొన్న సాగు చేసి వచ్చిన పంటను వారికి అందజేశారన్నారు. పంట తీసుకెళ్లిన సీడ్స్ యాజమాన్యం రైతులకు డబ్బు ఇవ్వలేదన్నారు. రామాయపల్లె రైతులతో పాటు సిద్దవరం, అగ్రహారం, క్రిష్ణంపల్లె, కలసపాడు, బి.మఠం మండలాల్లో కొన్ని గ్రామాల్లోని రైతులు కూడా మోసపోయారన్నారు. సీడ్స్ కంపెనీ యాజమాన్యంపై అధికారులు చర్యలు తీసుకోవాలని, రైతులకు న్యాయంగా ఇవ్వాల్సిన డబ్బు ఇప్పించాలని ఆయన కోరారు.