కడప కోటిరెడ్డిసర్కిల్ : కడప నగరం రిమ్స్ పోలీసు స్టేషన్ పరిధిలోని శ్రీనగర్ కాలనీకి చెందిన ఓ మహిళ తన ఇద్దరు బిడ్డలతో అదృశ్యమైనట్లు రిమ్స్ ఎస్‌ఐ సుభాష్ చంద్రబోస్ తెలిపారు. ఆయన కథనం మేరకు...రాజేశ్వరి అనే మహిళ తన బిడ్డలైన గురు రాజేశ్వరి, గురు ఈశ్వరితో కలిసి ఈనెల 13వ తేదీన పిల్లలకు స్కూలులో వదిలి పెడతామని చెప్పి వెళ్లిపోయింది. ఆ తర్వాత తిరిగి రాకపోవడంతో ఆమె తల్లి శాంతమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ తెలిపారు.
బంగారు గొలుసు చోరీ
వల్లూరు : మండల కేంద్రమైన వల్లూరులోని ఎస్సీ కాలనీలో మంగళవారం తెల్లవారుజామున గుర్తు తెలియని దుండగులు నిద్రిస్తున్న మహిళ మెడలోని బంగారు గొలుసును చోరీ చేశారు. పోలీసులు తెలిపిన సమాచారం మేరకు ఎస్సీ కాలనీకి చెందిన బూసిపాటి శ్యామల తన ఇంటి ఆవరణలో నిద్రిస్తుండగా దుండగులు ప్రహరీ దూకి ఆమె మెడలోని మూడు తులాల బంగారు గొలుసును లాక్కుని పరారయ్యారు. ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కమలాపురం సీఐ ఎస్‌కే రోషన్, ఎస్‌ఐ పెద్ద ఓబన్న సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. పోలీసు జాగిలాన్ని రప్పించి తనిఖీలు నిర్వహించారు.
అప్పుల బాధతో రైతు ఆత్మహత్య
కలసపాడు : మండలంలోని బ్రాహ్మణపల్లె గ్రామానికి చెందిన రాచకొండు వెంకటరమణ (55) మంగళవారం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. వెంకటరమణ గ్రామంలో రెండు ఎకరాల సొంత పొలంతోపాటు 10 ఎకరాలను కౌలుకు తీసుకుని పంటలను సాగు చేశాడు. ఈ క్రమంలో పంటల సాగుకు రూ.18లక్షలు అప్పులు చేశాడు. ఆ అప్పులు తీర్చే పరిస్థితి లేక మంగళవారం తన పొలం వద్ద పురుగుల మందు తాగాడు. పోరుమామిళ్ల ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతుని కుమారుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.
ఇద్దరు మట్కా బీటర్ల అరెస్టు
కడప కోటిరెడ్డిసర్కిల్ : స్థానిక నాగరాజుపేటలో ఇద్దరు మట్కా బీటర్లను అరెస్టు చేసినట్లు ఎస్‌ఐ అమరనాథ్‌రెడ్డి తెలిపారు. సీఐ రామకృష్ణ ఆదేశాల మేరకు తన బృందంతో నాగరాజుపేట సమీపంలో మట్కా ఆడుతున్న సంజామల మధు, కోడేదుల మాబుసుబాన్‌లను అరెస్టు చేసి రూ. 2850 నగదు, మట్కా స్లిప్పులను స్వాఽధీనం చేసుకున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

తల్లీబిడ్డలు అదృశ్యం