
పంచాయతీరాజ్ ఎస్‌ఈకి పదోన్నతి
కడప సెవెన్‌రోడ్స్: పంచాయతీరాజ్ జిల్లా పర్యవేక్షక ఇంజనీరుగా పనిచేస్తున్న జీవీ శ్రీనివాసులురెడ్డికి రాష్ట్ర ప్రభుత్వం చీఫ్ ఇంజనీరుగా పదోన్నతి కల్పించింది. ఇందుకు సంబంధించి మంగళవారం జీఓ ఆర్‌టీ నెంబరు 528 జారీ చేసింది. పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్‌శాఖ జాయింట్ సెక్రటరీగా పనిచేస్తూ ఈనెల 30న రిటైర్ కాబోతున్న ఎన్.కృష్ణారెడ్డి స్థానంలో జీవీ శ్రీనివాసులు రెడ్డిని ప్రభుత్వం నియమించింది.
నేడు నిరసన
కడప వైఎస్‌ఆర్ సర్కిల్: ప్రపంచ శాంతి కోసం వామపక్షాలు బుధవారం నిరసన చేపడుతున్నట్లు సీపీఎం జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్ పేర్కొన్నారు. మంగళవారం నగరంలోని సీపీఎం జిల్లా కార్యాలయంలో జిల్లా వామపక్ష పార్టీల ఐక్య కార్యచరణ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమెరికా సామ్రాజ్యవాద వైఖరితో ఇజ్రాయులకు మద్దతుగా ఇరాన్ పై ప్రత్యక్ష యుద్ధానికి దిగడం అంతర్జాతీయ న్యాయ చట్టాలకు పూర్తిగా విరుద్ధమైన వైఖరి అని విమర్శించారు. అమెరికా సామ్రాజ్యవాదాన్ని నిరసిస్తూ, ఇజ్రాయిల్ మారణ హోమాన్ని ఆపాలని, దేశవ్యాప్తంగా జూన్ 25వ తేదీ అన్ని రాష్ట్రాలలో, అన్ని జిల్లా కేంద్రాలలో, ప్రపంచ శాంతి వర్ధిల్లాలని, అంతర్జాతీయ న్యాయ చట్టాలు కాపాడాలని, సామ్రాజ్యవాదం నశించాలని తెలియజేస్తూ దేశ ప్రజల నిరసనలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఏ.రామ్మోహన్, బాదుల్లా, వి.అన్వేష్, జిల్లా కమిటీ సభ్యులు కే.శ్రీనివాసు రెడ్డి, బి.దస్తగిరి రెడ్డి, ఆర్.ఎస్.పి జిల్లా కార్యదర్శి కే.సుబ్బరాయుడు, జిల్లా నాయకులు డి.గోపి, నరసింహారావు, సీపీఐ (ఎంఎల్ ) న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి డబ్ల్యూ రాము, ఆర్.ఎం.పి.ఐ రాష్ట్ర కార్యదర్శి జి.రమణయ్య, సీపీఐ (ఎంఎల్) లేబరేషన్ జిల్లా కార్యదర్శి బి.ఓబయ్య తదితరులు పాల్గొన్నారు.
సీఎంఏలో 44వ ర్యాంకు
లక్కిరెడ్డిపల్లి: మండల పరిధి అనంతపురం పంచాయతీలోని గుడ్లవారిపల్లికి చెందిన గూడె వెంకటరమణ సీఎంఏలో ఆల్ ఇండియా కోటాలో 44వ ర్యాంకు సాధించారు. ఈ విద్యార్థి మంగళవారం ఢిల్లీలో గోల్డ్ మెడల్ అందుకున్నారు. వెంకటరమణ నిరుపేద కుటుంబంలో పుట్టారు. ఐదో తరగతి వరకు లక్కిరెడ్డిపల్లి విశ్వభారతి హైస్కూల్, ఏపీ మోడల్ స్కూల్‌లో పదో తరగతి వరకు, ఇంటర్ గుంటూరు మాస్టర్ మైండ్ కళాశాలలో చదివారు. ఉత్తమ ర్యాంకు సాధించేందుకు తల్లిదండ్రులు సహదేవరెడ్డి, రెడ్డమ్మ, ఉపాధ్యాయుల సహకారం మరువలేనిదని ఆయన అన్నారు. వెంకటరమణ దేశ స్థాయిలో అత్యుత్తమ ర్యాంక్ సాధించడంపై గ్రామస్తులు, బంధువులు హర్షం వ్యక్తం చేశారు.
‘ఉర్దూ’
నేర్చుకోవడానికి దోహదం
రాయచోటి టౌన్: ఉర్దూ భాషను సులభంగా నేర్చుకోవచ్చని జిల్లా విద్యాశాఖాధికారి సుబ్రహ్మణ్యం తెలిపారు. స్థానిక డీఈఓ కార్యాలయంలో మంగళవారం ‘ఉర్దూ భాషను సులభంగా నేర్చుకోండిలా’ అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ పుస్తకాన్ని అజీజియా ఎడ్యుకేషనల్ ట్రస్టు ఆధ్వర్యంలో రచయిత అబ్దుల్ వహీద్ విద్యార్థులకు సులభంగా అర్థమయ్యే విధంగా, త్వరగా నేర్చుకునే విధంగా రూపొందించారని పేర్కొన్నారు. ఇంగ్లిష్ మీడియం పాఠశాలలో రెండవ భాషగా ఉర్దూను ఎంచుకున్న విద్యార్థులకు ఎంతో ఉపయోగ పడుతుందని తెలిపారు. అనంతరం నోబుల్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు కొండూరు శ్రీనివాస రాజు మాట్లాడుతూ ఉర్దూ భాష నేర్చుకోవడానికి ఇలాంటి పుస్తకాలు ఎంతో అవసరం ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో రాయచోటి ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు చంద్రశేఖర్, రాష్ట్ర ఉర్దూ టీచర్స్ అసోసియేషన్ స్టేట్ కన్వీనర్ షేక్ మహమ్మద్ హషీం, పాలం రాజ, గోపాల్, బాబా ఫకృద్దీన్, సురేష్ బాబు తదితరులు పాల్గొన్నారు.

పంచాయతీరాజ్ ఎస్‌ఈకి పదోన్నతి