
లక్ష సౌర గృహాలే లక్ష్యం
కడప కార్పొరేషన్: జిల్లాలో లక్ష గృహాలకు సోలార్ రూఫ్ టాప్ అమర్చడమే లక్ష్యంగా పని చేయాలని విద్యుత్ శాఖ పర్యవేక్షక ఇంజినీరు ఎస్.రమణ అన్నారు. స్థానిక విద్యుత్ భవన్‌లోని తన చాంబర్‌లో బ్యాంకర్లు, అధికారులు, సంస్థాపన వెండర్లతో శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సోలార్ రూఫ్ టాప్ ఏర్పాటుకు నిబంధనలు సులభతరం చేశామని, వీటిని ప్రజలకు తెలియజేసి అవగాహన పెంచాలన్నారు. సిబిల్ స్కోర్‌ను బట్టి బ్యాంకులు రుణాలు వేగ వంతం ఇస్తాయని తెలిపారు. ఒక్క కిలో వాట్ కెపాసిటీ సోలార్ రూఫ్ టాప్ ఏర్పాటు చేసుకుంటే నెలకు 120 యూనిట్ల విద్యుత్తు, రెండు కిలోవాట్ల కెపాసిటీ సోలార్ రూఫ్ టాప్ ఏర్పాటు చేసుకుంటే 240 యూనిట్ల విద్యుత్తు ఉత్పత్తి చేస్తుందన్నారు. వినియోగదారులు ప్రధానమంత్రి సూర్య ఘర్ యోజన పథకం ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సబ్సిడీ పొంది సోలార్ రూఫ్ టాప్ ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఈ సమావేశంలో బ్యాంకర్స్ లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ జి.జనార్దన్, నెడ్ క్యాప్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ యల్లారెడ్డి, అకౌంట్స్ ఆఫీసర్ మల్లికార్జున, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు మధుసూదన్, హరిసేవ్య నాయక్, భరణి క్రిష్ణ, ప్రసాద్‌రెడ్డి, డీఈఈ మోహన్ తదితరులు పాల్గొన్నారు.