
సొంత వైద్యం.. కోరి కష్టం!
‘గంట్యాడ మండలానికి చెందిన రామయ్యమ్మ అనే మహిళ నడుం, తలనొప్పి సమస్యలకు మందుల దుకాణంలో కొనుగోలు చేసిన నొప్పి తగ్గిన మందులు ఎక్కువగా వాడేసింది. దీనివల్ల ఆమె రెండు కిడ్నీలు పాడయ్యాయి. ఏడాది పాటు డయాలసిస్ చేయించుకున్నా ఫలితం లేకపోయింది. చివరికి మరణించింది.’
––––––––––––––––––––––––––––
‘విజయనగరం పట్టణానికి చెందిన అచారి అనే వ్యక్తి కాలికి ఇన్‌ఫెక్షన్ కావడంతో నొప్పి తగ్గే మాత్రలు, యాంటీ బయాటిక్ మాత్రలను వైద్యుల సూచన లేకుండా వాడాడు. చివరికి మందులు పనిచేయలేదు. శరీరమంతా ఇన్‌ఫెక్షన్ సోకింది.’
విజయనగరం ఫోర్ట్: ఏదైనా అస్వస్థతకు గురైతే వైద్యులను సంప్రదించాలి. పరీక్షలు చేయించుకుని ఆ నివేదికల ఆధారంగా మందులు వాడాలి. దీనివల్ల శరీరంలోని మిగిలిన అవయవాలపై ఎలాంటి దుష్ప్రభావం పడదు. కానీ, కొందరు తమకు వైద్యం తెలుసు అన్నట్టుగా సొంతంగా దుకాణాల్లో మందులు కొనుగోలు చేసి వాడుతున్నారు. దీనివల్ల ఆరోగ్యసమస్యలు కోరి తెచ్చుకుంటున్నారని వైద్యులు చెబుతున్నారు. నొప్పి మాత్రలు, యాంటీ బయాటిక్ మందులు అధిక మోతుదులో వాడడం వల్ల వాటి ప్రభావం కిడ్నీ, లివర్‌పై పడుతుందని, ప్రాణాలమీదకి వస్తుందని పేర్కొంటున్నారు.
చిన్న సమస్యలకు సైతం యాంటీబయాటిక్స్...
గ్రామీణ ప్రాంతాల ప్రజలు తెలిసీతెలియని వైద్యసేవలందించే వారి సలహాల మేరకు మొతాదుకు మించి యాంటీ బయాటిక్స్ వాడుతున్నారు. జలుబు, దగ్గు, జ్వరం, తలనొప్పి, నడుంనొప్పి, చర్మ వ్యాధులు... ఇలా ఏ జబ్బుకు అయినా యాంటీ బయాటిక్స్ తప్పనిసరిగా వాడుతున్నారు. దీర్ఘకాలిక వ్యాధులను తెలుసుకోకుండా ఆర్‌ఎంపీలు ఇస్తున్న మందులు వాడుతూ కిడ్నీ, కాలేయ వ్యాధుల బారిన పడుతున్నారు.
వైద్యుడి చీటీ లేకుండానే మందుల అమ్మకాలు..
వైద్యుల చీటీ లేకుండానే మందుల దుకాణాల్లో విచ్చలవిడిగా యాంటీబయాటిక్స్ మందుల విక్రయం కూడా ప్రజల ఆరోగ్యానికి హానికలిగిస్తోందన్నది వైద్యుల మాట. రైతులు, కూలీలు ఒళ్లు నొప్పులు వచ్చిన ప్రతిసారి డైక్లోఫినాక్ ఇంజక్షన్, యాంటీ బయోటిక్ మాత్రలను మందుల దుకాణాల్లో కొనుగోలుచేసి వాడుతున్నారని, దీనివల్ల ఆరోగ్యసమస్యల్లో చిక్కుకుంటున్నారని వైద్యులు చెబుతున్నారు. వైద్యుల చీటీ ఉంటేనే మందులు ఇవ్వాలని సూచిస్తున్నారు.
ఆన్‌లైన్‌లో పరిశోధన..
చాలామంది ఇప్పుడు ఆరోగ్య సమస్యలకు ఆన్‌లైన్‌లో మందులు వెతుకుతున్నారు. ఆస్పత్రుల్లో వైద్యులు వివిధ రకాల వ్యాధులకు రాసి ఇచ్చిన ప్రిస్కప్షన్‌లను సైతం పక్కన పెట్టేస్తున్నారు. ఆన్‌లైన్‌లో సంబంధిత వ్యాధులకు ఎటువంటి మందులు వాడితే తగ్గుతుందన్నది పరిశోధన చేసి వాటినే వాడుతున్నారు. ఇది చాలా అనర్ధాలకు దారితీస్తుందని, రోగిని భౌతికంగా పరీక్షించకుండా, అతనికి ఆ వ్యాధి కాకుండా బీపీ, సుగర్, గుండె జబ్బులు ఏవైనా ఉన్నాయో తెలుసుకోకుండా ఆన్‌లైన్‌లో పరిశోధన చేసి మందులు వాడడం రోగికి ఇతర ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు.
వైద్యుల సలహామేరకే మందులు వాడాలి
వైద్యుల సలహా మేరకే మందులు వాడాలి. లేదంటే ఇతర ఆరోగ్య సమస్యలు చుట్టుముడతాయి. ప్రిస్కప్షన్ లేకుండా మందులు విక్రయిస్తే సంబంధిత మెడికల్ షాపు యజమానిపై చర్యలు తీసుకుంటాం. నిషేధిత మందులు, కాల పరిమితి అయిన మందులు విక్రయిస్తే కేసులు నమోదు చేయిస్తాం.
– కె.రజిత, అసిస్టెంట్ డైరెక్టర్,
ఔషధ నియంత్రణశాఖ
చిన్నచిన్న ఆరోగ్య సమస్యలకు యాంటీబయాటిక్ మందుల వినియోగం
ఇవి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం
కిడ్నీ, లివర్‌పై దుష్ప్రభావం
వైద్యుల సలహా మేరకు మందులు వాడాడం మంచిది