
విఘ్నాలు లేని యజ్ఞం
వీరఘట్టం: ఆయన ఆలయ ప్రారంభోత్సవ పూజా కార్యక్రమాల యోగి. ఆయనను కొందరు యజ్ఞ పంతులుగా, మరికొందరు పెద్ద పంతులుగా, ఇంకొందరు శర్మయాజీగా పిలుస్తుంటారు. ఆయనే వీరఘట్టంకు చెందిన సర్వాజ్యోస్యుల వెంకటలక్ష్మీ నరిసింహ శర్మ. గత 50 ఏళ్లుగా ఆంధ్రా, ఒడిశా రాష్ట్రాలలోని పలు ప్రాంతాలలో ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు. గతేడాది జరిగిన వీరఘట్టం కోటదుర్గతల్లి ఆలయ ప్రారంభోత్సవంతో పాటు 6 వేల యజ్ఞాలను పూర్తిచేశారు. వీరఘట్టం మండలం వండవ కాశీవిశ్వేశ్వరస్వామి ఆలయం, కిమ్మిలోని ఉమా కాశీవిశ్వేశ్వరస్వామి ఆలయం, సంతకవిటి మండలం మోదుగులపేట గ్రామంలో నిర్మించిన కాశీవిశ్వేశ్వరస్వామి ఆలయం, పాలకొండలోని షిర్డిసాయిబాబా ఆలయంలో బాబా విగ్రహం, నాగబంధ ప్రతిష్ఠ, ప్రారంభోత్సవాలతో పాటు వేలసంఖ్యలో యజ్ఞాలను పూర్తి చేసి కీర్తిప్రతిష్టలు గడించారు. గతేడాది 100కు పైగా నూతన ఆలయ ప్రారంభోత్సవాలు జరిపారు. ఏపీతో పాటు ఒడిశా, పశ్చిమబెంగాల్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోనూ పలు ఆలయ, విగ్రహ ప్రతిష్ఠాకార్యక్రమాల్లో పాల్గొన్నారు. చిన్నతిరుపతిగా కొలవబడే తోటపల్లి వేంకటేశ్వర స్వామి దేవస్థానంలో వెంకన్న కళ్యాణం కూడా శర్మయాజీనే ఏటా జరుపుతుంటారు. ఇదంతా దేవుడి కృపగా ఆయన భావిస్తారు. ప్రజల్లో ఆధ్యాత్మిక చింతనను పెంపొందిస్తూ ప్రశాంత జీవనానికి బాటలు వేస్తున్న శర్మయాజీ మూడువేలకు పైగా పౌరసన్మానాలు అందుకున్నారు.
యజ్ఞాలకు కేరాఫ్ అడ్రస్‌గా ఎస్‌వీఎల్‌ఎన్ శర్మయాజీ
6 వేలకు పైగా ఆలయాల ప్రారంభోత్సవ పూజలు
3వేలకు పైగా పౌరసన్మానాలు
ఆంధ్రా, ఒడిశా రాష్ట్రాలలో మంచి గుర్తింపు

విఘ్నాలు లేని యజ్ఞం